ఏకలవ్య.. వసతులేవయ్యా..!

20 Dec, 2018 10:48 IST|Sakshi
ఏకలవ్య పాఠశాల కోసం గిరిజన ఆశ్రమ పాఠశాలలో తీసుకున్న కొన్ని గదులు

కేంద్రం నిధులు వెనక్కి వెళ్లకుండా హడావుడిగా ప్రారంభం

ఏడాది గడుస్తున్నా బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు లేదు

విద్యార్థులకు మౌలిక వసతులు కరువు

సీబీఎస్‌ఈ సిలబస్‌తో కొత్త చిక్కులు

నేటికీ అందని పాఠ్యపుస్తకాలు

పార్వతీపురం: ఏకలవ్య పాఠశాలలంటే ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉండేవి. ఇందులో సీటు కావాలంటే ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి సిఫార్సులు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు ఈ పాఠశాలల పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. 2017లో కేంద్రప్రభుత్వం ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకోసం ఒక్కోదానికి రూ.12 కోట్ల చొప్పున రాష్ట్రంలో పది పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. ఆ నిధులు వెనక్కి వెళ్లకుండా ఉండేందుకు అన్ని జిల్లాల్లోనూ తాత్కాలిక భవనాల్లో హడావుడిగా వీటిని ప్రారంభించారు. అప్పట్లో ఆరో తరగతి ప్రవేశానికి విద్యార్థులు లేకపోవడంతో గురుకులాల నుంచి కొందరిని, గిరిజన ఆశ్రమ పాఠశాలల నుంచి కొందరిని తెచ్చి వీటిలో ప్రవేశాలు కల్పించారు.

ఉద్యోగుల క్వార్టర్లలో తరగతులు
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో కురుపాంనకు ఒక ఏకలవ్య పాఠశాల మంజూరైంది. దీనిని 2017లో కురుపాంలో ప్రారంభించాల్సి ఉండగా.. భవనాలు అందుబాటులో లేక పార్వతీపురం చాకలి బెలగాంలో అప్పట్లో నడుస్తున్న కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో కొన్ని గదులను తీసుకుని హడావుడిగా ప్రారంభించారు. ఈ ఏడాది గురుకుల పాఠశాలను కురుపాంనకు తరలించడంతో ఖాళీ అయిన ఈ భవనానికి పార్వతీపురం బైపాస్‌ రోడ్డులో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను తరలించారు. ఒక వైపు బాలుర పాఠశాల నడుస్తుండటం.. అదే ప్రాంగణంలో మరో పక్క బాలికల ఏకలవ్య పాఠశాలను కొనసాగిస్తుండటంతో ఇబ్బందులొచ్చే అవకాశం ఉందని భావించిన అధికారులు.. బాలికల ఏకలవ్య పాఠశాలను ఐటీడీఏ ఉద్యోగుల కోసం నిర్మించిన నివాసగృహాల(క్వార్టర్సు)లోకి తరలించారు. అక్కడ రెండు గదుల్లో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. విశాలమైన గదుల్లేకపోవడంతో పిల్లలు వంటగదుల్లో సైతం కూర్చోవాల్సి వస్తోంది.

మౌలిక సదుపాయాల కరువు
ఏకలవ్య పాఠశాలలు కొత్తగా మంజూరయితే.. వాటికి అవసరమైన అ«ధ్యాపకులతో పాటు విద్యార్థులకు బెంచీలు, ఉపాధ్యాయులకు కుర్చీలు మొదలుకుని.. రికార్డుల నిర్వహణకు బీరువాలు, బోర్టులు, టేబుళ్లు వంటి మౌలికవసతులు మంజూరు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకూ ఒక్క కుర్చీ కూడా మంజూరు కాలేదు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు బలవంతంగా తెచ్చి ఇక్కడ పనిచేయిస్తున్నా.. ఎలాంటి సౌకర్యాలూ కల్పించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఏఎన్‌ఎంను కూడా నియమించలేదు.

పుస్తకాలెక్కడ?
విద్యాసంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. పార్వతీపురం ఏకలవ్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు 80 మంది వరకూ ఉండగా వారికి నేటికీ తెలుగు, సోషల్‌ సబ్జెక్టుల పుస్తకాలు అందలేదని చెబుతున్నారు. ఈ పాఠశాలల్లో ఇదివరకు స్టేట్‌ సిలబస్‌నే బోధించేవారు. ప్రస్తుతం సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధించాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందుకోసం ఇంగ్లిష్‌లో బోధించగల అధ్యాపకులను కేటాయించాలి. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. ఇక్కడున్న ఉపాధ్యాయులనే సర్దుబాటు చేస్తున్నారు.

 బెంచీలు, కుర్చీలు కూడా లేవు
పాఠశాలల్లో ఇంతవరకు మౌలిక వసతులు కల్పించలేదు. ఉపాధ్యాయులు కూర్చునేందుకు కుర్చీలు, విద్యార్థులకు బెంచీల్లేవు. శాశ్వత భవనాలు కూడా లేవు. ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పిస్తే మంచి విద్యనందించగలం. ప్రస్తుతం ఇక్కడ వ్యాయామ, సోషల్‌ ఉపాధ్యాయులు, ఆఫీస్‌ సబార్డినేట్, కుక్, వాచ్‌మేన్‌ వంటి సిబ్బందిని నియమించాలి.
–హేమలత, ప్రిన్సిపల్, ఏకలవ్య పాఠశాల, పార్వతీపురం

ఒత్తిడికి గురవుతున్నాం
మాకు ఏడో తరగతికి సంబంధించి తెలుగు, సోషల్‌ సబ్టెక్టుల పాఠ్యపుస్తకాలు ఇంకా ఇవ్వలేదు. ఒక్కసారిగా సీబీఎస్‌ఈ సిలబస్‌కు మార్చడంతో ఒత్తిడికి గురవుతున్నాం. పాఠశాల ఒక చోట, వసతి మరో చోట ఉండటంతో రోజూ తిరగడం ఇబ్బందిగా ఉంది.
– బిడ్డిక అలేఖ్య, విద్యార్థిని, 7వ తరగతి

న్యాయపరమైన సమస్యల వల్లే ఇబ్బంది
ఈ పాఠశాల భవనాల నిర్మాణానికి టెండర్లు పిలవగా కొంతమంది కాంట్రాక్టర్లు తమకు అన్యాయం జరిగిందంటూ సుప్రీంకోర్టునాశ్రయించారు. దీంతో ఎక్కడా భవన నిర్మాణాలు ప్రారంభంకాలేదు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వెనక్కి వెళ్లరాదన్న ఉద్దేశంతో తాత్కాలిక భవనాల్లో తరగతులను ప్రారంభించాల్సి వచ్చింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం. బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపుతో పాటు.. మౌలిక వసతులను మంజూరు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.
– డాక్టర్‌ జి.లక్ష్మిశ, ఐటీడీఏ పీవో, పార్వతీపురం

మరిన్ని వార్తలు