-

మార్పు.. ‘తూర్పు’తోనే..

25 May, 2019 13:36 IST|Sakshi

మరోసారి ఫలించిన జిల్లా సెంటిమెంట్‌

14 అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్‌ సీపీ వశం

మూడు పార్లమెంటు స్థానాల్లోనూ క్లీన్‌స్వీప్‌

సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,కాకినాడ: తూర్పున ఉదయించే సూర్యుడు లోకానికి వెలుగులు పంచడం ఎంత సహజమో.. ‘తూర్పు గోదావరి’ జిల్లాలో ఉదయించే రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కూడా అంతే సహజం అన్నట్టుగా మారిపోయింది. దీనికే రాష్ట్ర రాజకీయాల్లో ‘తూర్పు’ సెంటిమెంట్‌గా ఎంతో పేరు ఉంది. ఈ జిల్లాలో అత్యధిక సీట్లు సాధించే పార్టీయే రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందన్నది ఎన్నో దశాబ్దాలుగా ఏర్పడిన బలమైన నమ్మకం. ఇందుకు తగినట్టే ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించిన పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తూండడం విశేషం. దీంతో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో సహితం ఇదే నమ్మకం మరోసారి నిజమైంది. జిల్లాలో అత్యధికంగా 14 అసెంబ్లీ స్థానాలను, మూడు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. రాష్ట్రంలో తిరుగులేని ప్రభంజనం సృష్టించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘తూర్పు’ సెంటిమెంట్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ‘తూర్పు’ సెంటిమెంట్‌గా మారిపోయింది.

జిల్లాలో సమర శంఖారావం నిర్వహించిన వేళ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. ‘తూర్పు’ మార్పునకు నాంది పలుకుతుందని చాలామంది గట్టిగా నమ్ముతారు. ఇక్కడ ఉండగానే అనుకోకుండా ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేయడం తమకు మంచి సంకేతమని, పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే వేదికగా కాకినాడ నిలవడం శుభపరిణామమని వైఎస్సార్‌ సీపీ నేతలు  వైఎస్సార్‌ సీపీ నేతలు భావించారు. ఇంకేముంది! కాకినాడ సమర శంఖారావం వేదికగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమరశంఖం పూరించారు. అనుకున్నట్టుగా ‘తూర్పు’ సెంటిమెంట్‌ మరోసారి నిజమైంది. కనీవినీ ఎరుగని రీతిలో హోరాహోరీగా సాగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాలకు 36 మంది, 19 అసెంబ్లీ స్థానాలకు 223 మంది పోటీ చేశారు. ఎంతమంది బరిలో ఉన్నప్పటికీ పోరు మాత్రం వైఎస్సార్‌ సీపీ – టీడీపీల మధ్యే సాగింది. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆధిక్యతను ప్రదర్శిస్తూ 14 అసెంబ్లీ స్థానాలను, మూడు పార్లమెంట్‌ స్థానాలను వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకుంది. ‘తూర్పు’ సెంటిమెంటును నిజం చేస్తూ రాష్ట్రంలో కూడా సునామీ సృష్టించింది.

‘తూర్పు’ సెంటిమెంటుకు ఇవిగో ఉదాహరణలు
1983లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ప్రభంజనం వీచింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో 21 స్థానాలకు 21 గెలిచింది. ఎన్టీఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు.
1985లో జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్‌ గాలి వీచింది. జిల్లాలోని 21 స్థానాలకు గాను 20 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ ఒక్కటి మాత్రమే గెలిచింది. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది.
1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో అత్యధికంగా 16 స్థానాలను కైవసం చేసుకుంది. నలుగురు టీడీపీ తరఫున, ఒకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది.
1994 ఎన్నికల్లో టీడీపీ హవా మరోసారి సాగింది. జిల్లాలో 21కి 19 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ ఒకటి దక్కించుకోగా మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. రాష్ట్రంలో మరోసారి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది.
1999లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లాలో అత్యధికంగా 18 స్థానాలను కైవసం చేసుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ ఒక్క స్థానంలో నెగ్గింది.
2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో గరిష్టంగా 16 సీట్లు గెలుచుకుంది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒకటి, టీడీపీ రెండు, స్వతంత్రులు మరో రెండుచోట్ల గెలిచారు. ఆ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్సార్‌ సీఎం అయ్యారు.
2009లో కూడా వైఎస్‌ హవా కొనసాగింది. ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ 11 స్థానాలను గెలుచుకోగా ప్రజారాజ్యం పార్టీ 4, తెలుగుదేశం 4 స్థానాల్లో గెలుపొందాయి. జిల్లాలో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం.. ‘తూర్పు’ సెంటిమెంట్‌ ప్రకారం రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు సాధించి, వైఎస్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
2014లో టీడీపీ, బీజేపీ అలయన్స్‌ 14 స్థానాలను దక్కించుకోవడం ద్వారా చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ కొత్తపేట, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, రంపచోడవరం స్థానాలను దక్కించుకుంది. జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకున్న టీడీపీ ‘తూర్పు’ సెంటిమెంట్‌ను కొనసాగించింది.

తాజా ఎన్నికల్లోనూ అదే ఒరవడి
ప్రస్తుత ఎన్నికల్లోనూ ‘తూర్పు’ సెంటిమెంట్‌ కొనసాగింది. జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 14 చోట్ల వైఎస్సార్‌ సీపీ, నాలుగుచోట్ల టీడీపీ, ఒకటి జనసేన గెలుపొందాయి. ఈసారి కూడా అత్యధిక సీట్లను కైవసం చేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. తద్వారా ఎంతోకాలంగా కొనసాగుతున్న ‘తూర్పు’ సెంటిమెంట్‌కు మరోసారి బలం చేకూరుతోంది.

మరిన్ని వార్తలు