స్కూల్‌ టైమ్‌లో ఫోన్‌ వాడితే కఠిన చర్యలు

30 Jul, 2019 09:41 IST|Sakshi

విద్యాశాఖ మంత్రి హెచ్చరికతో ఉపాధ్యాయుల్లో కలవరం

సాక్షి, ఒంగోలు టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా ఫోన్‌ను వినియోగిస్తున్నారా.. జాగ్రత్త! ఇక నుంచి ప్రభుత్వం అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించనుంది. తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా సెల్‌ ఫోన్లలో మాట్లాడుకుంటున్నా, మెసేజ్‌లు పంపించుకుంటున్నా, వీడియోలు చూస్తున్నా, నెట్‌లో చిట్‌చాట్‌లు చేసుకుంటున్నా ఇక నుండి వాటన్నింటికీ ఉపాధ్యాయులు స్వస్తి పలకాల్సిందే. తరగతి గదుల్లో పాఠాలు చెప్పే సమయంలో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లను వినియోగించరాదంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆదేశించారు. మంత్రి ప్రకటనతో ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

అంతేగాకుండా ఉపాధ్యాయులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకునేందుకు వీలుగా ఉపాధ్యాయ సంఘాలన్నీ సెల్‌ఫోన్‌లో గ్రూపులు పెట్టుకున్నాయి. ఆ గ్రూపుల ద్వారా వారికి సంబంధించిన సమాచారం చేరవేసేందుకు గ్రూపులో మెసేజ్‌లు, వీడియోలు పోస్టు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. మంత్రి ప్రకటనతో ఆయా గ్రూపులకు చెందిన అడ్మిన్లు సమాచారం చేరవేస్తున్నారు. పాఠశాలల్లో తరగతులు చెప్పే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మెసేజ్‌లు, వీడియోలు పోస్టు చేయరాదని, ఒకవేళ పోస్టు చేస్తే అడ్మిన్‌తో పాటు పోస్టు చేసిన వారు కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నారు. 

స్వాగతిస్తున్న విద్యారంగ నిపుణులు
పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా సెల్‌ఫోన్లు వాడుతున్న వారిపై ప్రభుత్వం కొంతమేర కఠినంగా వ్యవహరించడాన్ని విద్యారంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్లు వాడరాదంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటనను స్వాగతిస్తూ ఉపాధ్యాయులు కూడా సమయాన్ని తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకే కేటాయించుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యను బలోపేతం చేయడంలో భాగంగా తరగతి గదుల్లో సెల్‌ఫోన్ల వినియోగానికి చెక్‌ పెట్టడం మంచి పరిణామమని విద్యారంగ నిపుణులతో పాటు అనేకమంది ఉపాధ్యాయులు హర్షిస్తున్నారు.

   

మరిన్ని వార్తలు