అక్షరయజ్ఞం సాగిద్దాం..

2 Dec, 2013 02:00 IST|Sakshi

 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘నిరక్షరాస్యులైన అమ్మకు, నాన్నకు అక్షరం నేర్పిద్దాం. సంపూర్ణ అక్షరాస్యత సాధిద్దాం. వంద రోజుల్లో పది లక్షల మందిని అక్షరాస్యులను చేద్దాం. భారతదేశ అక్షర యజ్ఞ చరిత్రలోనే  ప్రకాశం జిల్లాను సువర్ణాక్షరాలతో లిఖిద్దామని’ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. ‘ప్రకాశం అక్షర విజయం’ కార్యక్రమ ర్యాలీని ఆదివారం ఆయన కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నెల్లూరు బస్టాండు, భాగ్యనగర్, రామ్‌నగర్ మీదుగా సభా స్థలైన మినీ స్టేడియం వరకు సాగింది. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మితో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం శాంతి కపోతాలను ఎగుర వేశారు. ఈ సందర్భంగా అక్షర విజయంలో భాగస్వాములైన అధికారులు, వలంటీర్లనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
 
  ‘ప్రకాశం జిల్లాలో విభిన్న పరిస్థితులున్నాయి. అత్యంత క్లిష్టమైన బాధ్యతను కలెక్టర్ విజయకుమార్ భుజాన వేసుకున్నారు. అక్షరాస్యతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కింద నుంచి నాలుగైదు స్థానాల్లో ఉంది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పదహారో స్థానంలో ఉంది. అక్షరాస్యత కోసం నియమించిన సాక్షరతా సిబ్బంది అప్పుడప్పుడూ కనిపిస్తారు. ఎక్కువసార్లు వినిపిస్తుంటారు. అరవై శాతం అక్షరాస్యత సాధించి నూరుశాతం సాధించినట్లు లెక్కలు వేస్తుంటారు. జిల్లాలో 30 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో 20 లక్షల మంది చదువుకున్నారు. చదువుకున్న ఇద్దరు శ్రద్ధపెట్టి మరొకరిని చదివిస్తే పది లక్షల మంది అక్షరాస్యులవుతారని’ వెల్లడించారు. రాష్ట్రంలో విభజన ఉద్యమాలు జరగకుండా ప్రశాంతంగా ఉంటే అక్షరాస్యులవుతున్న ఆ పది లక్షల మందిని చూసి తెలుగుతల్లి గర్వపడేదన్నారు. అక్షరం వస్తే జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతోపాటు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కూడా చదువుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో రకరకాల వాదనలు వింటున్నామని, సందేహాలకు తావులేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 23 జిల్లాలతో కలిసి ఉండాలంటూ సమైక్యాంధ్ర వర్ధిల్లాలని నినాదాలు చేశారు.
 
 చదువుకుందాం.. పిల్లలను తీర్చిదిద్దుదాం
 కేంద్ర మంత్రి పనబాక
 ‘మనం చదువుకుందాం. మంచిమాటలు చెప్పి పిల్లలను తీర్చిదిద్దుదాం. వారిని ఉన్నత స్థానంలో నిలుపుదామని’ కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి ఉద్బోధించారు. ప్రకాశం అక్షర విజయం సభలో ఆమె విశిష్ట అతిథిగా ప్రసంగించారు. ఒక కుటుంబం బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా మహిళపైనే ఆధారపడి ఉందని, నిరక్షరాస్యులైన మహిళలు అక్షరాస్యులైతే తమ బిడ్డలను ఉన్నతస్థాయిలో తీర్చిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. చదువుకోకుంటే మోసపోతారని హెచ్చరించారు.  ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఒక మహిళ చదివితే ఇంటిల్లిపాదికీ చదువు ఉంటుందన్నారు. ఈ జిల్లాకు చెందినవారు గతంలో ఉన్నత చదువులకు ఇతర జిల్లాలకు వెళ్లేవారని, ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎడ్యుకేషనల్ హబ్‌గా మారిందన్నారు.
 
 కొండపి శాసనసభ్యుడు జీవీ శేషు మాట్లాడుతూ అజ్ఞానంలో నుంచి విజ్ఞానానికి రావడానికి చదువు దోహదపడుతుందన్నారు. మాస్టర్‌గా ఉన్న తృప్తి మంత్రిగా ఉన్నా లేదన్నారు. గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబు మాట్లాడుతూ తాను చదువుకోలేకపోవడం వల్ల ఇంగ్లిష్‌లో కార్యకలాపాలు సాగించాలంటే మరొకరి సాయం తీసుకోవలసి వస్తోందన్నారు. రెండు లక్షల మంది ఓటర్లకు ప్రజాప్రతినిధిని అయినా చదువులో వెనుకబడినట్లు తెలిపారు. చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రకాశం అక్షర విజయం సామాజిక చిత్రం కావాలని, ఈ చిత్రానికి  కలెక్టర్ డెరైక్టర్ కావాలన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యుడు బీఎన్ విజయకుమార్ మాట్లాడుతూ చదువులేకపోతే హక్కులు తెలుసుకోలేరన్నారు.  శాసనమండలి సభ్యుడు పోతుల రామారావు మాట్లాడుతూ కేరళలో వనరులు లేకపోయినా వందశాతం అక్షరాస్యత సాధించి అభివృద్ధి చెందారన్నారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా కేరళవాసులు కనిపిస్తారని చెప్పారు.
 
 యజ్ఞంలా అక్షరాస్యత: కలెక్టర్
 వంద రోజుల్లో పదిలక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడాన్ని యజ్ఞంగా భావించి ముందుకెళ్తున్నట్లు కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు. జిల్లాలో 73 శాతం పురుషులు, 58 శాతం మహిళలు అక్షరాస్యులుగా ఉన్నారన్నారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా అనుకున్నంత అభివృద్ధి సాధించలేదన్నారు.  అక్షర విజయంలో పాలుపంచుకునే వలంటీర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు వారి సేవలను పరిగణనలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లా జడ్జి రాధాకృష్ణ మాట్లాడుతూ పదిలక్షల మందిని అక్షరాస్యులను చేసి రాష్ట్రంలో పదహారవ స్థానంలో ఉన్న జిల్లా  ఒకటో స్థానంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ అక్షర విజయంలో తమ వద్ద ఉన్న మూడువేల మంది సిబ్బందితో సహకరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్‌ను పెట్టి అక్షరాస్యతకు కృషి చేయడంతోపాటు శాంతిభద్రతలు పర్యవేక్షించేలా చూస్తానన్నారు. ఈ సందర్భంగా అక్షరాస్యతకు సంబంధించి ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. జెండర్ సభ్యులు నృత్య ప్రదర్శన చేశారు.

మరిన్ని వార్తలు