మంత్రి పుల్లారావు దాష్టీకాలపై  ఈసీ సీరియస్‌

22 Mar, 2019 02:10 IST|Sakshi

పుల్లారావుకు, భార్యకు  నోటీసులు జారీ

నేడు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వద్ద హాజరుకావాలని ఆదేశం

సాక్షి, అమరావతి బ్యూరో: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన భార్య తేనె వెంకాయమ్మ ఆగడాలకు చిలకలూరిపేట నియోజకవర్గంలో అడ్డూఅదుపూ లేకుండా  పోతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను టీడీపీలోకి రావాలని.. లేకపోతే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో మంత్రి పుల్లారావు దంపతులకు, సీఐకి ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నోటీసులు పంపించింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎస్సీ నాయకుడు పొంగలూరు వెంగల్రాయుడు గతంలో మంత్రి పుల్లారావు అనుచరుడిగా ఉండేవారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజని నియమితులయ్యాక, గత జనవరిలో ఆ పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆరోజు నుంచి తరచూ పుల్లారావు, ఆయన భార్య వెంకాయమ్మ పలుమార్లు వెంగల్రాయుడికి వాట్సప్‌ వాయిస్‌ కాల్‌ ద్వారా ఫోన్‌ చేసి తిరిగి టీడీపీలోకి రాకపోతే రౌడీషీట్‌ ఓపెన్‌ చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆయన టీడీపీలోకి వచ్చేందుకు ససేమిరా అనడంతో పోలీసులను రంగంలోకి దించారు. గతేడాది డిసెంబర్‌లో తొలగించిన రౌడీషీట్‌ను తిరిగి ఓపెన్‌ చేస్తామంటూ పోలీసులతో హెచ్చరికలు జారీ చేయించారు.

టీడీపీలో చేరాలని ఎస్‌ఐ బెదిరింపులు
చిలకలూరిపేట టౌన్‌ ఎస్‌ఐ వెంకట సురేష్‌ వెంగల్రాయుడికి ఫోన్‌ చేసి నీ మీద రౌడీషీట్‌ ఓపెన్‌ చేయమని తమకు ఎస్పీ నుంచి ఒత్తిడి ఉందని బెదిరించారు. దీంతో మంత్రి వాయిస్‌ కాల్‌లు, ఎస్‌ఐ ఫోన్‌ కాల్‌లకు సంబంధించిన వివరాలను ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది, మానవహక్కుల కమిషన్, హైకోర్టు ప్రధాన కార్యదర్శి, గవర్నర్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లకు వెంగల్రాయుడు ఆధారాలతో సహా ఈ నెల 19న పంపారు. తాను దళిత వర్గానికి చెందిన వాడిని కావడంతోనే బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని వెంగల్రాయుడు ఈసీకి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈసీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో హాజరు కావాలంటూ పుల్లారావు, ఆయన భార్య తేనె వెంకాయమ్మతో పాటు చిలకలూరిపేట అర్బన్‌ సీఐ జి.శ్రీనివాసరావుకు ఎన్నికల  రిటర్నింగ్‌ అధికారి హుస్సేన్‌ సాహెబ్‌ నుంచి నోటీసులు అందాయి. ఫిర్యాదు చేసిన వెంగల్రాయుడును సైతం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు