సఫారీకి సై!

16 Dec, 2017 11:49 IST|Sakshi

జంగిల్‌ సఫారీకి ఎట్టకేలకు తొలగిన అడ్డంకులు

రేపు నల్లమలలోని ఎకో టూరిజం ప్రారంభం

ఓపెన్‌ టాప్‌ జిప్సీలలో అభయారణ్య ప్రయాణం.

పర్యాటకుల మనసు దోచుకోనున్న నల్లమల అందాలు

ప్రకృతి ప్రేమికులకు సరికొత్త అనుభూతి  

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

పెద్దదోర్నాల: దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని అబ్బురపరిచే ప్రకృతి సోయగాలు, వింతలు విశేషాలను తిలకించే అద్భుత అవకాశం పర్యాటకులకు కలుగబోతోంది. పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు సమీపంలో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగాయి. ఈ ఆదివారం ఎకో టూరిజాన్ని ప్రారంభించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయి ఏడాది దాటినా ప్రభుత్వ పెద్దల నిర్లిప్త ధోరణితో ఎప్పుడు ప్రారంబానికి నోచుకుంటుందోనన్న సంశయం కొంత కాలంగా అటు పర్యాటకులు, ఇటు అటవీశాఖాధికారుల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం అనంతరం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు ఎకో టూరిజాన్ని ఫ్రారంభించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఏర్పాట్లు వేగవంతం..
పర్యావరణ నల్లమల అభయారణ్యం ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పర్వతాలు, లోయలు, ఆకాశాన్ని తాకే మహా వృక్షాలు కనువిందు చేస్తాయి. ఇవి నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే పర్యాటకులకు కనిపించే నల్లమల సోయగాలు. పర్యాటకులను నల్లమలలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా చేపడుతున్నారు. ముఖద్వారం, టికెట్‌ కౌంటర్‌ గది, సిబ్బంది, మ్యూజియం గదులను నల్లమల అటవీ ప్రాంతంలోని సహజత్వానికి దగ్గరగా ఉండేలా తుది మెరుగులు దిద్దుతున్నారు.

ప్రయాణం కొనసాగేదిలా..
పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలో మీటరు వద్ద నున్న గోర్లెస్‌ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి రెండు ఓపెన్‌ టాపు జిప్సీలలో ప్రయాణం మొదలవుతుంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వెదురు పడియ బేస్‌ క్యాంప్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో ఈ ప్రయాణం ముగుస్తుంది, నల్లమల టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులోని శీతోష్ణస్థితి ప్రాంతమైన పులిచెరువు ప్రాంతం వన్య ప్రాణులకు మంచి ఆవాసం, సహజ సిద్దంగా ఉండే ఈ ప్రాంతంలో ఎన్నో వన్య ప్రాణులు స్వేచ్ఛాయుత వాతావరణంలో సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడే వన్య ప్రాణులను వీక్షించేందుకు వాచ్‌ టవర్‌ను నిర్మించారు. సాధారణంగా ఈ  ప్రాంతానికి వెళ్లే అవకాశం కేవలం అటవీశాఖ అ«ధికారులకు మాత్రమే ఉండేది. గతంలో ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సామాన్యులకు అనుమతి లేదు. కానీ, ఎకో టూరిజం ఏర్పాటుతో సామాన్యులకు సైతం ఈ ప్రాంతంలో పర్యటించే అవకాశం దక్కనుంది, సుమారు 14కిలో మీటర్ల మేర 1.30 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం పర్యాటకుల మనసును దోచనుంది. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అటవీశాఖ చేపట్టిన ఈ ప్రాజెక్టుతో పర్యావరణ ప్రేమికులకు సరికొత్త అనుభూతిని మిగల్చనుంది.

జంగిల్‌ సఫారీ వివరాలు
ప్రయాణ దూరం  : 17 కి.మీ
సమయం         : 1.30 గంటలు
జిప్సీ చార్జి         : రూ.800
ఒక్కొక్కరికి        : రూ.150 (ఒక్కో జీప్సీలో ఆరుగురికి అనుమతి)

మరిన్ని వార్తలు