శత్రుదుర్భేద్యం.. తూర్పు నౌకాదళం

4 Dec, 2019 04:29 IST|Sakshi
ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌

భారత నేవీలో కీలక కేంద్రం తూర్పు నౌకాదళం

విశాఖ కేంద్రంగా సేవలు

15 స్థావరాల ద్వారా యుద్ధ నౌకలు..  సబ్‌మెరైన్లతో తీర గస్తీ.. అనుక్షణం అప్రమత్తత..

1971లో పాక్‌పై యుద్ధ విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్‌ 4న ‘నేవీ డే’

సాక్షి, విశాఖపట్నం : పాకిస్తాన్‌.. దాయాది దేశం పేరు వింటేనే పౌరుషం పొంగుకొస్తుంది. అలాంటిది.. శత్రు దేశమైన పాకిస్తాన్‌తో యుద్ధం జరిగితే.. అందులో మన త్రివర్ణ పతాకం రెపరెపలాడితే.. ఆ చిరస్మరణీయ విజయానికి మన విశాఖే వేదికైతే.. ఇంకెంత గర్వంగా ఉంటుందో కదూ! ఈ విజయానికి గుర్తుగానే.. అప్పట్నుంచి ఏటా డిసెంబర్‌ 4న భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగే ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కాగా, 75 ఏళ్లలో భారత నౌకాదళం.. ప్రపంచంలోనే అతిపెద్ద దళాల్లో ఒకటిగా సమర్థమైన నౌకాదళ శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం ఆవిర్భవించింది. అంతేకాదు.. ఈ నౌకాదళ దినోత్సవం నిర్వహించుకోడానికీ కేంద్ర బిందువు కూడా విశాఖపట్నమే కావడం మరో విశేషం. 

పెరిగిన నౌకా సంపత్తి..
తీర ప్రాంత రక్షణకు వెన్నెముకగా ఉన్న ఈఎన్‌సీ (ఈస్ట్‌ నేవల్‌ కమాండ్‌).. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఇండియన్‌ నేవీ.. ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటూ శత్రుదుర్భేద్యంగా మారుతోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 40 వరకూ యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లున్నాయి. ఇక్కడి నౌకల పేర్లన్నీ ఐఎన్‌ఎస్‌తో మొదలవుతాయి. ఐఎన్‌ఎస్‌ అంటే ఇండియన్‌ నేవల్‌ షిప్‌. వీటిల్లో విభిన్న తరగతుల యుద్ధ నౌకలున్నాయి. అలాగే, సబ్‌మెరైన్లు కూడా.

ఇదీ నేవీ డే కథ..
భారత్‌-పాక్‌ మధ్య 1971 డిసెంబర్‌ 3 సాయంత్రం మొదలైన యుద్ధం డిసెంబర్‌ 16న పాకిస్తాన్‌ ఓటమితో ముగిసింది. బంగ్లాదేశ్‌ విమోచన అంశం ఈ యుద్ధకాండకు ప్రధాన కారణం. తూర్పు పాక్‌ (బంగ్లాదేశ్‌)కు భారత్‌ మద్దతు ప్రకటించడంతో.. పాకిస్థాన్‌ మన దేశంపై దాడులకు పాల్పడింది. కరాచీ ఓడరేవుపై భారత్‌ చేసిన దాడితో పాక్‌ నావికాదళం చతికిలపడింది. అంతేకాక.. పాక్‌ జలాంతర్గామి ఘాజీని విశాఖ తీరం సమీపంలోనే సాగర గర్భంలోనే కుప్పకూల్చారు. దీంతో.. పాక్‌ నావికాదళం 80 శాతం నష్టపోయింది. అనంతరం.. బంగాళాఖాతంలోని జల ప్రాంతాలన్నింటినీ ఇండియన్‌ నేవీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. డిసెంబర్‌ 16న పాకిస్తాన్‌ లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో.. భారత్‌ కాల్పుల విరమణ ప్రకటించింది. డిసెంబర్‌ 16న యుద్ధం ముగిసినా.. డిసెంబర్‌ 4న కరాచీలోని అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం ధ్వంసం కారణంగానే ఆ రోజును భారత నౌకాదళ దినోత్సవంగా ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికి గుర్తుగానే విశాఖ సముద్ర తీరాన విక్టరీ ఎట్‌ సీృ1971 స్థూపాన్నీ నిర్మించారు.

నేడే విశాఖలో ‘నేవీ డే’ 
పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో భారత్‌ విజయానికి ప్రతీకగా ఏటా నిర్వహించే నౌకాదళ దినోత్సవం బుధవారం విశాఖలో వైభవంగా జరగనుంది. పాక్‌ ఓటమిలో తూర్పు నావికాదళం కీలకపాత్ర పోషించడంతో ఏటా ఈ ఉత్సవాన్ని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా నగరంలోని ఆర్‌కే బీచ్‌ వద్ద నౌకాదళ సిబ్బంది చేసే విన్యాసాలు అందరినీ అబ్బురపరుస్తాయి. యుద్ధంలో మరణించిన అమరవీరులకు నేవీ డేలో భాగంగా ఉ.7 గంటలకు నావికా దళ అధికారులు విక్టరీ ఎట్‌ సీ వద్దకు వచ్చి నివాళులర్పిస్తారు. మ.3.30 గంటల నుంచి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్స్, హెలికాప్టర్లతో నేవీ సిబ్బంది సాహస విన్యాసాలను ప్రదర్శిస్తారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్‌ వార్‌ మెమోరియల్‌ సందర్శన అనంతరం నేవీ హౌస్‌లో ఉన్నతాధికారులు, అతిథులకు తేనీటి విందు ఇస్తారు. 

ముఖ్య అతిథిగా సీఎం వైఎస్‌ జగన్‌ 
నౌకాదళ దినోత్సవానికి ఈసారి ముఖ్య అతి«థిగా సీఎం వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. ఆయన మ.3.10గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుని 3.40గంటలకు సర్క్యూట్‌ గెస్ట్‌హౌస్‌కు వెళ్తారు. సా.4 గంటలకు ఆర్‌కే బీచ్‌కు బయల్దేరుతారు. 5.30గంటల వరకు అక్కడ విన్యాసాలను తిలకిస్తారు. అనంతరం నేవీ హౌస్‌లో ‘ఎట్‌ హోం’ పేరిట నిర్వహించే తేనీటి విందులో సీఎం పాల్గొంటారని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ వెల్లడించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా