శ్రీనవ్య జ్ఞాపకాలు మరువలేక...

25 Oct, 2019 10:06 IST|Sakshi
చందు(ఫైల్‌) శ్రీయోషిత (ఫైల్‌) శ్రీనవ్య (ఫైల్‌)

కుమార్తెను కడతేర్చి భర్త ఆత్మహత్య 

మండపేటలో ఘోరం  

తీవ్ర జ్వరంతో రెండు వారాల కిందట భార్య మృతి 

చిన్ననాటి నుంచి కష్టాలే జీవితంగా గడిపిన ఆ అభాగ్యునికి భార్య రాక కొత్త జీవితం వచ్చినట్లైంది. భర్తకు ఆమె చేదోడువాదోడుగా ఉంటూ వ్యాపారాభివృద్ధికి తోడ్పాటును అందించింది. వారి అన్యోన్య దాంపత్యంలో చిన్నారి శ్రీయోషితకు జన్మనిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు తీరి సాఫిగా సాగిపోతున్న వారి జీవితాన్ని విధి ఒక్కసారిగా వంచించింది. డెంగీ లక్షణాలతో భార్య మృతి చెందగా అప్పటి నుంచి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. తను మరో పెళ్లి చేసుకున్నా తన చిన్నారికి తల్లి ప్రేమ దక్కదని, తాను పడ్డ కష్టాలు తన కుమార్తె పడకూదని భావించాడు. తన భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక, ఆమె జ్ఞాపకాల నుంచి బయటపడలేక, భార్య ముందు వెళ్లిపోయింది తర్వాత మేమిద్దరమంటూ తమ మూడేళ్ల చిన్నారిని కడతేర్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండపేటలో గురువారం సంచలనం కలిగించిన ఈ ఘోరం అందరినీ కలచివేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  

తను లేని దగ్గర నుంచి నాకు ప్రతి క్షణం నరకంలాగే ఉంది. మా పెళ్లయిన దగ్గర నుంచి తల్లిలా, స్నేహితురాలిలా, భార్యలా అన్ని విషయాల్లో సహకరించేది. ఇప్పుడు ఒకేసారి ఆ ముగ్గురు (తల్లి, స్నేహితుడు, భార్య) దూరం కావడంతో నాకు బతుకు ఎందుకు అనిపిస్తుంది. నాతో ఉన్నది నాలుగేళ్లు కానీ తను రాకముందు నా జీవితంలో ఏం జరిగిందో మర్చిపోయేలా చేసింది. ఇప్పుడు తనతో ఉన్న క్షణాల్లో తప్ప మరేమీ గుర్తుకు రావడం లేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే ఇంకో భార్య వస్తే ఇవన్నీ మర్చిపోయి ఉండవచ్చు అంటారు. కానీ నాకు భార్య వస్తే నా కూతురుకి తల్లి రాదు. నాకు పిల్లలు పుడితే నా కూతురు మరో నవ్యలా తయారవుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఈ కఠిన నిర్ణయం. తను ముందు వెళ్లిపోయింది తర్వాత మేమిద్దరం. ఎన్నో చెప్పాలని ఉంది, ఎన్నో పంచుకోవాలని ఉంది. కాని నా ప్రాణానికి ప్రాణం నాతో లేకపోయేసరికి ఏమీ తెలీట్లేదు. ఏమీ అర్ధం కావడం లేదు. నా కోసం కష్టపడిన నా స్నేహితులు అందరికీ నా క్షమాపణలు. అందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను.    – చందు 
మండపేటలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటనలో కూతురిని కడతేర్చి ఆత్మహత్యకు పాల్పడిన చందు తన సూసైడ్‌ నోట్‌లో రాసిన వేదన. 

సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన బాదం చందనకుమార్‌ (చందు) తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకోగా పదేళ్ల వయస్సులోనే తన చెల్లెలు పుష్పలతను తీసుకుని చందు మండపేటలోని దగ్గర బంధువుల ఇంటికి వచ్చేశాడు. బంధువుల సహకారంతో చదువు ప్రారంభించారు. కొంతకాలానికి దగ్గరి బంధువు మృతి చెందగా ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తూ చెల్లెలకి అన్నీ తానయ్యాడు. పెంచి పెద్దిచేసి కోరుకొండ మండలానికి చెందిన యువకునితో వివాహం జరిపించాడు. తాను స్థానిక నాళం వారి వీధిలో ఫ్లెక్సీ ఫ్రింటింగ్‌ ప్రారంభించి వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు. 2015లో జిల్లాలోని రావులపాలెం శివారు కొమరాజులంకకు చెందిన కంచర్ల శ్రీనవ్యతో వివాహమైంది. పేద కుటుంబానికి చెందిన శ్రీనవ్య తండ్రి చిన్నతనంలో మృతిచెందగా ఆమె దాతల సహకారంతో ఎంటెక్‌ చదువుకుంది.


ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన చందు, పక్కనే చిన్నారి మృతదేహం
వ్యాపార నిర్వహణలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపారాభివృద్ధికి తోడ్పాటును అందించేది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా మూడేళ్ల కుమార్తె శ్రీయోషిత ఉంది. చిన్ననాటి నుంచి పడ్డ కష్టాలు మరిచి పోయి ఆనందంగా సాగిపోతోంది. కుటుంబంతో కలిసి పట్టణంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న చందు మండపేట రూరల్‌లో ఇటీవల సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు స్థలం కొనుగోలు చేసుకున్నాడు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాన్ని డెంగీ జ్వరం అతలాకుతలం చేసింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో శ్రీనవ్య కన్నుమూసింది. ఆమె ఆశయం మేరకు చందు ఆమె కళ్లను దానం చేశాడు. నాటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న చందు భార్య లేని జీవితం ఊహించుకోలేకపోయాడు. మరో వివాహం చేసుకున్నా తన కుమార్తెకు తల్లి ప్రేమ దక్కదని, చిన్నతనంలో తాము పడ్డ ఇబ్బందులు తన కుమార్తె పడాల్సి వస్తుందని భావించి ఈ ఘెరానికి పాల్పడ్డాడు.

నా భార్య వద్దకే మేమిద్దరం వెళ్లిపోతున్నామంటూ లేఖ రాసి తన కుమార్తెను కడతేర్చి, తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో భార్య చీరను ముఖానికి కట్టుకుని మెడకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కోరుకొండలో నివాసముంటున్న సోదరి పుష్పలత ఉదయం నుంచి పలుమార్లు ఫోన్‌ చేసినా చందు ఫోన్‌ ఎత్తకపోవడంతో పక్క వ్యాపారికి చెప్పగా అతను ఇంటికి వచ్చి చూసే సరికి ఈ ఘోరం వెలుగుచూసింది. చందు ఉరివేసుకుని ఉండటం, పక్కనే అభంశుభం తెలీని చిన్నారి శ్రీయోíÙత విగతజీవిగా పడి ఉండటం చూపరుల హృదయాలను కలచివేసింది. తమ అన్యోన్య దాంపత్య, తాను పడుతున్న ఆవేదన, తనకు సంబంధించిన స్థలం, వ్యాపారంలోని సామగ్రి, ఎల్‌ఐసీ ఇన్సూరెన్స్‌ సొమ్ములు తన తండ్రి, సోదరి, తన భార్య తల్లికి చెందాలనే విషయాలను వివరిస్తూ చందు రాసిన ఆరు పేజీల సూసైడ్‌ నోట్‌ను సంఘటన స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

చందు రాసిన సూసైడ్‌ నోట్‌
భార్యకు మాట ఇచ్చినట్టుగానే... 
నేను ముందు పోతే ఏం చేస్తావు అని తన భార్య అన్నప్పుడు... నీ వెంటే నేను వచ్చేస్తానని చెబితే అలా కాదు కనీసం నా దినం కూడా చేయవా అని అడిగేది. చేశాక రా అనేది. అది సరదాకో నిజంగానో తెలీదు కానీ ఇప్పుడు తనే ముందు వెళ్లిపోయింది. అందుకే తన కోరిక ప్రకారం నా శక్తి మేర ఆమె కార్యక్రమాన్ని పూర్తి చేసి అప్పగించాల్సిన వన్ని అప్పగించేసి నేను తన వద్దకి వెళ్లిపోతున్నానంటూ చందు లేఖలో పేర్కొనడం అందరినీ కలచివేస్తోంది.

సచివాలయ ఉద్యోగినిగా... 

ఇటీవల మృతి చెందిన శ్రీనవ్య సెప్టెంబరులో జరిగిన సచివాలయ ఉద్యోగుల పరీక్షకు హాజరైంది. సెకెండ్‌ లిస్ట్‌లో తన భార్య పేరు వచ్చినట్టు బుధవారం చందు చెప్పాడని స్థానికులు అంటున్నారు. తన భార్య జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నానని, మండపేటలో వ్యాపారం మానేసి కుమార్తెను తీసుకుని కోరుకొండలోని తన సోదరి ఇంటికి వెళ్లిపోయి ఏదో పనిచేసుకుంటానని సన్నిహితుల వద్ద చెప్పేవాడని అంటున్నారు. కాగా ఇంతలోనే ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఊహించలేదని స్థానికులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. మండపేట సీఐ నాగ మురళీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

చదవండి: నా భార్య వద్దకే వెళ్లిపోతున్నాం..

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా