ఓట్ల పండగ.. ఇక స్మార్ట్‌ గురూ..!

13 Mar, 2019 18:58 IST|Sakshi

ఆరు యాప్‌లతో సులువు  కానున్న ఎన్నికల తంతు

అందుబాటులో ఉన్న ఎన్నికల కమిషన్‌ యాప్‌లు

సాక్షి, శ్రీకాకుళం:  ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు ఆధునిక టెక్నాలజీతో జరగనున్నాయి. ఓటరు సౌలభ్యం కోసం ఎన్నికల కమిషన్‌ చాలా రకాల యాప్‌లను అందుబాటులో తీసుకువచ్చింది.  ఓటు నమోదు, నమోదైన ఓటు ఉందో లేదో తెలుసుకోవడం, ఫిర్యాదు చేయడం, ఎన్నికల నియమావళిపై ప్రజల నిఘా, ఇలా పలు అంశాల్లో  యాప్‌లను రూపొందించారు. కేవలం అండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్, ఇంటర్‌నెట్‌ సదుపాయం ఉంటే ఎవరైనా ఇంటి దగ్గర నుంచి కానీ, ఆఫీస్‌ నుంచి కానీ ఎక్కడి నుంచైనా దరఖాస్తు, ఫిర్యాదు, సమాచారం ఇచ్చే అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పించింది.  ‘నా ఓటు’, ఓటరు సర్వీస్, సమాధాన్, సి విజల్, సుగం, వీవీప్యాట్‌ వంటి యాప్‌లను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఈ యాప్‌లను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ సదుపాయాలు పొందవచ్చు.  

ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌

ఓటు నమోదు కోసం నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ యాప్‌ను ఎన్నికల కమిషన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటిలో ఉండే ఓటు నమోదు చేసుకోవచ్చు. ఈ సర్వీసు పోర్టల్‌ యాప్‌లో మన ఓటు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. అధికారులు ధ్రువీకరించిన తరువాత గుర్తింపు కార్డును సర్వీస్‌ పోర్టల్‌ నుంచి పొందవచ్చు. దీని వల్ల ఓటు నమోదు కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.

సీ విజల్‌

పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘన వంటి అంశాలపై ఫిర్యాదు చేయాలంటే ఇంతవరకు నేరుగా అధికారులను కలిసి తెలియజేయాల్సి వచ్చేది. అయితే ఈ ఎన్నికల కమిషన్‌ రూపొం దించిన సీ విజల్‌ యాప్‌ ద్వారా ఉన్నచోట నుంచే ఫిర్యాదు చేయవచ్చు. దీనికి కావాల్సిన ఆధారాలు, ఫొటోలు  కూడా అప్పుడే అప్‌లోడ్‌ చేయవచ్చు. దీంతో ఆ ఫిర్యాదు అ«ధికారులకు వెంటనే చేరుతుంది. దీని నిర్వహణకు కలెక్టరేట్‌లో ఒక సెల్‌ కూడా నిర్వహిస్తారు. ఫిర్యాదులపై వెంటవెంటనే చర్యలు  కూడా ఉంటాయి. 

‘నా ఓటు’

ఓటరు సెర్చ్‌ ఆప్షన్‌లో రిజిస్ట్రేషన్‌ వివరాలు ఎంటర్‌ చేస్తే, తొలుత మనకు సంబంధించిన ఓటరు గుర్తింపు నంబర్‌ వస్తుంది. నియోజకవర్గం పేరు. పోలింగ్‌ స్టేషన్‌ వివరాలు వస్తాయి. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వివరాలు, పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లేందుకు మార్గం, తదితర వివరాలు వస్తాయి. సెర్చిలోకి వెళ్లి ఎపిక్‌ నంబర్‌ టైప్‌ చేస్తే దారి చూపుతుంది. దివ్యాంగులకు వాహనాలు కావాలన్నా ఆ యాప్‌లో కోరుకోవచ్చు.

సమాధాన్‌ యాప్‌ 

ఎన్నికల సమయంలో ఓటరు సందేహాల నివృత్తికి  ఆర్డీవో (ఆర్‌వో), కలెక్టరేట్‌ (జిల్లా ఎన్నికల అ«ధికారి)లలో టోల్‌ ఫ్రీ నంబర్‌ 1950ను అందుబాటులో ఉంచారు. నేరుగా ఫోన్‌   చేయడం, ఈమెయిల్, ఎస్‌ఎంఎస్, ఫ్యాక్స్, తపాలా ద్వారా ఫిర్యాదు, సమాచారం తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంటి దగ్గర నుంచి ఫోన్‌ ద్వారా సందేహలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి ఫిర్యాదుకు సమాచారం అందుతుంది.

సువిధ యాప్‌

ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు పలు రకాల ప్రచార కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనాల్సి ఉంటుంది. దీనికి గాను అధి కారుల అనుమతి తప్పనిసరి. మాటిమాటికీ కార్యాలయాలకు వెళ్లకుండా ఈ యాప్‌ ద్వారా వారు పలు అనుమతులు తీసుకోవచ్చు.

సుగం యాప్‌

ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రచార నిర్వహణకు వినియోగించే వాహనాలను నియంత్రించడానికి రూపొందించిందే సుగం యాప్‌. ప్రచారం కోసం అభ్యర్థులు, పార్టీలు పోలింగ్‌  సందర్భంగా అధికారులు వినియోగించే వాహనాల రాకపోకల వివరాలన్నీ ఈ యాప్‌లో నమోదవుతాయి. ఆ వాహనాల్లో ఉన్నవారి వివరాలు, డ్రైవర్ల వివరాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఓటర్లు జాబితా సరిచూసుకునే యాప్‌ను కూడా పొందుపరిచారు. ఏదైనా ఒక ప్రాంతంలో ఓటు హక్కును కల్పించేందుకు ఈఆర్‌వో నెట్‌. 20 వెర్షన్‌ సాఫ్ట్‌ వేర్‌ను ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టింది. ముందుగా ఈ సాఫ్ట్‌వేర్‌ను పట్టణ ప్రాంతాల ఓటరు జాబితాలో ఉపయోగించి ఒకే వ్యక్తి పేరిట రెండు ఓట్లు  ఉంటే సంబంధిత ఓటరుకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఒక ఓటును తొలగిస్తారు.

మరిన్ని వార్తలు