పాపం.. పసిప్రాణం

18 Jul, 2020 12:24 IST|Sakshi
జోత్స్నతో తల్లిదండ్రులు సత్యనాగరాజు, మునెమ్మ

కాలేయం చెడిపోయి మృత్యువుకు చేరువవుతున్న దైన్యం

దాతల సాయం కోసం చిన్నారి తల్లిదండ్రుల అభ్యర్థన

ఎనిమిదేళ్ల చిన్నారి కాలేయ వ్యాధితో మంచానికే పరిమితమైంది. కాలేయ మార్పిడి చేస్తేనే బిడ్డ బతుకుతుందని వైద్యులు తేల్చిచెప్పారు. తమకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పసిప్రాణం అల్లాడుతోంది. ప్రాణాంతకమైన కాలేయ వ్యాధితో ఆ బిడ్డ మంచానికే పరిమితమైంది. 15 రోజుల్లో కాలేయ మార్పిడి చేస్తేనే బిడ్డ బతుకుతుందని వైద్యులు తేల్చిచెప్పడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. చికిత్సకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని అర్థిస్తున్నారు.

తిరుపతి తుడా : స్థానిక గోవిందనగర్‌ (రెండుమద్దిమాన్లు)లో కాపురం ఉంటున్న కె.మునెమ్మ, కె.సత్యనాగరాజు దంపతులకు కె. జోత్స్న(8) ఏకైక కుమార్తె. తిరుమల కౌస్తుభం గెస్ట్‌ హౌస్‌లో రూ.7వేల వేతనంతో లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ సత్యనాగరాజు కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జోత్స్న అనారోగ్యం బారిన పడడంతో ఆస్పత్రిలో చూపించారు. కామెర్లు అని తేల్చి వైద్యులు చికిత్స చేశారు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. రుయా వైద్యుల సూచన మేరకు చెన్నైలోని ఎగ్‌మోర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల పాటు చేసిన చికిత్సతో కొంతవరకు జోత్స్న కోలుకోవడంతో తిరిగి వచ్చారు. అయితే ఇది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది.

మళ్లీ సమస్య తిరగబెట్టడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో లివర్‌ ఫెయిల్యూర్‌ అని ధ్రువీకరించారు. హుటాహుటిన చెన్నైలోని గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన వైద్యపరీక్షల్లో 15రోజుల్లోపు కాలేయ మార్పిడి చేస్తేనే బిడ్డ బతుకుతుందని తేల్చి చెప్పడంతో హతాశులయ్యారు. తన కుమార్తెను బతికించేకునేందుకు కాలేయదానం చేయడానికి సత్య నాగరాజు ముందుకొచ్చాడు. అయితే మార్పిడికి మాత్రమే రూ. 19.50 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో దిక్కు తోచలేదు. తమకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. మరోవైపు జోత్స్న ఉదర భాగం రోజు రోజుకూ ఉబ్బిపోతుండంతో దిక్కుతోచని స్థితిలో సాక్షికి తమ గోడు నివేదించారు.

దాతలు ఎవరైనా సాయం చేయదలిస్తే...బాధితురాలి తండ్రి బ్యాంకు ఖాతా వివరాలు: కె. సత్యనాగరాజు, ఎస్‌బీఐ అకౌంట్‌ నంబర్‌ 20219069477, ఐఎఫ్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌ 000610, ఎస్‌బీఐ టీటీడీ ఏడీ బిల్డింగ్‌ బ్రాంచ్‌. 

మరిన్ని వార్తలు