చదువు కొనాల్సిందే

12 Jun, 2019 10:15 IST|Sakshi

వేసవి సెలవులు ముగిశాయి.. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి.. విద్యార్థులకు పుస్తకాల బరువు, తల్లిదండ్రులకు ఫీజుల భారం తప్పడం లేదు.. ఐఐటీ, నీట్, ఒలింపియాడ్, టెక్నో, ఈటెక్నో తదితర పేర్లతో కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రుల ఆశను కార్పొరేట్‌ యాజమాన్యాలు చక్కగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు రూ.25 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులతోపాటు పుస్తకాలకు రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వీటితోపాటు అడ్మిషన్‌ ఫీజును కూడా వసూలు చేస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన విద్యాశాఖాధికారులు కార్పోరేట్‌ విద్యాసంస్థలపై కన్నెత్తి చూడకపోడం అవినీతి ఆరోపణలకు దారితీస్తోంది. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
సాక్షి, నెల్లూరు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలో ఫీజుల పట్టికను ప్రదర్శించాల్సిఉంది. పట్టిక ఏ పాఠశాలలో కనిపించకపోయినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంపై కొందరు తల్లిదండ్రులు ప్రశ్నిస్తే తమ పాఠశాలలో అడ్మిషన్లు లేవంటూ తిరిగి పంపివేస్తున్న ఘటనలు ఉన్నాయి. పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ వేయాల్సి ఉన్నా ఆ ఊసే ఎక్కడా కనిపించలేదు. అధికారుల నిర్లక్ష్యంతో తల్లిదండ్రులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.

ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1054 కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 383 ప్రాథమిక, 274 ప్రాథమికోన్నత, 393 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 1,64,724 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితోపాటు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా 600కు పైగా ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో మరో 50 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నట్లు సమాచారం.

కార్పొరేట్‌ పాఠశాలలు వసూలు చేస్తున్న వివిధ రకాల ఫీజులను పరిశీలిస్తే ..  

తరగతి ఫీజు అడ్మిషన్‌ ఫీజు పుస్తకాలు,సామాగ్రి
1నుంచి 5వ తరగతి వరకు రూ.25వేలు-రూ.లక్ష రూ.5వేలు రూ.3వేల నుంచి రూ.5వేలు
5 నుంచి 10వ తరగతి వరకు రూ.40 వేలు-రూ.1.75 లక్షలు   రూ.10వేలు రూ.5 వేల నుంచి రూ.8 వేలు 

తమ బిడ్డలను ఉన్నతస్థాయిలో చూడాలన్న తల్లిదండ్రుల ఆశను కార్పొరేట్‌ విద్యాసంస్థలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. రకరకాల కోర్సుల పేరుతో భారీ మొత్తంలో ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఏడాది రూ.600 కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఫీజులను ప్రతి ఏడాది 20 నుంచి 30 శాతం వరకు పెంచుతూ తల్లిదండ్రులపై మరింత భారం మోపుతున్నారు. 

ఉత్తర్వులు బేఖాతర్‌ 
2008లో జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫీజులు నిర్ణయించేందుకు డీఈఓ, జిల్లా ఆడిట్‌ అధికారి, స్వచ్ఛంద సంస్థ లేదా తల్లిదండ్రులతో కూడిన కమిటీని కలెక్టర్‌ ఆధ్వర్యంలో నియమించాల్సిఉంది. ఈ కమిటీ పాఠశాల మౌలిక సదుపాయాలు, పరిస్థితులను పరిశీలించిన తరువాత ఫీజు ఎంత వసూలు చేయాలన్నది నిర్ణయిస్తుంది. పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ తదితరవి విక్రయించరాదు.

వీటిని యాజమాన్యాలు సూచించిన వారి వద్దే కొనాలన్న నిబంధన ఏమీ ఉండదు. వీటి అమ్మకాలను పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయకూడదు. పరీక్షల ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటీ, నీట్, ఒలింపియాడ్, కాన్సెప్ట్, టెక్నో, ఈటెక్నో, ఈ శాస్త్ర తదితర పేర్లను రాయకూడదు. కేవలం పాఠశాల అని మాత్రమే రాయాల్సిఉంది. అయితే ఈ నిబంధనలకు ఏ పాఠశాల యాజమాన్యం ఖాతరు చేయడం లేదు. లంచాలు అందుతుండడంతో అధికారులు పట్టించుకోవడం లేదు.

మరిన్ని వార్తలు