తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు 

27 Jan, 2020 04:59 IST|Sakshi

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేకువజామున అలజడి.. రాజధాని అమరావతిలోనూ కంపించిన భూమి 

తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనూ భూప్రకంపనలు 

సాక్షి, అమరావతి బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. వేకువజామున 2.37 నుంచి 2.50 గంటల మధ్య కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి లేచి బయటకు పరుగులు తీశారు. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, రాజధాని అమరావతి ప్రాంతంలో, తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భూమి కంపించింది. దీంతో మంచాలు అటూ ఇటూ ఊగాయి. ఎత్తులో ఉన్న సామాన్లు, వస్తువులు కింద పడ్డాయి. దీనికి తోడు పెద్దగా శబ్దాలు కూడా రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపంగా భావించి ఇళ్లల్లోంచి పిల్లా, పాపలతో రోడ్లపైకి పరుగెత్తారు. భూకంపం సంభవిస్తుందన్న భయంతో పలువురు ఉదయం వరకు మళ్లీ ఇళ్లల్లోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ భూప్రకంపనలు కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలతోపాటు విజయవాడ నగరంలోని భవానీపురం, విద్యాధరపురం, గుంటూరు జిల్లా మాచవరం, బెల్లంకొండ, పిడుగురాళ్ల, అచ్చంపేట, తాడికొండ, క్రోసూరు, నాదెండ్ల, సత్తెనపల్లి తదితర మండలాల్లో అలజడి రేపాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా వెలటూరులో ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.6గా నమోదైనట్టు హైదరాబాద్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) గుర్తించింది. కాగా శనివారం టర్కీలో భారీ భూకంపం సంభవించిన కొన్ని గంటలకే తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఆ ప్రభావం ఇక్కడ కూడా ఉండొచ్చని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ టర్కీ మన దేశానికి చాలా దూరంలో ఉండడం వల్ల దాని ప్రభావం కాదని నిపుణులు స్పష్టం చేశారు. 

నెల రోజుల్లో 300 సార్లు..
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో గత నెల రోజులుగా భూమి కంపిస్తోంది. ఒక్కోరోజు పదుల సంఖ్యలో ప్రకంపనాలు వస్తుండటం, ప్రజల భయాందోళనలతో ఈ నెల 12న ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు చింతలపాలెం మండలంలోని దొండపాడుతోపాటు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి వద్ద సిస్మోగ్రాఫ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి ఇప్పటివరకు 300 సార్లు ఈ ప్రాంతంలో భూమి కంపించింది. అయితే.. తీవ్రత 2.5 దాటలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో సంభవించిన భూప్రకంపనల తీవ్రత హైదరాబాద్‌ నగరాన్నీ తాకింది. అయితే దీని తీవ్రత నగరంలో తక్కువగానే ఉంది. బోయిన్‌పల్లి, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్‌ తదితర ప్రాంతాల్లో కొందరి ఇళ్లల్లో వస్తువులు కిందపడిపోయాయి. 

మరిన్ని వార్తలు