చదువు..బరువు

7 Jun, 2018 15:10 IST|Sakshi

ఒకటి, రెండో తరగతుల విద్యార్థులకు హోంవర్కు వద్దు

పుస్తకాల భారం తగ్గించేందుకు ‘బ్యాగ్‌ పాలసీ’ తీసుకురావాలి

తడిసిమోపెడవుతున్న ఫీజులు 

నిబంధనలకు మంగళం పాడుతున్న ప్రైవేటు స్కూళ్లు     సగం స్కూళ్లలో సొంత సిలబస్‌ పుస్తకాలే

ప్రైవేటు పాఠశాలలు తమ అత్యాçశతో.. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేస్తున్నాయి. ఓవైపు ఫీజులు.. మరోవైపు పుస్తకాల దందా సాగిస్తున్నారు. ఇదంతా.. ఒక ఎత్తైతే.. ప్రభుత్వ సిలబస్‌నే ప్రామాణికంగా తీసుకోవాలన్న నిబంధనను తుంగలో తొక్కేస్తూ సొంత సిలబస్‌ను పిల్లలపై రుద్దుతున్నారు. దీని వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో నష్టం వాటిల్లే ప్రమాదముంది. తెలంగాణ రాష్ట్రంలో సొంత సిలబస్‌తో నడుపుతున్న పాఠశాలలపై విద్యాశాఖాధికారులు దాడులు చేస్తుండగా.. మన జిల్లాలో మాత్రం కార్యాలయం కదలకుండానే ఆ శాఖాధికారులు నిద్దరోతున్నారు.
విద్యార్థి పాఠశాల జీవితం అయోమయంలోకి నెడుతోంది. విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తుండటంతో.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు స్కూళ్లు.. సొంత నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల జీవితాల్ని ఇరుకున పడేస్తున్నాయి. ప్రభుత్వం నిబంధనలు విధించినా.. అవి క్షేత్ర స్థాయిలో అమలు చెయ్యకపోవడంతో.. ఉన్నత చదువులకు వెళ్లే సమయంలో పిల్లలు అర్హత కోల్పోయే ప్రమాదముంది.


సాక్షి, విశాఖపట్నం : దేశంలోని అన్ని పాఠశాలల్లో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు హోంవర్కు ఇవ్వడాన్ని నిషేధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మద్రాస్‌ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. సీబీఎస్‌ఈ పాఠశాలలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. దీంతోపాటు పుస్తకాల మోతను కూడా తగ్గించాలని ఆదేశించింది. ఎన్‌సీఈఆర్‌టీ నిర్దేశించిన మేరకు ఒకటి, రెండో తరగతుల విద్యార్థులకు లాంగ్వేజ్, మేథమేటిక్స్, మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు లాంగ్వేజ్, ఎన్విరాన్‌మెంట్‌ సైన్సెస్, మేథమేటిక్స్‌ మినహాయించి ఇతర ఏ సబ్జెక్టులను ప్రవేశపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాలను తక్షణమే సూచించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల వెలువరించిన తీర్పులో నిర్దేశించింది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల క్రమంలోనే స్కూల్‌ బ్యాగ్‌ల బరువును తగ్గించేందుకు ‘చిల్డ్రన్‌ స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ’ని రూపొందించేలా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కోరాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి  ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయి. తమ ఆదేశాలను ఉల్లంఘించే ప్రయత్నం జరిగితే తీవ్రమైన చర్యలుంటాయని కోర్టు హెచ్చరించింది.


ఇదో పుస్తక వ్యాపారం
తల్లిదండ్రుల నుంచి ఎంత మేర పిండుకోవాలని ప్రైవేట్‌ స్కూళ్లు ఆలోచిస్తున్నాయి. అందిన కాడికి దోచుకునేందుకు అనేక ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న స్కూళ్లు.. తాజాగా పుస్తక వ్యాపారానికి తెరతీశారు. సాధారణంగా.. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించిన ఒకటో తరగతికి సంబంధించిన ఒక పుస్తకం రూ.10 నుంచి రూ.40 లోపు ఉంటుంది. అలాగే రెండో తరగతికి సంబంధించిన ఒక్కో పుస్తకం కేవలం రూ.20 నుంచి 50 రూపాయలుంటుంది. ఈ తక్కువ ధరలతో పుస్తకాలు అమ్మితే లాభం వచ్చే అవకాశం ఉండదు. అందుకే చాలా పాఠశాలలు కొత్త ఎత్తుగడను వేస్తున్నాయి. పుస్తక ముద్రణ సంస్థతో ముందుగానే మాట్లాడుకొని. తయారీకి అయ్యే ఖర్చు కంటే మూడు రెట్ల ధరను ముద్రించేస్తున్నాయి. దీంతో ఏ స్కూళ్లో చదువుతున్నారో అదే స్కూల్‌ పుస్తకాలు కొనాలనే నిబంధనతో తల్లిదండ్రుల చేతి చమురు వదులుతోంది. ఒకటో తరగతి పుస్తకాలు కొనాలంటే.. రూ.3వేల నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. అదే ప్రభుత్వ సిలబస్‌ ప్రకారం బోధన జరిగితే.. కేవలం వెయ్యి రూపాయలతో తేలిపోతుంది. ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు గుణాత్మక బోధన చెయ్యాల్సి ఉంటుంది. ఈ తరగతులు చదువుతున్న చిన్నారులను పరిసరాలతో మమేకం చేస్తూ విద్య బోధించాలే తప్ప పుస్తకాలు, హోం వర్క్‌లు ఉండకూడదు. కానీ ఏ ప్రైవేట్‌ స్కూల్‌లోనూ ఈ నిబంధనలు పాటించకుండా పసిమనసులతో పుస్తక వికృత క్రీడను ఆడుతున్నారు.

 
ఏవేవో పుస్తకాలు
తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుంటూ ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలచుకుంటున్నాయి. ఎల్‌కేజీ విద్యార్థులకు అవసరం లేని పుస్తకాల్ని సైతం అధిక ధరలకు అంటగడుతున్నారు. ఓనమాలు దిద్దాల్సిన ఎల్‌కేజీ విద్యార్థికి కంప్యూటర్, జీకే, ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ పుస్తకాలు కొనుగోలు చేయిస్తుండటం గమనార్హం. ఇవి కూడా ఒక్కో పుస్తకం రూ.70 నుంచి 150 రూపాయల వరకూ ఉంటోంది. స్థాయికి మించిన పుస్తకాలు కొనుగోలు చేయించేస్తున్నారు. చిన్న మెదడుకు చిన్న విద్య అనే సూత్రాన్ని పాటించాలని విద్యా నిపుణులు చెబుతున్నా.. అవన్నీ పెడచెవిన పెట్టేస్తూ.. తల్లిదండ్రుల నుంచి ఎంత గుంజుకోవాలో లెక్కలు వేసుకుంటున్నారు. సైన్స్, సోషల్‌ పాఠాలు సాధారణంగా రెండో తరగతి నుంచి ఒంటబడతాయి. వాటిపై అప్పుడే చిన్నారులకు అవగాహన వస్తుంది. కానీ.. ఎల్‌కేజీలోనే విద్యార్థులకు సైన్స్‌ బోధిస్తున్నారు. అవి వారికి అర్థం కాకపోయినా.. బట్టీ విధానం ద్వారానే నేర్పిస్తూ.. వారిలోని మేధో సంపత్తిని ఆదిలోనే నిర్వీర్యం చేసేస్తున్నారు. 

మరిన్ని వార్తలు