చూసి తినండి!

2 Oct, 2014 01:29 IST|Sakshi
చూసి తినండి!

సాక్షి, అనంతపురం :
 అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ సమీపంలో కొత్తగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్‌కు కొంత మంది యువకులు వెళ్లారు.. బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు.. దాన్ని తినే సమయంలో ఏదో తేడా కన్పించింది.. దీంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అది గొడవకు దారి తీసింది.. స్థానికంగా ఉన్నకొంత మంది వ్యాపారులు జోక్యం చేసుకుని సర్ది చెప్పి పంపించారు.

 టవర్‌క్లాక్ సమీపంలోనే మరో రెస్టారెంట్‌లో బిర్యానీలో కట్ నూడుల్స్ కలిపినట్లు గుర్తించి వినియోగదారులు నిలదీశారు. దీంతో గొడవ మొదలైంది. సమస్యను ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించడంతో నిర్వాహకులు దిగొచ్చారు. సమస్య పెద్దది కాకుండా చూశారు.

 ‘సర్. బిర్యానీ వేడివేడిగా ఉంది. చల్లారకముందే తినేయండి’ అంటూ ఇటీవల నగరంలో ఏ రెస్టారెంట్/హోటల్‌కు వెళ్లినా వెయిటర్లు తొందర పెడుతున్నారు. అది చల్లారితే కట్ నూడుల్స్ బాగోతం బయటపడుతుందన్నది వారి భయం. ఇందుకుతగ్గట్టే ఏసీ కూడా తక్కువగా పెడుతున్నారు. సాధారణంగా బిర్యానీ తయారీకి బాస్మతి బియ్యం వాడతారు. ఇవి రుచికరంగా ఉంటాయి. అయితే.. మార్కెట్లో వీటి ధర ఎక్కువగా ఉంటోంది. కిలో రూ.110 పైమాటే. దీంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు ఖర్చు కొంత తగ్గించుకునేందుకు లావురకం చైనీస్ నూడుల్స్ కలుపుతున్నారు. వీటిని బాస్మతి బియ్యం పరిమాణంలోనే కత్తిరించి బిర్యానీలో వేస్తున్నారు. దీనివల్ల వినియోగదారులు తేడాను వెంటనే కనిపెట్టలేకపోతున్నారు. నూడుల్స్ ధర కిలో రూ.60లోపే ఉంటోంది. వీటిని బిర్యానీ వండే సమయంలో కలపరు. వినియోగదారుడు ఆర్డర్ ఇచ్చినప్పుడు డిష్‌లో కలిపి తీసుకొస్తున్నారు. రంగు, మసాల దట్టించి ఉండడంతో తేడాను గుర్తించడం కష్టమవుతోంది.

 మాంసాహారులకే కాదు.. వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్‌రైస్ తినేవారికీ ఈ బెడద తప్పడం లేదు. బార్ అండ్ రెస్టారెంట్లు, దాబాలకు చాలా మంది మద్యం తాగేందుకు వెళుతుంటారు. మద్యం తీసుకున్నాక చివర్లో బిర్యానీ ఆర్డర్ చేస్తుంటారు. మద్యం మత్తులో ఉండే వారికి ఏమిచ్చినా తింటారనే భావన నిర్వాహకుల్లో ఉంది. దీంతో బిర్యానీని యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు.

 నిద్దరోతున్న ప్రజారోగ్య శాఖ .. ఆహార పదార్థాల కల్తీని నివారించాల్సిన ప్రజారోగ్య శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలున్నాయి. జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల నుంచి క్రమం తప్పకుండా మామూళ్లు ముడుతుండడంతో తనిఖీలు నిర్వహించడం లేదన్న అపవాదు ఉంది. ఫలితంగా వాటి నిర్వాహకులు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.


 

మరిన్ని వార్తలు