ఇసుక కోసం ఆందోళన చెందవద్దు

5 Jun, 2020 20:35 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ఇసుక కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లా స్ధాయిలో ఇసుకపై ఒక అధ్యయనం చేశామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నూతన ఇసుక పాలసీ వచ్చిన తరువాత 112 రీచ్‌లకు అనుమతి ఇచ్చాం. ప్రస్తుతం 48 ఇసుక రీచ్‌లు పని చేస్తున్నాయి. 30 రీచ్‌లు ఇసుక లేని కారణంగా పని చేయడం లేదు. వాటిని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాధారణ ఇసుక వినియోగదారులు ఇప్పటి వరకు 9,19,900 మెట్రిక్ టన్నుల ఇసుకను బుక్ చేసుకున్నారు. దాంట్లో 8.29 లక్షల మెట్రిక్ టన్నులు( 90 శాతం) సరఫరా చేశాం. ప్రభుత్వ పనులకు 3.72 లక్షల మెట్రిక్ టన్నులకు గానూ 2 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశాం. నాడు-నేడు కార్యాక్రమానికి 50 వేల మెట్రిక్ టన్నులకు గానూ 39 వేల మెట్రిక్ టన్నులు ఇసుకను సప్లయి చేశాం.

ఇసుక రీచ్‌ల వద్ద సమస్యలు, ఆన్‌లైన్‌ బుకింగ్ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి. వాటి మీద మైనింగ్, ఎపీఎండీసీ అధికారులతో చర్చించాం. జేసీకే ఇసుక తవ్వకాలకు సంబంధించిన అనుమతులు ఇచ్చాం. అనుమతి కోసం అమరావతికి వెళ్లనవసరం లేదు. ఇసుక బల్క్ బుకింగ్ కూడా జాయింట్ కలెక్టర్( సంక్షేమం)కే అనుమతి అధికారం ఇచ్చాం. జిల్లాలో ఇసుక రిజర్వర్స్‌ పాయింట్లు ఉన్నాయి. వీటిలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక స్టోర్ చేసి పెట్టుకున్నాం. ప్రతి రోజు వీటి నుండి 30 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సప్లయి అవుతుంది. కెడ్రాయి సంస్ధ వాళ్లు తమ ఇసుక అవసరాల కోసం జేసీ (సంక్షేమం) నుండి అనుమతి తీసుకోవాలి.

మరిన్ని వార్తలు