విద్యార్థికి శుభవార్త!

25 Jan, 2020 11:42 IST|Sakshi

రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌ దరఖాస్తులకు మోక్షం

కళాశాలలకే ఎడిట్‌ ఆప్షన్‌ను ఇచ్చిన ప్రభుత్వం

జిల్లాలో 20 వేలమంది విద్యార్థులకు ఊరట

ఈ నెలాఖరు వరకు గడువు

అనంతపురం: సాంకేతిక కారణాలతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందలేకపోయిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తిరిగి పరిశీలించే అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలోని 20 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే కోర్సు పూర్తి చేసి కళాశాల నుంచి వెళ్లిపోయిన విద్యార్థులను కూడా పిలిపించి దరఖాస్తులు పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

చిన్నచిన్న కారణాలతో కొర్రీ
కరువుకు నిలయంగా మారిన అనంతపురం జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై ఆధారపడి చదివే విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్నచిన్న కారణాలను సాకుగా చూపి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మంజూరు కాక ఎందరో విద్యార్థులుఇబ్బందులు పడ్డారు. దరఖాస్తు సమయంలో కులధ్రువీకరణ, రేషన్‌కార్డు ఆధార్‌కార్డు, పదో తరగతి మార్కుల జాబితా నమోదులో తప్పులు, బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడకపోవడం తదితర సమస్యల కారణంగా వేలాదిమంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి దూరమయ్యారు. ఇలాంటి విద్యార్థుల సమస్యలకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం జిల్లా అధికారులకు ‘ఎడిట్‌’ ఆప్షన్‌ ఇవ్వలేదు. ఎవరైనా అమరావతికి వెళ్లి ఎడిట్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కొందరు అమరవాతికి వెళ్లి ఎడిట్‌ చేయించుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా చాలామంది అంతదూరం వెళ్లలేకపోయారు. జిల్లాలకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చే విషయాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఎడిట్‌ ఆప్షన్‌ కోసం కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు 2014–15 విద్యా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఏటా 4 వేల దరఖాస్తులు పెండింగ్‌ ఉంటాయి. ఈలెక్కన గడిచిన ఐదేళ్లలో సుమారు 20 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌ ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

జిల్లా అధికారులు, కళాశాలలకే ఎడిట్‌ ఆప్షన్‌
ఏళ్ల తరబడి పెండింగ్‌ ఉన్న అర్హులైన విద్యార్థుల దరఖాస్తులను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో దరఖాస్తు సమయంలో జరిగిన తప్పిదాలను సరి చేసేందుకు జిల్లా అధికారులు, కళాశాలలకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా కుల, ఆదాయం, పదో తరగతి మార్కుల జాబితా, బయోమెట్రిక్‌ పడని విద్యార్థులకు పెన్నార్‌ భవనంలోని సాంఘిక సంక్షేమశాఖ డీడీ కార్యాలయానికి ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చారు. బయోమెట్రిక్‌ పడని విద్యార్థులకు ఐరిస్‌ ద్వారా అథెంటికేషన్‌ చేస్తారు. ఆధార్, మొబైల్‌ నంబరు, కోర్సు ఎడిట్, కళాశాల తప్పుగా నమోదు, బ్యాంకు ఖాతాల వివరాలు సరి చేసేందుకు కళాశాలలకే ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చారు. అయితే ఈనెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని వార్తలు