మలుపులు తిరుగుతున్న జెడ్పీ రాజకీయం

11 Dec, 2014 02:57 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా పరిషత్ ఛైర్మన్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ అంశం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈదర హరిబాబుకు హైకోర్టు డివిజన్ బెంచిలో ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా కోర్టులో ఉన్న ఆయన వ్యాజ్యాన్ని మూడు నెలల్లోగా పరిష్కరించాలని సూచించిన హైకోర్టు బెంచి అప్పటి వరకూ వైస్ ఛైర్మన్‌గా ఉన్న నూకసాని బాలాజీని జిల్లా పరిషత్ అధ్యక్షునిగా కొనసాగాలని ఆదేశించింది. విప్ చెల్లదంటూ హైకోర్టు సింగిల్ బెంచి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచి పరిగణనలోకి తీసుకోలేదు.

దీంతో ఈదర హరిబాబుకు కష్టకాలమే ఎదురయింది. ఆయన జిల్లా కోర్టు తీర్పు వచ్చే వరకూ ఏ పదవిలో ఉండే అవకాశం లేదు. ఈదరపై జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వేసిన అనర్హత వేటును హైకోర్టు సింగిల్ బెంచి గత నెలలో కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం నాయకులు డివిజన్ బెంచికి అప్పీల్‌కు వెళ్లారు. పలు అంశాలను డివిజన్ బెంచి విచారించింది. ఒక జెడ్పీ విషయంలో ఇంత మంది కోర్టును ఆశ్రయించడం, ఖరీదైన లాయర్లను నియమించడం చూసిన న్యాయమూర్తులు అసలు ఈ పదవి వల్ల వచ్చే ఆదాయం ఎంత? దీని వెనుక ఏమైనా అవినీతి కోణాలున్నాయా? జెడ్పీటీసీల ఆస్తుల వివరాలపై కన్ను వేయాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

జిల్లాలో 56 జెడ్పీటీసీ స్థానాలకుగాను 31 వైఎస్సార్ కాంగ్రెస్, 25 తెలుగుదేశం గెలుచుకున్న సంగతి తెలిసిందే. తమకు మెజారిటీ లేకున్నా జెడ్పీని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ప్రలోభాలకు లోనుచేసి ముగ్గురు జెడ్పీటీసీలను తమవైపు తిప్పుకుంది. గెలిచే అవకాశం లేకపోవడంతో ఒకసారి ఎన్నికను వాయిదా వేయించింది. రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన జెడ్పీటీసీని ఎస్సీఎస్టీ కేసులో అరెస్టు చేసి తాము గెలిచేందుకు ప్రయత్నం చేసింది. అయితే చివరి నిమిషంలో ఆ పార్టీకి చెందిన ఈదర హరిబాబు అనూహ్యంగా అడ్డం తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

దీంతో తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పేందుకు వైఎస్సార్ సీపీ వ్యూహాత్మకంగా హరిబాబుకు మద్దతు ఇవ్వడంతో ఆయన జెడ్పీ ఛైర్మన్ అయ్యారు. విప్ ధిక్కరించారంటూ ఆ పార్టీ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన కలెక్టర్.. హరిబాబుపై అనర్హత వేటు వేశారు. దీంతో వైస్ ఛైర్మన్ నూకసాని బాలాజీ జెడ్పీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దీనిపై హరిబాబు కోర్టును ఆశ్రయించగా జిల్లా కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో విప్ చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన కోర్టు ఉత్తర్వులు జిల్లా అధికారులకు రాకముందే ఆయన తన స్థానంలో కూర్చున్నారు.

ఈలోగా తెలుగుదేశం నాయకులు డివిజన్ బెంచిని ఆశ్రయించడం, తమకు ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని జెడ్పీ సీఈవో ప్రకటించడంతో వివాదం కొనసాగింది.  ఒక దశలో జెడ్పీ ఛైర్మన్ ఛాంబర్‌కు అధికారులు తాళాలు వేయడంతో హరిబాబు ఛాంబర్ ముందు మూడు రోజుల పాటు ధర్నా చేశారు. చివరికి డివి జన్ బెంచి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో తాత్కాలికం గా ఈ వివాదానికి తెరపడినట్లైంది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులే ఇచ్చిం దని ఆ ఉత్తర్వులు చదివిన తర్వాతే తాను స్పందిస్తానని హరిబాబు మీడియాకి తెలిపారు. కోర్టు ఆదేశాలు అందిన వెంటనే నూకసాని జెడ్పీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

మరిన్ని వార్తలు