మూగబోయిన రేడియో

13 Sep, 2018 13:33 IST|Sakshi
రేడియో పాఠాలు వింటూ విద్యార్థులు(ఫైల్‌)

పాఠశాలల్లో వినిపించని రేడియో పాఠాలు

స్పష్టత లేని విందాం–నేర్చుకుందాం

మీనా ప్రపంచం కార్యక్రమానిదీ అదేదారి

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

విద్యాశాఖ కార్యక్రమాలు సకాలంలో అమలుకు ఏమాత్రం నోచుకోవడం లేదు. అధికారులు నిర్ణయాలు తీసుకోడం తప్పా అమలులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలనే లక్ష్యంతో సర్వశిక్షా అభియాన్‌ ద్వారా జిల్లాలోని అన్నీ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం రేడియో పాఠాలను అమలు చేస్తుంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు దాటినా ఈ రేడియో పాఠాలు ఎక్కడా వినిపించడం లేదు.

బేస్తవారిపేట: 2013–14వ సంవత్సరం నుంచి విందాం–నేర్చుకుందాం అనే పేరుతో ప్రసారమ్యే ఈ రేడియో పాఠాలు విద్యార్థుల్లో ఆసక్తిని రేకిత్తించి వారిలో అభ్యసన స్థాయిని పెంచుతాయి. కథలు, ఆటపాటలతో కూడిన విద్య కావడంతో విద్యార్థులంతా రేడియో పాఠాలను శ్రద్ధగా వినేవారు. విద్యా సంవత్సరం ప్రారంభమై వంద రోజులు దాటుతున్నా రేడియో పాఠాలపై కార్యచరణ ప్రణాళిక లేకపోవడంతో పాఠశాలల్లో రేడియోలు ఉలుకు, పలుకు లేకుండా ఉన్నాయి.

ప్రతి రోజూ నిర్ణీత సమయంలో...
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠశాలల విద్యార్థులకు రేడియో పాఠాలను ముందుగానే అందించేవారు. రోజుకోసారి నిర్ణీత సమయంలోనే ఆయా పాఠాలు వినేందుకు వీలుండేది. నిపుణులైన విద్యావంతులు రేడియోలో పాఠాలు వినిపించేవారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు సైతం ఆసక్తిగా వినేవారు. రోజూ ఉదయం 11.15 గంటల నుంచి 11.45 గంటల వరకు అరగంట సేపు ప్రసారం చేసేవారు. 1, 2 తరగతులకు మంగళవారం, 3, 4, 5 తరగతులకు బుధ, గురు, శుక్రవారాల్లో ఆయా పాఠాలు వినిపించేవారు.

విద్యార్థులకు ఎంతో ఉపయోగం...
పద్యాలు, పాఠాలు, కృత్యాలు, పొదుపు, హాస్య కథలు, నాటికలు వంటి సందేశాత్మక అంశాలతో పాటు గుణాత్మక విద్యలో భాగంగా వివిధ అంశాలు ప్రసారం అయ్యేవి. విన్న తరువాత వారు పూర్తి చేసిన ప్రతిస్పందన పత్రాలను ఎస్‌ఎస్‌ఏ అధికారులకు ఉపాధ్యాయులు పంపేవారు. ఆశాశవాణి ద్వారా విద్యా సంవత్సరం ఆరంభం నుంచి మార్చి వరకు ఒక ప్రణాళికా ప్రకారం చేసేవారు.

ఉన్నత పాఠశాలల్లో మీనా ప్రపంచం...
ఉన్నత పాఠశాలల్లో మీనా ప్రపంచం పేరుతో రేడియో పాఠాలు ప్రసారం అయ్యేవి. వీటిని కూడా ఈ ఏడాది ఇంకా ప్రారంభించలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రేడియో పాఠాల ప్రసార అంశం గతంలో వివాదాల్లో చిక్కుకుంది. ప్రసారాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

వంద రోజులు దాటిన...
ఎట్టకేలకు 2016లో రాష్ట్ర రాజీవ్‌ విద్యా మిషన్‌ తిరిగి రేడియో పాఠాలు పునఃప్రసారం కోసం చర్యలు చేపట్టారు. 2016 నవంబరు 23 నుంచి పాఠాలు వినిపించారు. ఆ తరువాత 2017లో అక్టోబరు వరకు రేడియో పాఠాలు ప్రారంభించలేదు. ఇక ఈ ఏడాది వంద రోజులు కావస్తున్నా రేడియో పాఠాలపై కార్యచరణ ప్రణాళిక లేకుండా పోయింది. చివరకు 3, 4 నెలలు మాత్రమే రేడియో పాఠాలు వినిపించడంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోలేని పరిస్థితులు ఉన్నాయి.

మూలకు చేరిన రేడియోలు...
పాఠాలు ప్రసారం కాకపోవడంతో రేడియోలను బీరువాల్లో ఉంచారు. కొన్ని చోట్ల అవి పగిలిపోయి పనికి రాకుండా మారాయి. వీటికి మరమ్మతులు చేయడం, లేదా వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయలేదు. ఒక వేళ రేడియో పాఠాలు ప్రసారం చేసినా ఎన్ని పాఠశాలల్లో రేడియోలు పనిచేస్తున్నాయో లేదో అధికారులకే తెలియాలి. కొన్ని చోట్ల రేడియోల్లో బ్యాటరీలు బయటకు తీయకపోవడంతో జిగురు కారిపోయి పనికి రాకుండా పోయాయి. మరికొన్ని చోట్ల పనికి రాకుండా పోయాయి.

ఇంకా షెడ్యూల్‌ రాలేదు..
ఈ ఏడాది రేడియో ప్రసారాల షెడ్యూల్‌ ఇంకా విడుదల చేయలేదు. అన్నీ పాఠశాలల్లో రేడియోలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలని హెచ్‌ఎంలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఉన్నతాధికారుల నుంచి షెడ్యూల్‌ రాగానే విందాం–నేర్చుకుందాం కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో అమలు చేయడం జరుగుతుంది.
జింకా వెంకటేశ్వర్లు, ఎంఈఓ

మరిన్ని వార్తలు