ఉలిక్కిపడ్డ బుక్కరాయసముద్రం

31 May, 2016 02:49 IST|Sakshi
ఉలిక్కిపడ్డ బుక్కరాయసముద్రం

దారుణం
వివాదంలో ఉన్న భూమి దున్నేందుకు ప్రయత్నం
అభ్యంతరం తెలిపిన చిన్నాన్నను వేటకొడవలితో నరికి చంపిన వైనం
ఆపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు


ఆస్తి.. బంధాలు, బంధుత్వాలను విడదీస్తుంది. విధ్వేషాలను పెంచుతుంది. కక్షలకు ఆజ్యం పోస్తుంది. అవసరమైతే ప్రాణాలు తీస్తుంది. ఈ విషయం మరోసారి రుజువైంది. చిన్నాన్ననే వేటకొడవలితో నరికి చంపి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు వరుసకు కొడుకయ్యే ఓ వ్యక్తి. ఈ సంఘటనతో ఊరు ఉలిక్కిపడింది. రెండు కుటుంబాల మధ్య తలెత్తిన కక్షలకు ఓ నిండు ప్రాణం బలైపోవడం సంచలనం సృష్టించింది.    - బుక్కరాయసముద్రం
 
బుక్కరాయసముద్రానికి చెందిన బసన్న(65)ను అతని అన్న కుమారుడైన వెంకటేశ్ విచక్షణారహితంగా వేటకొడవలితో చంపడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దేవరకొండ గ్రామ సర్వే నంబర్ 376లో ఎనిమిదెకరాల పొలం ఉండగా, పై రెండు కుటుంబాల మధ్య మూడేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. ఈ విషయంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.


 పొలాన్ని చూసేందుకు వెళ్లగా...
 సోమవారం ఉదయమే బసన్న తన మనవుడు వాసుతో కలసి బైక్‌లో పొలం చూసేందుకు వెళ్లారు. అప్పటికే అక్కడ వెంకటేశ్ తన భార్య ఎర్రమ్మతో కలసి ట్రాక్టర్‌తో దున్నుతుండడాన్ని గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి ప్రశ్నించారు. వివాదంలో ఉండగానే పొలాన్ని ఎలా దున్నుతావంటూ నిలదీశారు. ఈ విషయంగా మారి మధ్య మాటామాటా పెరిగింది.  


 రేయ్.. నువ్విక్కడి నుంచి వెళ్లిపో...
 బసన్న మనవడు వాసుని ‘రేయ్ నువ్విక్కడి నుంచి వెళ్లిపో.. అంటూ వెంకటేశ్ గట్టిగా అరిచాడు. ఆ తరువాత తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో బసన్నపై విచక్షణారహితంగా దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత భార్య ఎర్రమ్మను ఇంటికి పంపేసి, నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు వెంకటేశ్.

 
 బోరుమన్న కుటుంబ సభ్యులు
విషయం తెలిసిన వెంటనే బసన్న కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల వారు భారీగా పొలం వద్దకు చేరుకున్నారు. పొలంలోనే రక్తపు మడుగులో పడి ఉన్న బసన్నను చూసి అతని గుండెలపై పడి కుటుంబ సభ్యులు రోదించారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

 రంగంలోకి పోలీసులు
ఇన్‌చార్జ్ ఎస్‌ఐ శివ, ఏఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, భాస్కర్, సిబ్బంది నేర స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు