జసిత్‌ కిడ్నాప్‌; వాట్సప్‌ కాల్‌ కలకలం

24 Jul, 2019 14:22 IST|Sakshi
సీసీ కెమెరాలో అనుమానితుడు.. జసిత్‌ (ఫైల్‌)

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అపహరణకు గురైన నాలుగేళ్ల చిన్నారి జసిత్‌ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీసీ కెమెరాలో అనుమానితులను గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు పలు బృందాలను రంగంలోకి దింపారు. చుట్టుపక్కల 15 గ్రామాలను జల్లెడ పడుతున్నారు. తమ కొడుకు ఆచూకీ కోసం జసిత్‌ తల్లిదండ్రులు తల్లిడిల్లుతున్నారు. తమ బాబు క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు.

మరోవైపు జసిత్‌ను ఢిల్లీలో చూశానని జసిత్‌ తండ్రి వెంకటరమణకు అజ్ఞాత వ్యక్తి ఒకరు వాట్సాప్‌ కాల్‌ చేశాడు. ఫేస్‌బుక్‌లో జసిత్‌ ఫొటో చూసి గుర్తుపట్టినట్టు వెల్లడించాడు. తన బ్యాంకు ఖాతాలో 5 వేల రూపాయలు వేస్తే సమాచారం చెబుతానని తెలిపాడు. వీడియో కాల్‌ చేసి జసిత్‌ను చూపించమని వెంకటరమణ అడిగితే, తన ఫోన్‌కు ఆ సదుపాయం లేదన్నాడు. కనీసం బాబుతో మాట్లాడించమని కోరినా పట్టించుకోలేదు. అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ కాల్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. నిజంగా జసిత్‌ ఢిల్లీలో ఉన్నాడా, డబ్బులు గుంజడానికే ఎవరైనా నకిలీ కాల్‌ చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు.

జసిత్‌ కిడ్నాప్ కేసు ఛేదించేందుకు 16 పోలీసు బృందాలు పని చేస్తున్నాయని ఎస్పీ అద్నాన్‌ నయిం అస్మి తెలిపారు. ఆరుగురు డిఎస్పీలు.. పది మంది సిఐలతో చిన్నారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. పరిశోధనలో అనుభవం ఉన్న రిటైర్డ్ పోలీసు అధికారులు కూడా ఈ కేసు దర్యాప్తులో ఉన్నారని వెల్లడించారు. ఈనెల 3న తేదిన జసిత్‌ ఆడుకునే అపార్ట్‌మెంట్‌కు అద్దె కోసం వచ్చిన వారే, ఈనెల 5న అదే ప్రాంతంలో తిరిగారని.. వారు ఎవరు అనే దానిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వారి సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేసేపనిలో ఉన్నామని వివరించారు. జసిత్‌ తల్లిదండ్రులకు కుటుంబ పరంగా ఎవరితోనా విభేధాలున్నాయా, బ్యాంక్ వ్యవహరాల్లో ఖాతాదారులతో ఏమైన గొడవలు ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారిస్తున్నట్టు తెలిపారు. కచ్చితంగా జసిత్‌ను క్షేమంగా తీసుకువస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: కన్నా.. ఎక్కడున్నావ్‌?)

మరిన్ని వార్తలు