ఏపీలోని పలు జిల్లాల్లోనూ కంపించిన భూమి

12 May, 2015 13:54 IST|Sakshi
ఏపీలోని పలు జిల్లాల్లోనూ కంపించిన భూమి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా భూకంప ప్రభావం కనిపించింది. రిక్టర్ స్కేలు మీద దీని తీవ్రత 5.4 గా నమోదైనట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. మధురవాడ, పీఎం పాలెం, మాధవధార, మురళీనగర్, విశాలాక్షి నగర్ తదితర ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. అయితే నగరంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రభావం అంతగా లేదని విశాఖపట్నానికి చెందిన సురేష్ తెలిపారు. తాను ఆఫీసు పనిమీద ఉదయమే బయటకు వచ్చేశానని, తల్లిదండ్రులు, స్నేహితులు చెబితే తప్ప అసలు విశాఖలో భూకంపం వచ్చినట్లే అనిపించలేదని అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, కాళ్లకూరు, మొగల్తూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పరిసరాల్లోని కొన్ని ప్రాంతాలపై భూకంపం ప్రభావం కనిపించింది. కృష్ణాజిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. విజయవాడలోని బెంజి సర్కిల్ కృష్ణలంక, భవానీపురం తదితర ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు