తూర్పున శివమెత్తిన ఓటర్లు 

12 Apr, 2019 12:09 IST|Sakshi

సాక్షి, కాకినాడ : పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు గురువారం జరిగాయి. సాయంత్రం ఆరు గంటల సమయానికి జిల్లాలో మొత్తం 74.21 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గడువు ముగిసిన తరువాత కూడా జిల్లాలోని 240 కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగుతోందని, ఇది కూడా పూర్తయితే జిల్లాలో మొత్తం ఓటింగ్‌ 77 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు.

జిల్లావ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకూ పోలింగ్‌ మందకొడిగానే సాగింది. ఆ తరువాత నుంచి ఈవీఎంలు సక్రమంగా పని చేయడంతో ఓటింగ్‌ ప్రక్రియ వేగం అందుకుంది. పెద్దలు, మహిళలతో పాటు యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికలాంగులు, వృద్ధులు ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల అధికారులు ప్రత్యేక రవాణా సదుపాయం, వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచీ ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పోలింగ్‌ కేంద్రాల ఆవరణలో షామియానాలు, తాగునీటి సదుపాయాలు కల్పించారు.

మొరాయించిన ఈవీఎంలుఈసారి పోలింగ్‌లో ఈవీఎంలతో పాటు కొత్తగా ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రైల్‌ (వీవీ ప్యాట్‌) యంత్రాలను వినియోగించారు. 193 కేంద్రాల్లో ఈవీఎంలు దాదాపు రెండేసి గంటల పాటు మొరాయించాయి. దీంతో అప్పటికే బారులు తీరిన ఓటర్లు గంటల తరబడి క్యూలో ఉండలేక ఓట్లు వేయకుండా వెనుతిరిగి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో సెక్టార్, రూట్‌ అధికారులు తక్షణం స్పందించారు. భెల్‌ ఇంజినీర్లతో ఈవీఎంలకు మరమ్మతులు చేయించి, పోలింగ్‌ వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టారు. 

కపిలేశ్వరపురం మండలం వల్లూరు 168వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఈవీఎం పని చేయలేదు. మండపేట నుంచి తెచ్చిన ఈవీఎం కూడా పని చేయకపోవడంతో మరో ఈవీఎం తెచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జేసీ మల్లికార్జున వచ్చి ఈవీఎం సెట్‌ చేయించారు. పోలింగ్‌ శుక్రవారం నిర్వహించాలని ప్రజలు కోరినా అధికారులు అంగీకరించలేదు. దీంతో అర్ధరాత్రి వరకూ పోలింగ్‌ జరిగింది. జిల్లాలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో కూడా ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

కాకినాడ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నుంచి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌గాంధీలు సెక్టార్‌ అధికారుల నుంచి పోలింగ్‌ వివరాలు తెలుసుకుంటూ, మొరాయించిన యంత్రాలు మళ్లీ పని చేయించేందుకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసిన విషయం తెలిసిందే.

దీనిద్వారా కలెక్టర్‌ పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమస్యలను తక్షణం చక్కదిద్దారు. కాకినాడ నగరం, రూరల్‌ పరిధిలోని దుమ్ములపేట, ఏటిమొగ, జగన్నాథపురం, ఇంద్రపాలెంలలోని పోలింగ్‌ కేంద్రాలను జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని సందర్శించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

సిబ్బందికి ఇబ్బందులు
కొన్ని ప్రాంతాల్లో తాగునీరు, మరుగు సౌకర్యాలు లేక పోలింగ్‌ ఎన్నికల సిబ్బంది ఇక్కట్లు పడ్డారు. వారికి అందించిన భోజనాలు, టిఫిన్లు సక్రమంగా లేవన్న విమర్శలు వచ్చాయి. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మరుగుదొడ్లు సక్రమంగా లేవు. వాటిల్లో వాడకానికి నీరు లేకపోవడంతో మహిళా సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు.

ఓటు వేసిన కలెక్టర్‌ దంపతులు

కాకినాడలో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా దంపతులు

కాకినాడ శ్రీనగర్‌లోని నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాల 22వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఉదయం 9.30 గంటల సమయంలో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా దంపతులు, కాకినాడ ఆర్డీవో జి.రాజకుమారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్‌ దంపతులు ఓటర్లతో పాటు క్యూలైన్లలో నిలబడి తమవంతు వచ్చే వరకూ నిలబడి ఓటు వేశారు.

అదే బూత్‌లో ఓటు వేసేందుకు వచ్చిన యువ ఓటర్లు కలెక్టర్‌ దంపతులతో సెల్ఫీలు దిగారు. తొలిసారిగా ఓటు వేసిన తన భార్యను కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అభినందించారు. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులకు కలెక్టర్‌ గౌరవ పూర్వకంగా నమస్కరించి, వారి ప్రజాస్వామ్య స్ఫూర్తి యువతరానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. అదే సమయానికి అదే బూత్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, ఆయన సతీమణి కూడా కలెక్టర్‌ దంపతులతో పాటు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఓటు వేసిన 31,19,907 మంది
జిల్లాలో 2014 ఎన్నికల్లో 34,17,155 మంది ఓటర్లకుగాను 26,45,470 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పట్లో 77.42 శాతం ఓటింగ్‌ నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో 42,04,436 ఓటర్లకు గాను రాత్రి 9 గంటల వరకూ ఉన్న సమాచారం మేరకు 31,19,907 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఈసారి 74.21 శాతం ఓటింగ్‌ నమోదైంది. పోలింగ్‌ కొనసాగుతున్న 240 పోలింగ్‌ కేంద్రాలను కూడా కలుపుకొంటే పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

స్ట్రాంగ్‌రూముల్లో అభ్యర్థుల భవితవ్యం
పోలింగ్‌ ముగిసిన అనంతరం జిల్లాలోని ఈవీఎంలను, వీవీ ప్యాట్‌లను ఆయా ప్రాంతాల్లోని స్ట్రాంగ్‌ రూములకు తరలించినట్టు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. రంగరాయ వైద్య కళాశాల, జేఎన్‌టీయూకే, జిల్లా క్రీడా మైదానం, నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌ తదితర ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూముల్లో వీటిని భద్రపరుస్తామని చెప్పారు.

రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గుర్తేడు పోలింగ్‌ కేంద్రాల నుంచి ఓటింగ్‌ యంత్రాలను రెండు హెలికాప్టర్లలో కాకినాడ అచ్చంపేట జంక్షన్‌లోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ పీజీ క్యాంపస్‌కు తరలించామన్నారు. మే 23వ తేదీన కౌంటింగ్‌ జరుగుతుందని, అప్పటివరకూ ఆయా స్ట్రాంగ్‌ రూములకు సెంట్రల్‌ రిజర్వు ఫోర్స్‌ భద్రతలో ఉంటాయని చెప్పారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు