మింగుడుపడని గుడ్డు

23 Dec, 2013 01:42 IST|Sakshi

సాక్షి , అనంతపురం : అనంతపురానికి చెందిన పద్మావతి బుధవారం ఉదయం మార్కెట్‌కు వెళ్లింది. గుడ్డు ఎంత అని అడిగింది. ఒక్కొక్కటి రూ.4.50 అని దుకాణదారుడు చెప్పడంతో విస్తుపోవడం ఆమె వంతైంది. అంత ధరా అని ఆమె ప్రశ్నించగా, మరింత పెరుగుతాయమ్మా అంటూ దుకాణదారుడు సమాధానమిచ్చాడు. విధిలేక డజను కొనాలనుకున్న ఆమె అర డజను గుడ్లను కొనుగోలు చేసింది.

 ప్రస్తుతం జిల్లాలో కోడిగుడ్ల ధర పైపైకి ఎగబాకుతోంది. పౌల్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో ధర పెరుగుతోంది. అయినప్పటికీ గుడ్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గడంలేదు. సాధారణంగా కార్తీక మాసంలో కోడిగుడ్ల ధర గణనీయంగా తగ్గుతుంది. ఈసారి ఆ పరిస్థితి కన్పించలేదు. కార్తీక మాసంలోనే ఒక్కో గుడ్డు రూ.4 పలికింది. ఇపుడు కార్తీక మాసం ముగియడంతో ప్రస్తుతం హోల్‌సేల్ ధర రూ.4 ఉండగా, చిల్లర మార్కెట్‌లో రూ.4.50 నుంచి రూ.5 వరకు విక్రయిస్తున్నారు. గత ఫిబ్రవరిలోనూ గుడ్ల ధర అనూహ్యంగా పెరిగింది. అప్పుడు రూ.3.50 వద్ద నిలిచి రికార్డు సృష్టించింది. వైరస్ ప్రభావం, విపరీతమైన ఎండల కారణంగా ఈ ఏడాది కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాతపడ్డాయి. గిట్టుబాటు ధర కూడా లేక గతంతో పోల్చితే 40 శాతం కోళ్లను పౌల్ట్రీ యజమానులు వదిలించుకున్నారు. వారం క్రితం వరకు కిలో చికెన్ రూ.60-70 పలికింది. దాదాపు రెండు నెలలు ఇదే ధరతో అమ్మారు.
 
 జిల్లాలో పౌల్ట్రీఫాంలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఉన్న వాటిలోనూ చాలావరకు గత వేసవిలో నష్టాల కారణంగా మూతపడ్డాయి. కర్ణాటక ప్రాంతం జిల్లా సరిహద్దుగా ఉండడంతో అక్కడి నుంచే ఎక్కువగా కోళ్లు, గుడ్లు దిగుమతి చేసుకుంటున్నారు. కర్ణాటకలోని హొస్పేట, చెళ్లికెర, బళ్లారి ప్రాంతాల్లో దాదాపు 65 లక్షల కోళ్లు పెరుగుతున్నాయి. వీటి ద్వారా నిత్యం 50 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ఒక్క అనంతపురం జిల్లాకే రోజూ ఐదు లక్షల గుడ్లు దిగుమతి అవుతున్నాయి.
 
 ఏడాది కాలంలో పలు పౌల్ట్రీ ఫాంలు మూతబడడం, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోందని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో నూరు శాతం కోళ్లు గుడ్లు పెడుతుండగా... ప్రస్తుతం 75 శాతం మాత్రమే పెడుతున్నాయి. దీనికితోడు ప్రస్తుతం కూరగాయల ధరలు కూడా అధికంగా ఉన్నాయి. వాటి జోలికి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు.
 
 హిందూపురం, గుంతకల్లు, అనంతపురం తదితర పట్టణాల్లో గదులు అద్దెకు తీసుకుని చదువుకుంటున్న విద్యార్థులు సైతం కూరగాయలు కొనలేక తరగతుల నుంచి వచ్చిన వెంటనే రెండో, మూడో గుడ్లతో కూర వండుకుని ఆరగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోనూ గుడ్ల వినియోగం పెరిగింది. దీంతో వాటి ధర పైపైకి పోతోంది. ఇదే ధర మరో రెండు నెలలు కొనసాగితే కోళ్లఫారాల యజమానులు నష్టాల నుంచి గట్టేక్కే అవకాశముంది.  
 

మరిన్ని వార్తలు