విద్యకు అధిక ప్రాధాన్యం

28 Nov, 2014 03:04 IST|Sakshi
విద్యకు అధిక ప్రాధాన్యం

బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
 
గుత్తి: రాష్ర్టలో విద్యా రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ,చేనేత,ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. పట్టణంలో రూ.80 లక్షలతో నిర్మించిన ప్రభుత్వం బాలిక కళాశాల హాస్టల్‌ను గురువారం స్థానిక ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహించారు. మంత్రి మాట్లాడుతూ బడ్జెట్‌లో విద్యకు సుమారు ఐదు వేల కోట్లను కేటాయించామన్నారు.  

రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజ్‌లను, పాఠశాలలను రెసిడెన్షియల్స్‌గా మార్చి నాణ్యతాప్రమాణాలను పెంపొందిస్తామన్నారు. త్వరలోనే  వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు. అనంతపురం  జిల్లాను ఐటీ, పారిశ్రామిక, వ్యవసాయపరంగా అభివృద్ధి చే స్తామన్నారు. ఎమ్మెల్యే  మాట్లాడారు.  ఏజేసీ ఖాజామొయిద్దీన్, మున్సిపల్ చైర్‌పర్సన్ తులసమ్మ, వైస్ చెర్మైన్ ఆర్ బీ పురుషోత్తం, ఎంపీపీ వీరేష్,   చంద్ర దండు వ్యవస్థాపకుడు ప్రకాష్ నాయుడు తదితరులు మాట్లాడారు.   

మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీం సాహెబ్, బీసీ డెప్యూటీ డెరైక్టర్  నాగముని, ఎస్సీ కార్పొరేషన్ ఏఈ సాయి ,తహశీల్దార్ హరిప్రసాద్, ఎండీఓ విజయ ప్రసాద్, గుంతకల్  ఎంపీపీ రామయ్య, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ర్ట కార్యదర్శి దిల్కా శ్రీనా, తెలుగు యువత మండల అధ్యక్షుడు అల్లీ,  తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ జాబితాలో చేర్చాలని  నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, ఎస్టీ జాబితాలో చేర్చాలని సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకులు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని  ఏపీ వెలుగు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శి మంత్రిని కోరారు.

 మంత్రి  ఉక్కిరిబిక్కిరి : కార్యక్రమంలో మంత్రి రవీంద్రను విద్యార్థినులు ప్రశ్నలతో  ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్, నూతనంగా నిర్మించిన బీసీ కాలేజ్ హాస్టల్‌కు ప్రహరీ లేదని, ఆవరణంలోకి పందులు, పశువులు ప్రవేశించి అపరిశుభ్రం చేస్తున్నాయని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

కళాశాలలో కనీసం తాగడానికి నీరు, మరుగుదొడ్లు లేవని, ఇబ్బందులు పడుతున్నామన్నారు.  విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమంటే ఇదేనా? అని మంత్రిని ప్రశ్నిచండంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విద్యార్థినులు బాగా మాట్లాడారు... సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని చెబుతూ అక్కడి నుంచి జారుకున్నారు.

మరిన్ని వార్తలు