టెన్త్‌ ‘అంతర్గత’ మార్కులపై తనిఖీలు

16 Jan, 2019 12:34 IST|Sakshi
నారాయణపురంలో స్కూల్లో టెన్త్‌ మార్కులు అప్‌లోడ్‌ చేస్తున్న సిబ్బంది, పది విద్యార్థులు

మూడు స్థాయిల్లో ధ్రువీకరణ

ఎంఈవో నుంచి డీఈవో వరకు సభ్యులు

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పరిశీలన

ఈ నెల 28 నుంచి వారంపాటు నిర్వహణ

పశ్చిమగోదావరి  , నిడమర్రు: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో టెన్త్‌ ఇంటర్నల్‌ మార్కుల నమోదుపై తనిఖీలకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం వెళ్లనుంది. గతేడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాలలు అంతర్గత మార్కులు 20కి 20కి వేసుకోవటంతో టెన్త్‌ జీపీఏలు వారికే ఎక్కువగా వచ్చాయనే అభియోగాల నేపథ్యంలో ఈ సంవత్సరం పాఠశాల విద్యాశాఖ ముందుగానే అప్రమత్తమైంది. సమ్మెటివ్‌–1 పరీక్షతో పాటు నాలుగు ఫార్మెటివ్‌ పరీక్షలు పాఠశాల స్థాయిలో జరుగుతాయి. వీటిల్లో విద్యార్థులకు మార్కులు ఎలా వేశారో ప్రత్యక్షంగా విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను పరిశీలన చేయనుంది. ఈ పరిశీలన పూర్తిగా జిల్లా  విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీనియర్‌ హెచ్‌ఎంలు, మండల విద్యాశాఖ అధికారులు, ఎస్‌ఎస్‌ఏ సెక్టోరల్‌ అధికారులు, డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పర్యవేక్షణలో సాగుతుంది. మొత్తం మూడు స్థాయిల్లో ఈ పరిశీలన జరుగుతుంది. ఈ పరిశీలనలో కూడా ఏమైనా లోపాలు ఉంటే మరో కమిటీ గుర్తించి ఆ మేరకు అప్రమత్తం చేసేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది

20 శాతం పరిశీలన
జిల్లాలో ఈ ఏడాది 50,184 మంది ఎస్‌ఎస్సీ పరీక్షలు రాయనున్నారు. వీరికి నిర్వహించిన సమ్మెటివ్‌–1 పరీక్షకు 10 మార్కులు, ఒక్కో ఫార్మెటివ్‌ పరీక్షకు రెండున్నర మార్కులు చొప్పున నాలుగు ఫార్మెటివ్‌లకు 10 మార్కులు చొప్పున మొత్తం 20 మార్కులను కుదించి నమోదు చేయాల్సి ఉంది. విద్యార్థులు ఎలా పరీక్షలు రాశారు. వారి అభ్యసన సామర్థ్యాలు ప్రాజెక్టు వర్క్, మౌఖిక ఇంటర్వ్యూలు, స్లిప్‌ టెస్ట్‌లో మార్కులు, క్రమశిక్షణ తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఇంటర్నల్‌ మార్కులు సంబం ధిత పాఠశాల ఉపాధ్యాయులే కేటాయిస్తారు. అయితే ఈ మార్కుల కేటాయింపులో కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు చాలావరకు టెన్‌ జీపీఏలే ధ్యేయంగా చదివినా, చదవకున్నా, క్రమశిక్షణ లేమి ఉన్నా 20కు 20 వేసి ఉదారతను చాటుకుంటున్నాయని గతేడాది ఫలితాలు ఆధారంగా ఒక అంచనాకు విద్యాశాఖ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతర్గత మార్కుల నమోదు తనిఖీలకు వెళ్లటానికి జిల్లా విద్యాశాఖ తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తోంది. ఈ బృందాలు సంక్రాంతి సెలవుల అనంతరం కార్యాచరణకు దిగుతాయి.

20 శాతం పేపర్లు
తనిఖీలకు వెళ్లిన ప్రతి చోటా మొత్తం విద్యార్థుల్లో 20శాతం మంది పేపర్లు తీసి ఈ బృందం సభ్యులు పరిశీలన చేస్తారు. ఈ పరిశీలనలో ఏమైనా తప్పిదాలు దొర్లినా మరో కమిటీ గుర్తిస్తుంది. నిజంగా విద్యార్థులకు రాసిన సమాధానాలు ఆధారంగా మార్కులు వేసి వాటినే కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సీఎస్‌ఈ) వెబ్‌సైట్‌లో మార్కులు నమోదు చేశారా లేక ఇక్కడ ఏమైనా హెచ్చుతగ్గులుగా నమోదు చేశారా అనేది కూడా వీరు పరిశీలిస్తారు. విద్యార్థుల సమాధాన పత్రాలపై నమోదు చేసిన మార్కులు, సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన మార్కులు రెండూ ఒకేరకంగా ఉన్నాయా లేదా అనేది కూడా ఈ కమిటీలు ధ్రువీకరించాలి. ఇక్కడ ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడే సరిదిద్దాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

అక్రమంగా మార్కులు వేస్తే చర్యలు
ప్రైవేటు పాఠశాలలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అక్రమంగా మార్కులు వేసినట్టు పరిశీలనతో బహిర్గతమైతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఈ నెల 28నుంచి ఫిబ్రవరి 13 వరకూ అన్నిస్థాయిల్లో అంతర్గత మార్కుల పరిశీలన బృందాల నివేదికను రాష్ట్ర అధికారులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.– సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి

కమిటీల్లో సభ్యులు వీరే..
మండల స్థాయి కమిటీల్లో ఎంఈవో, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, ఆ మండలంలో సీనియర్‌ ప్రధానోపాధ్యాయులు సభ్యులు.
డివిజన్‌ స్థాయిలో డీవైఈవో, మండలంలో సీనియర్‌ హెచ్‌ఎం, ఎస్‌ఎస్‌ఏ నుంచి సెక్టోరియల్‌ అధికారి.
జిల్లాస్థాయిలో డీఈవో, అసిస్టెంట్‌ కమిషనర్‌(ఎగ్జామినేషన్‌), డీసీఈబీ సెక్రటరీ, డైట్‌ ప్రిన్సిపాల్‌ సభ్యులు
మండలస్థాయిలో ఈ నెల 28న ప్రారంభించి, పిబ్రవరి 4తో ముగించాలి.
డివిజన్‌ స్థాయిలో ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు
జిల్లాస్థాయిలో ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు పరిశీలన చేయాలని కమిషనర్‌ షెడ్యూల్‌ జారీ చేశారు.

మరిన్ని వార్తలు