జాతీయ కమిషన్‌ ముందు హాజరైన జిల్లా పోలీసులు

14 Jul, 2019 08:32 IST|Sakshi

సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి) : గతేడాది పట్టణంలో పెంపుడుకుక్క తరమడంతో కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందిన కేసు విషయంలో డీఐజీ, డీఎస్పీ, సీఐలు ఈనెల 9,11 తేదీల్లో ఢిల్లీలోని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ముందు విచారణకు హాజరయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో అప్పటి హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు పెంపుడు కుక్క తరమడంతో పంట కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ (ఢిల్లీ) అమలాపురం డీఎస్పీ, సీఐలకు నోటీసులు జారీ చేసింది. దాంతో అమలాపురం డీఎస్పీ ఆర్‌.రమణ, ఈ కేసు అప్పటి ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ (ఐవో) పట్టణ సీఐ సీహెచ్‌ కోటేశ్వరరావు, ఇప్పటి ఐవో, ప్రస్తుత పట్టణ సీఐ సురేష్‌బాబు ఈనెల 9,11 తేదీల్లో ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ముందు హాజరయ్యారు.

పెంపుడు కుక్క వల్ల బాలుడు మృతి చెందటానికి దారి తీసిన కారణాలను కమిషన్‌ అడుగుతూనే ఈ కేసు ఎంత వరకూ వచ్చింది? మీరు తీసుకున్న చర్యలేమిటి? అని వారిని ప్రశ్నించినట్టు తెలిసింది. అప్పట్లో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు కె.రాములు స్వయంగా అమలాపురం వచ్చి ఈ ఘటనను కమిషన్‌ దృష్టికి తీసుకుని వెళ్లి బాధ్యులపై చర్యలు చేపడతామని చెప్పారు. అంతే కాకుండా బాలుడి మరణానికి కారణమైన పెంపుడు కుక్క యజమానులపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని రాములు అప్పట్లో పోలీసులకు సూచించారు. దీనికితోడు అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ఆధ్వర్యంలో ఈ ఘటనపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కమిషన్‌ ఈ కేసు విషయమై కొద్ది రోజుల కిందట జిల్లా కలెక్టర్‌కు కూడా నోటీసులు పంపించింది. డీఐజీని కూడా కమిషన్‌ స్వయంగా హాజరు కావాలని ఆదేశించడంతో డీఐజీతో పాటు డీఎస్పీ, సీఐలు ఢిల్లీ వెళ్లి హాజరయ్యారు.

మాజీ ఎంపీ హర్షకుమార్‌కు కూడా కమిషన్‌ నోటీసు జారీ చేసింది. ఆయన కూడా ఢిల్లీ వెళ్లినప్పటికీ కమిషన్‌ సూచించిన రోజుకు వెళ్లకపోవడంతో ఆయనను విచారించలేదు. బాలుడి మృతి కేసుకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్‌లో 15వ కాలమ్‌లో మరణానికి కారణం (కాజ్‌ ఆఫ్‌ డెత్‌)లో కాలువలో నీళ్లు తాగడం వల్ల బాలుడు మృతి చెందాడని రాసిన వైనంపై అప్పట్లో దళిత సంఘాలు, నాయకులు అభ్యంతరం చెప్పి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పెంపుడు కుక్క తరవడం వల్లే బాలుడు భయపడి కాలువలోకి దూకి మృతి చెందాడని ఎందుకు రాయలేదని ప్రశ్నించిన విషయమూ విదితమే. కాగా పట్టణ సీఐ సురేష్‌బాబును ‘సాక్షి’ వివరాలు కోరగా ఆ కేసులో మానవహక్కుల కమిషన్‌ ముందు హాజరయ్యేందుకు వెళ్లామని, కమిషన్‌ ముందు హాజరై ఢిల్లీ నుంచి తిరిగి వచ్చామని చెప్పారు.  

మరిన్ని వార్తలు