పోలీస్‌ ఇమేజ్‌ పెంచుతా

22 Jul, 2018 08:09 IST|Sakshi

శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట

మావోల కదలికలపై నిరంతర నిఘా 

క్లబ్బులపై ఉక్కుపాదం మోపుతాం

అనుమతుల్లేని బోట్లపై కఠిన చర్యలు

శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలే

ఏలూరు రేంజ్‌ డీఐజీ రవికుమార్‌ మూర్తి

ఏలూరు టౌన్‌ : ఏలూరు రేంజ్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాననీ ఏలూరు రేంజ్‌ డీఐజీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన టి.రవికుమార్‌ మూర్తి చెప్పారు. ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ పోలీసుల్లో జవాబు దారీ తనాన్ని పెంచేందుకు కృషి చేస్తానని, పోలీస్‌ ఇమేజ్‌ పెంచుతానని అన్నారు. శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. 

పోలీస్‌ శాఖలో మీ ఎంట్రీ ?
డీఐజీ : 1992లో గ్రూప్‌–1 సర్వీసుకు ఎంపికై డీఎస్పీగా మొదట పోలీసు శాఖలో చేరాను. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలైన చింతపల్లి, నర్సీపట్నం, కాశీబుగ్గ ప్రాంతాల్లోనూ, రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరి ప్రాంతాల్లోనూ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించా. అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేశాను. 2002వ సంవత్సరంలో ఎస్పీగా తిరుపతి, విజయవాడల్లో పనిచేయటంతోపాటు, గుంటూరులో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా, ఏపీ ట్రాన్స్‌కో ఎస్పీగా, రాజమండ్రి అర్బన్‌ జిల్లా ఎస్పీగా పనిచేశాను. అనంతరం విశాఖపట్నం క్రైమ్, లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా పనిచేస్తూ 2017 నవంబర్‌లో డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నంలోనే జాయింట్‌ సీపీగా పనిచేశాను. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఏలూరు రేంజ్‌ డీఐజీగా పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తూ పోస్టింగ్‌ ఇచ్చింది. 

మీ ప్రాధాన్యతలు ఏమిటీ?  
డీఐజీ : ఏలూరు రేంజ్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకే పెద్దపీట వేస్తా. ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా, ప్రజల్లో పోలీస్‌ వ్యవస్థ పట్ల భయాన్ని పోగొట్టి వారితో మమేకం అయ్యేలా చేయటమే ప్రాధాన్యతాంశం. పోలీసుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు కృషి చేస్తాను. పోలీస్‌ శాఖలోని అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. జిల్లాలో పరిస్థితులను సమీక్షించి ప్రతీ సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం. 

గోదావరిలో పడవ ప్రమాదాలపై మీ చర్యలు? 
డీఐజీ : జిల్లాలోనూ, రేంజ్‌ పరిధిలోనూ పడవ ప్రమాదాల కారణంగా అనేకమంది ప్రయాణికులు తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకోవటం బాధాకరం. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అనుమతుల్లేని బోట్లు విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇష్టారాజ్యంగా పడవలు నడిపితే ఆయా యాజమాన్యాలపై కేసులు నమోదు చేసేందుకు వెనుకాడేదిలేదు. ఇక పడవల్లో విధిగా లైఫ్‌ జాకెట్లు, భద్రతా పరికరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతాం. ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి ఏఏ ప్రాంతాల్లో తరచూ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయో ఆయా ప్రాంతాల్లో నిఘా పెంచుతాం. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్‌ శాఖ అధికారుల సమన్వయంతో బోట్లలో భద్రతా ప్రమాణాలపై సమీక్షిస్తాం. 

జిల్లాలో మావోల కదలికలు గురించి..? 
డీఐజీ : ఆంధ్రా, తెలంగాణ, చత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతుంది. జిల్లాలో ఎప్పటికప్పుడు మావోల కదలికలు గుర్తిస్తూ దానికి అనుగుణంగా జల్లెడ పట్టే కార్యక్రమాన్ని చేపడతాం. ప్రభావిత ప్రాంతాల్లో  కూంబింగ్‌ నిర్వహిస్తూ వారి కార్యకలాపాలను నిరోధించేందుకు గట్టి చర్యలు తప్పకుండా ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రా ఒరిస్సా బోర్డర్‌ (ఏవోబీ)లో కొద్దిపాటి కదలికలు ఉన్నాయి..జిల్లాలో మావోల కార్యకలాపాలు లేవనే చెప్పాలి. 

సంఘ వ్యతిరేక శక్తులపై నిఘా ఉంటుందా? 
డీఐజీ : సంఘ వ్యతిరేక శక్తులను ఉపేక్షించేదిలేదు. ఏలూరు రేంజ్‌ పరిధిలో సమాచారాన్ని సేకరించి చట్టవ్యతిరేక, సంఘవ్యతిరేక కార్యకలాపాలు సాగించే వ్యక్తులు, ముఠాలను అణచివేసేందుకు చర్యలు తీసుకుంటాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారాన్ని తనకు నేరుగా అందించవచ్చు. గంజాయి రవాణా, మహిళలు, యువతుల అక్రమ రవాణా వంటివాటిపై నిఘా పెంచి, అటువంటి ముఠాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఇక జిల్లాలో అనధికార క్లబ్బులు, పేకాట, జూదం వంటివి లేకుండా చేసేందుకు చట్టం మేరకు చర్యలు తప్పవు. 

రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక కార్యాచరణ ఏమిటి?
డీఐజీ : రేంజ్‌లో 890 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, 2800 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు ఉన్నాయి. రాష్ట్రంతో పోల్చితే జిల్లాలో ప్రమాదాల నివారణకు ఆయా జిల్లాల ఎస్పీలు చేపట్టిన భద్రతా చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయి. నిరంతరం ప్రత్యేకంగా రోడ్డు భద్రతపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతాం. 

మరిన్ని వార్తలు