నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

5 May, 2019 19:11 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల సిబ్బంది రీ పోలింగ్‌లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రీ పోలింగ్‌ జరగనున్న పోలింగ్‌ బూత్‌ల వద్ద మూడంచెల పోలీస్‌ భద్రత ఏర్పాటు చేశామని, ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కుని వినియోగించుకోవాలని. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని చెప్పారు. ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించేలా స్పష్టమైన ఆదేశాలను జారిచేశామన్నారు. రాజకీయ పార్టీల పోలింగ్ కేంద్రం ఏజెంట్లు నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని సహకారాన్ని అందించాలని కోరారు.

ఎటువంటి ఇబ్బందులు లేకుండా రీ పోలింగుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సెంట్రల్ పరిశీలకులు, ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు ఇప్పటికే చేరుకోవడం జరిగిందన్నారు. ఆర్వో, ఏఆర్వో, పోలింగ్ కేంద్రాల సిబ్బందికి రీ పోలింగ్ పకడ్బందీగా నిర్వహించేలా సూచనలు జారీ చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే రీ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని తెలిపారు. రీ పోలింగ్ కేంద్రాల వద్ద బెల్ ఇంజినీర్లను సిద్ధంగా ఉంచుతామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు కూడా సిద్ధం చేశామన్నారు. ఎండ తీవ్రత దృష్టా‍్య పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

మరిన్ని వార్తలు