ఉరి.. ఆఖరిలో క్షమాభిక్షతో సరి..

20 Mar, 2020 12:24 IST|Sakshi
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఆఖరి సారిగా ఉరి శిక్ష అమలు చేసిన వ్యక్తి నంబి కృష్టప్ప పేరుతో ఏర్పాటు చేసిన బోర్డు

ఉభయ రాష్ట్రాల్లో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులోనే ఉరి కంబం

రాష్ట్రంలో 44 ఏళ్లుగా అమలు కాని ఉరి శిక్షలు

1976లో ఆఖరి సారిగా ఇక్కడే ఉరి అమలు   

కోర్టులు ఉరి శిక్షలు విధించినా.. ఆఖరి నిమిషంలో క్షమాభిక్ష ప్రసాదించిన ఘటనలు అనేకం

ఉరి శిక్ష అమలైన ఖైదీలు.. ఆఖరి నిమిషంలో యావజ్జీవ కారాగార ఖైదీలుగా మారుతున్నారు. చట్టంలోని లోటుపాట్లతో ఉరి నుంచి తప్పించుకుని జీవితాంతం జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. తీహార్‌ జైల్లో నిర్భయనిందితులకు ఉరిశిక్ష అమలు చేస్తున్న వేళ జిల్లాలోని రాజమహేంద్రవరంసెంట్రల్‌ జైలులో ఉరిశిక్ష అమలు, తదితర ఘటనలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: నిర్భయ కేసులో నలుగురు నిందితులను ఒకేసారి ఉరి శిక్షను అమలు చేసేలా కోర్టు తీర్పు ఇవ్వడం, నిందితులకు ఉరి శిక్ష అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండడంతో ఉరి శిక్షలు అమలుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఢిల్లీలోని నిర్భయ లైంగికదాడి కేసులో నిందితులైన ముకేశ్‌ సింగ్, అక్షయ్‌ ఠాగూర్, పవన్‌ గుప్తా, వినయ్‌శర్మలకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్‌ కేంద్ర కారాగారంలో ఉరి శిక్ష అమలు చేయనున్నారు. దీని అమలు, తీరుతెన్నులపై ఒక్కసారి అవలోకనం చేసుకుంటే దేశంలో ఎక్కువగా కఠిన శిక్షలు అమలు చేసిన దాఖలాలు లేవు. నేరస్తులను కస్టడీ అండ్‌ కేర్‌ కరక్షన్‌(అదుపులోకి తీసుకొని సంరక్షించి నేరాలు వైపు మరలకుండా సంస్కరించాలని) జైలు మాన్యువల్‌ చెబుతోంది.

మహిళలపై జరిగిన లైంగికదాడులు
2005లో ఢిల్లీలో లక్ష్మి అగర్వాల్‌పై యాసిడ్‌ దాడి జరిగింది. దేశంలోనే సంచలనం కలిగించిన కేసు 2012లో డిసెంబర్‌ 16న ఢిల్లీలో నిర్భయపై నలుగురు నిందితులు రేప్‌ చేసి హత్య చేశారు.  
2007లో విజయవాడలో ఆయేషా మీరాపై లైంగికదాడి, హత్య.
2018 జనవరి 17న జమ్ము కశ్మీర్‌లో ఆసిఫా అనే బాలికపై లైంగికదాడి. అలాగే గుంటూరులో హరిత అనే మహిళపై లైంగికదాడి. 2019 గుంటూరులో మైనర్‌ బాలికపై రేప్‌ జరిగాయి.  
2019 తెలంగాణలో లక్ష్మి అనే మహిళపై లైంగికదాడి అనంతరం హత్య చేశారు.  
2019 నవంబర్‌ 27న హైదరాబాద్‌లో ప్రియాంక రెడ్డిపై లైంగికదాడికి పాల్పడి అనంతరం పెట్రోల్‌ పోసి కాల్చి చంపారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలపై లైంగికదాడులు, హత్యలు ఎక్కువగానే జరుగుతున్నాయి. కొన్ని వెలుగులోకి వస్తుంటే.. మరికొన్ని మాత్రం బయటపడడం లేదు. నేరం చేసిన నిందితులు దర్జాగా సమాజంలో తిరుగుతున్నారు. మహిళలపై లైంగికదాడులు, హత్యలు, వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. 

మహిళలపై లైంగికదాడులకు పాల్పడడమే కాదు వారిని హత్య చేసిన నిందితులకు పలుచోట్ల ఉరిశిక్షలు విధించినా.. వాటిని అమలు మాత్రం అంతంతమాత్రంగానే జరుగుతోంది. తొలుత ఉరిశిక్ష అని తీర్పు చెప్పినా.. రోజులు గడిచే కొద్దీ మానవతా దృక్పథంతో ఆఖరి నిమిషంలో జీవిత ఖైదీలుగా శిక్షలు మార్చుతూ ప్రభుత్వాలు ఖైదీల పట్ల దయతో వ్యవహరించేవి. దీంతో ప్రస్తుతం మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక్కడికే తరలించేవారు..
ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఏడు సెంట్రల్‌ జైళ్లు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరు, తెలంగాణలోని వరంగల్, చర్లపల్లి, చంచల్‌గూడలలో ఉన్నాయి. అయితే రాజమహేంద్రవరంలో మాత్రమే ఉరి శిక్ష అమలు చేసేందుకు ఉరి కంబం ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్‌ వారి కాలం నుంచి ఉన్నా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో నూతనంగా భవనాలు నిర్మించారు. వీటితో పాటు ఆధునికమైన ఉరి కంబంను కూడా నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉరి శిక్షలు అమలు చేయాలంటే ఖైదీలను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకుతరలించాల్సిందే.  ఉరిశిక్ష పడి జీవిత ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్న ఎనిమిది మంది ఖైదీలురాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో వివిధ కేసుల్లో ఉరి శిక్షలు పడిన ఖైదీలు, వాటిని హై కోర్టులు క్షమాభిక్షలుగా మార్చడంతో ఎనిమిది మంది ఖైదీలు యావజ్జీవ కారాగార శిక్షలుఅనుభవిస్తున్నారు.   

1976లో ఆఖరి సారిగా ఉరి శిక్ష అమలు 
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఆఖరి సారిగా 1976లో నంబి కృష్టప్ప అనే ఖైదీని ఉరి వేశారు. భార్య, పిల్లలు హత్య కేసులో నిందితుడైన ఈ ఖైదీని ఉరి తీశారు. ఇతడి ఆఖరి కోరిక లడ్డును తినాలని ఉందని కోరాడు. ఇతడి కోరికను జైలు అధికారులు తీర్చి అనంతరం ఉరి తీశారు. ఈ సెంట్రల్‌ జైలులో ఆదే ఆఖరి ఉరి. అప్పటి నుంచి దాదాపు 44 సంవత్సరాలు ఈ జైలులో ఉరి శిక్షను అమలు చేయలేదు. 1993 మార్చి 8న జరిగిన చిలకలూరి పేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతికి కారకులైన కేసులో నిందితులు గుంటూరుకు చెందిన గంటేల విజయవర్ధనరావు, చలపతిరావులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. ఆఖరి నిమిషంలో 1997 ఏప్రిల్‌లో అప్పటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణ్‌ క్షమాభిక్ష ప్రసాదించారు.

1997లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా భారత దేశ పర్యటనకు వచ్చిన సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ రచయిత్రి మహాశ్వేతా దేవి ఉరి శిక్ష పడిన ఖైదీల గురించి నెల్సన్‌ మండేలా దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లి క్షమా భిక్ష ప్రసాదించాలని కోరడంతో మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణ క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులతో అప్పటి ఆర్టీఓ శ్రీధర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆఖరి నిమిషంలో జైలు అధికారులకు రాష్ట్రపతి ఉత్తర్వులు అందజేసి ఉరి శిక్ష పడిన ఖైదీలు విజయవర్ధనరావు, చలపతిరావులకు ఉరి శిక్ష అమలు కాకుండా నిలిపివేశారు. ప్రస్తుతం విజయవర్ధనరావు గుంటూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తుండగా చలపతిరావు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

మరిన్ని వార్తలు