వ్యాపారంలా మారిన వైద్యం

2 Jul, 2013 03:08 IST|Sakshi

అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: విద్యా, వైద్య రంగాలు వ్యాపారంలా మారాయని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. డాక్టర్స్ డే సందర్భంగా ఐఎంఏ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి చిన్న జబ్బుకు ఇష్టారాజ్యంగా డబ్బులు పిండుకుంటుండడంతో వైద్య రంగంపై ప్రజల్లో ఓ చెడు భావం ఏర్పడే అవకాశం ఉందన్నారు. డాక్టర్ బీసీ రాయ్ జన్మదినం రోజున డాక్టర్స్ డే జరుపుకుంటారని, వైద్యులందరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ రామసుబ్బారావు మాట్లాడుతూ జబ్బుకు మాత్రమే కాకుండా మనిషికి కూడా వైద్యం అందించాలన్నారు. మొదట ప్రజలతో ప్రేమగా మాట్లాడాలన్నారు.
 
 అదే వారిలో కొండంత ధైర్యాన్ని నింపుతుందన్నారు.ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జొన్నా సత్యనారాయణ మాట్లాడుతూ తమ పరిధిలో ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఫీజుతోనే మంచి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రముఖ కంటి వైద్య నిపుణుడు అక్బర్ సాహెబ్ మాట్లాడుతూ ఉన్నత చదువులకు అధిక మొత్తంలో వెచ్చించాల్సి రావడమే వైద్య రంగం వ్యాపారం కావడానికి ప్రధాన కారణమన్నారు. అంతకుముందు బీసీ రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ వైద్యులు  అరుణ, కుబేర్, హరింద్రనాథ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రామసుబ్బయ్య, ఐఎంఏ సభ్యులు డాక్టర్ కేశన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు