విద్యా రుణం అందని ద్రాక్షే..

4 Feb, 2014 00:44 IST|Sakshi
 సాక్షి, గుంటూరు :విద్యారుణాల మంజూరులో బ్యాంకుల పోకడలు విద్యార్థులను హడలెత్తిస్తున్నాయి. నెలల తరబడి తిరిగినా రుణాలు మంజూరు కాక ఆర్థికపరమైన ఇబ్బందుల్లో పడుతున్నారు. సెక్యూరిటి డిపాజిట్లు, వాటికి సంబంధించిన పత్రాల సమర్పణ, లింకు డాక్యుమెంట్లు, మున్సిపల్ అనుమతుల పత్రాలు వంటివన్నీ విధిగా సమర్పించాలన్న నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చాంతాడంత పొడవు వున్న చెక్‌లిస్టు చూసి బెంబేలెత్తిపోతున్నారు. రుణ మంజూరుకు సంబంధించి ఆర్‌బీఐ మార్గదర్శకాలను సవరించిందనీ, అన్ని డ్యాక్యుమెంట్లు సక్రమంగా ఉంటేనే రు ణాలు  మంజూరు చేయడం వీలవుతుందని బ్యాంకర్లు అంటున్నారు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, ఎంసీఏ, ఐఐటీ, ఫార్మసీ వంటి ఉన్నత చదువులు చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఏటా విద్యా రుణాలను అందజేస్తున్నది.
 
 ఏటా జిల్లాలోని 10 వేల మందికి పైగా విద్యార్థులు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు. 2013-14 విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడచినా, జిల్లాలోని బ్యాంకర్లు విద్యారుణ లక్ష్యాలను సగం కూడా పూర్తి చేయలేదు. సుమారు రూ. 20 నుంచి రూ. 30 కోట్ల వరకు విద్యారుణాలు అందించాల్సిన బ్యాంకులు ఇప్పటి వరకు రూ.10 కోట్లు కూడా ఇవ్వలేదు. దరఖాస్తులు పెరిగినప్పటికీ రుణ మంజూరులు తగ్గాయి. దాదాపు జిల్లాలోని అన్ని బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. విద్యా రుణ లక్ష్యాలను చేరుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న పలువురు మేనేజర్లు సెక్యూరిటీ డిపాజిట్లు, ఆస్తి తనఖా, లింకు డాక్యుమెంట్లు, అనుమతులు వంటి సవాలక్ష నిబంధనలను ఏకరువు పెడుతుండడంతో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు.
 
 ఏదైనా స్థిరాాస్తిని తనఖా ఉంచి గృహ రుణం పొందిన దరఖాస్తుదారుడు తిరిగి అదే స్థిరాస్తిపై  విద్యారుణం పొందే వెసులుబాటు ఉన్నప్పటికీ మరోసారి ఆస్తి వాల్యుయేషన్, లీగల్ ఒపీనియన్లంటూ బ్యాంకర్లు దరఖాస్తుదారుల్ని నానా తిప్పలు పెడుతున్నారు. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీహెచ్‌ల నుంచి విద్యారుణాలు పొందడమంటే కష్టమేనన్న భావన వీరిలో పెరిగింది. రుణ మంజూరు కోరుతూ రెండు నుంచి మూడు నెలలు తిరిగినా పని కావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకుల్లోనూ సుమారు 200 పైగా విద్యారుణ దరఖాస్తులు పరిశీలనలో వున్నట్టు సమాచారం. వాటిని పరిశీలించి ఉన్నతాధికారుల పరిశీలనకు పంపాల్సిన క్షేత్ర స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో మార్పులు వచ్చిన నేపథ్యంలో ధ్రువపత్రాలన్నీ సక్రమంగా ఉంటేనే రుణాలు మంజూరు చేయడం సాధ్యమవుతుందని బ్యాంకర్లు చెపుతున్నారు. 
 
మరిన్ని వార్తలు