‘ఈనాడు’ భవనాల్ని కూల్చేయండి

19 Dec, 2013 02:30 IST|Sakshi
‘ఈనాడు’ భవనాల్ని కూల్చేయండి

 విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖపట్నంలోని ‘ఈనాడు’ కార్యాలయంలో అక్రమంగా నిర్మించిన భవనాల్ని కూల్చివేయాలని మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్.. జోనల్ కార్యాలయానికి, ‘ఈనాడు’ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. అక్రమ కట్టడాలను 15 రోజుల్లో కూల్చివేయాలని పేర్కొన్నారు.
 
 లీజుకని తీసుకుని.. తానే యజమానినని చెప్పి..
 విశాఖ సీతమ్మధారలో ‘ఈనాడు’ కార్యాలయం ఉన్న స్థల వాస్తవ యజమాని మంతెన ఆదిత్య కుమారవర్మ. 2.78 ఎకరాల ఆ స్థలాన్ని, 40 వేల చదరపు అడుగులు కలిగిన10 పెద్ద భవనాలను 1974-ఏప్రిల్‌లో రామోజీరావు 33 ఏళ్ల కాల  పరిమితికి వర్మ నుంచి లీజుకు తీసుకున్నారు. లీజు 2007తో పూర్తయింది. తర్వాత లీజు గడువు పొడిగించాలని వర్మను రామోజీరావు కోరారు. వెంటనే ఖాళీ చేసి తన స్థలాన్ని, భవనాల్ని అప్పగించాలని వర్మ కోరారు. దీనిపై రామోజీరావు సివిల్ కోర్టును ఆశ్రయించారు. కేసు పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో 1985లో సీతమ్మధారలో రోడ్లను వెడల్పు చేశారు. వర్మకు చెందిన కొంత స్థలం విస్తరణలో పోయింది. అందుకు పరిహారంగా ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించింది. తాను స్థలం యజమానినని అంటూ రామోజీరావు తప్పుడు పత్రాల్ని సమర్పించి వర్మకు రావాల్సిన భూమిని తీసేసుకున్నారు.
 
 యజమాని అనుమతి లేని కట్టడాలు కూల్చేయాల్సిందే..
 ఈ వివాదంపై నగరంలోని వివిధ న్యాయస్థానాల్లో సివిల్, క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అద్దె చట్టం ప్రకారం ఏదైనా నిర్మాణం చేపట్టాలన్నా, లేదా స్థలంలో ఉన్న కట్టడాల్ని మార్పు చేయాల్సి వచ్చినా స్థల యజమాని అనుమతి తప్పనిసరి. రామోజీరావు మాత్రం  తానే యజమానిగా వ్యవహరించారు. స్థల యజమాని వర్మకు సమాచారం ఇవ్వకుండా అనుమతి పొందకుండా పలు శాశ్వత కట్టడాల్ని నిర్మించారు. వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలతో వర్మ జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. వివరాల్ని పరిశీలించిన అధికారులు ‘ఈనాడు’ కార్యాలయంలో అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తిం చారు. స్థల యజమాని అనుమతి లేకుండా నిర్మించిన అన్ని కట్టడాలను 15 రోజుల్లో కూల్చివేయాలని నోటీసులు జారీ చేశారు.
 

మరిన్ని వార్తలు