కూరగాయల ధరల నియంత్రణకు కృషి

5 Jul, 2014 02:36 IST|Sakshi

విజయవాడ రూరల్ :  జిల్లాలోని రైతుబజార్లలో కూరగాయల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ రైతుబజార్స్ ఎంకే సింగ్ అధికారులను ఆదేశించారు.  గొల్లపూడి మార్కెట్‌యార్డులో జిల్లాలోని 17 రైతుబజార్ల ఏస్టేట్ అధికారులు ఆర్‌డీడీ ,డీఈ, ఏఈలు హార్టికల్చర్ ఏఈలతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సింగ్  మాట్లాడుతూ  ప్రస్తుతం వర్షాలు లేని కారణంగా కూరగాయల ఉత్పత్తి తక్కువగా వుందని వాటి ధరలు అదుపు చేసి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఉల్లిపాయల ధరలు ఎక్కువగా వున్నందున వాటిని వీలయినంత తక్కువ ధరకు రైతు బజార్లలో విక్రయించాలన్నారు. అన్ని రైతుబజార్లలో కంప్యూటర్స్, మైక్, తాగునీటి వసతులు కల్పించాలని చెప్పారు.

అసంపూర్తిగాఉన్న నిర్మాణాలను పూర్తి చేసి విద్యుద్దీకరణ చేయిం చాల్సిందిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ఆదేశించారు. ఈ పనులకు ఆయా బజార్ల పరిధిలోని మార్కెట్ కమిటీల నిధుల నుంచి కేటాయించాలన్నారు.   హార్టికల్చర్ సహాయ సంచాలకులు రైతులకు ఇస్తున్న సబ్సిడీ విత్తనాల గురించి తెలియజేయానికి రైతుబజార్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచిం చారు.  డిమాండ్‌కు సరిపడా కూరగాయలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు.

గ్రామాల్లో రైతులను సంఘాలుగా ఏర్పాటుచేసి వాటిద్వారా కూరగాయలు రైతు బజారుకు సరఫరా చేయడానికి క్లస్టర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ డెప్యూటీ డెరైక్టర్  దివాకర్, డీఈ  ప్రసాద్, ఎస్టేట్ ఆఫీసర్లు  పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు