కలి‘విడి’గా

27 Mar, 2020 12:47 IST|Sakshi
రావులపాలెం రైతు బజారులో సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేస్తున్న వినియోగదారులు

ఫలితాన్నిస్తున్న అధికారుల కృషి 

ప్రజల్లో పెరిగిన అవగాహన  

మా ఇంటికి రావద్దంటున్న జనం

ఆత్మీయ పలకరింపులు మాయమయ్యాయి...ఎదురుపడినా పక్కకు చూస్తూ తప్పించుకు తిరిగే వారే అధికమయ్యారు. ఫోన్లో పలకరించినా ముక్తసరి ముగింపులే. ఎక్కడి నుంచి ఎవరైనా దిగిపోతారేమోనని భయం...ఇదీ జిల్లాలో ఏ ఇంట చూసినా పరిస్థితి. రక్త సంబంధమైనా ... దూరపు బంధువైనా ...కరోనా కరుణించి వెనుతిరిగితే అప్పుడు చూద్దాం...అప్పటి వరకు దూరం పాటిద్దాం...మనల్ని మనం రక్షించుకుందాం...దేశం మాట దేవుడెరుగు మన దేహాన్ని మనం కాపాడుకుందామంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. దీనికితోడు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వివాహకార్డు పట్టుకొని ఎక్కడొచ్చేస్తారోనన్న జంకు లేకపోలేదు. గేటు శబ్దమైతే చాలు గుండె ఝల్లుమంటోందనిగృహిణులు వాపోతున్నారు.

సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం: కరోనాపై పోరాటానికి జిల్లా ప్రజలు మానసికంగా సిద్ధపడుతున్నారు. స్నేహితులు, బంధువులు, ఇరుగు, పొరుగు కలిసినట్టే కలుస్తున్నారు కానీ సామాజిక దూరం పాటించడానికి మాత్రం వెనుకాడటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినట్టుగా వచ్చే నెల 14వ తేదీ వరకు ప్రభుత్వాలు అంటున్నా ఎడబాటును కొనసాగించడానికే జనం తీర్మానించుకున్నారు. రాష్ట్రంలో జనాభా రీత్యా అతి పెద్ద జిల్లా కావడంతో తేడా వస్తే కరోనా ప్రభావం కూడా అదే స్థాయిలో ఉంటుందనే భయం ఇక్కడి ప్రజల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. జిల్లాలో రోజురోజుకూ అనుమానిత కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు స్వీయ నిర్బంధానికి వెనుకాడటం లేదు. గత ఆదివారం ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ నూటికి నూరుశాతం అమలు చేసిన స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌లోనూ కనబరుస్తున్నారు. నిబంధనల అతిక్రమణలు అక్కడక్కడా కనిపిస్తున్నా మొత్తంగా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలు ఫలితాలనే ఇస్తున్నాయి. కరోనా వైరస్‌ చాపకింద నీరులా ఉందనే భయం వెంటాడుతుండటంతో ప్రజలు గుమ్మం దాటి బయటకు రావడానికి సాహసించడం లేదు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు సహా రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, పెద్దాపురం తదితర పట్టణాల్లో పరిసరాల పరిశుభ్రతను ఇంతకాలం పెడచెవిన పెడుతూ వచ్చాయి. తరముకొస్తున్న కరోనా మహమ్మారి భయంతో ప్రజలు స్వచ్ఛందంగా తమ తమ ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజారోగ్య శాఖ నుంచి కూడా ఇందుకు తగ్గ స్పందనే కనిపిస్తోంది. 

వ్యక్తిగత శుభ్రతే ప్రధానం
కరోనా కట్టడిలో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పడంతో పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ రెండింటికీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా వైరస్‌ 14 రోజులకు కాని బయటపడదనే వైద్యుల సూచనలతో ఇది చాపకింద నీరులా ఉందనే అనుమానంతో విద్యావంతులే కాకుండా సమాజ పోకడలు తెలిసిన నిరక్షరాస్యులు కూడా సామాజిక దూరం పాటిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్‌ సోకకుండా ముందు జాగ్రత్తల్లో ప్రధానమైనది ఒకరికి ఒకరు దూరం పాటించడం. కలుసుకోవాలన్నా, మాట్లాడాలనుకున్నా అంతెందుకు పక్కపక్కనే ఉన్నా, చివరకు ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య కూడా కనీసం మీటరు దూరం ఉండాలనే నిబంధన జిల్లాలోని 60 నుంచి 70 శాతం కుటుంబాల్లో  పక్కాగా పాటిస్తున్నారు.

కాస్త దూరం అంటున్న జనం
కరోనా లక్షణాలున్నాయనే అనుమానాలు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వారిపై క్షేత్ర స్థాయిలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్న వలంటీర్లు, మండలాల్లో ‘సాక్షి’ ప్రతినిధి బృందం గడచిన రెండు రోజుల పరిశీలనలో ఈవిషయం వెల్లడైంది. సర్వే కోసం ఇళ్లకు వెళుతుంటే కాళ్లు కడుగుకుని లోపలికి రా వాలనడం, కాస్త దూరంగా ఉండి మాట్లాడాలని కుటుంబ సభ్యులే సూచిస్తున్న పరిస్థితులను వలంటీర్లు సాక్షికి తెలియచేశారు. ఇవే కార ణాలతో ఇతర దేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి చమురు సంస్థల్లో పనిచేసేందుకు వస్తున్న వారిని కూడా నిలువరిస్తున్నారు. ఇదే తరహాలో ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాం రవ్వ చమురు క్షేత్రంలో పనిచేసేందుకు వచ్చిన వారిని కట్టడి చేయాలని స్థానికులు ఆందోళనకు దిగడం గమనార్హం. అమలాపురం బస్టాండ్‌ వద్ద, చెన్నమల్లేశ్వరస్వామి ఆలయం, మున్సిపల్‌ పార్కు, సూర్యా మెగాబజార్‌ వద్ద ఏర్పాటు చేసిన కూరగాయల విక్రయ కేంద్రాల వద్ద ప్రజలు స్వచ్ఛందంగానే సామాజిక దూరాన్ని పాటించడం కనిపించింది. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైతు బజార్‌లలో సామాజిక దూరం పాటించి కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసి ముందస్తు జాగ్రత్తలు పాటించారు. నిన్న మొన్న టి వరకూ అటు కాకినాడ, ఇటు రాజమహేంద్రవరం సహా అమలాపురం, మండపేట, రామచంద్రాపురం, పెద్దాపురం, పిఠాపురం, తుని తదితర ప్రాంతాల్లో కూరగాయలు, నిత్యావసరాలకు గుంపులు, గుంపులు వెళ్లే పరిస్థితిలో గురువారం నాటికి మార్పు కనిపించింది.  ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగానే సామాజిక దూరాన్ని పాటించారు.

చిరు వ్యాపారులు కూడా...
తెల్లవారకుండానే ఇళ్లకు వచ్చే పాలు, పెరుగు ప్యాకెట్లు, కూరగాయల అమ్ముకునే చిరు వ్యాపారులు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. వారు కూడా మాస్కులు దరించే వస్తున్నారు. అలా సైకిళ్లు, బైక్‌లపై తెచ్చే కూరగాయలను గృహిణిలు చేతితో తీసుకోవడం లేదు. ఇళ్ల గేట్లు వద్ద బాస్కెట్‌లు, బుట్టలు ఏర్పాటు చేసి వాటిలో వేయించుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే వీటన్నింటినీ చేతితో తీసుకుంటే కరోనా వైరస్‌ బారిన పడతామేమోననే భయం వీరిలో మార్పునకు దోహదం చేసింది. కొందరైతే తమ తమ భవనాల గ్రౌండ్‌ ఫ్లోర్‌ లలో గేటు బయట రెండు, మూడు వారాలు కలవడానికి ఎవరూ రావద్దని బోర్డులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ తరహా బోర్డు కాకినాడ పులవర్తి వారి వీధిలో ఒక ఇంటికి వేలాడుతూ కనిపించింది. దాదాపు ఇదే స్వీయ పరిశుభ్రతను, సామాజిక దూరాన్ని నూటికి 60 కుటుంబాలు పాటిస్తున్నాయి. ఉదయం కూరగాయలకు, నిత్యావసర వస్తువులకు గుమ్మం దాటి బయటకు వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నోటికి, ముక్కుకు మాస్కులు వేసుకునే కనిపిస్తున్నారు. ఎంతో అర్జంటు పని ఉన్నా రెండు, మూడు వారాలు పాటు రావద్దని బంధువులకు ముందస్తు సమాచారం పంపిస్తున్నారు.

మరిన్ని వార్తలు