ఈకేవైసీ మరింత ఈజీ...

17 Aug, 2019 11:30 IST|Sakshi

డీలర్ల వద్ద నమోదుకు అధికారుల ఆదేశం 

మరో నాలుగు రోజులే ఈ అవకాశం

జిల్లాలో ఇంకా నమోదు చేసుకోనివారు లక్షమంది

ఈకేవైసీ చేయించుకోకుంటే రేషన్‌ నష్టపోవాల్సిందే...

ప్రభుత్వం అందించే రేషన్‌ పారదర్శకంగా అందాలంటే... సరకులు పక్కదారి పట్టకుండా ఉండాలంటే... ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరగాలంటే... ఈకేవైసీ (ఎలక్ట్రానిక్‌ నో యువర్‌ కస్టమర్‌) తప్పనిసరి. వచ్చే నెల నుంచి రేషన్‌ పంపిణీలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నందున వాటిని నమోదు చేసుకోవడం అనివార్యమైంది. దీనికోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రేషన్‌దుకాణాల్లో మరో నాలుగురోజులపాటు నమోదు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు.

విజయనగరం గంటస్తంభం: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రాయితీపై సరుకులు సరఫరా చేసున్న విషయం తెలిసిందే. లబ్ధిదారులు రేషన్‌డిపోలో బయోమెట్రిక్‌ వేసి సరుకులు తీసుకుంటున్నా రు. ఇకపై ఇంటింటికి సరుకులు సరఫరా చేయాలని... అంతేగాకుండా నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో సరుకులు అత్యంత పారదర్శకంగా పేదల కు సరఫరా చేసేందుకు ప్రతి లబ్ధి దారుడి వేలిముద్రలను ఈకేవైసీ ద్వా రా సేకరిస్తున్నారు. గతంలో ప్రజా సాధికార సర్వే సమయంలో ఈకేవైసీ చేశారు. కానీ అప్పట్లో కుటుంబంలో అందరూ వేలిముద్రలు నమోదు చేయించుకోలేదు. ఇప్పుడు వారందరూ నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామం, పురపాలక వార్డులో రేషన్‌డిపోల్లో ఈకేవైసీ కార్యక్రమం చేపట్టారు. డీలర్‌ వద్ద ఉన్న ఈపాస్‌ యంత్రంలో నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయినా లబ్ధిదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. జిల్లాలో ఒకటో తేదీ నాటికి 1,65,880మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉండగా.. ఇంకా సుమారు లక్షమంది అవకాశాన్ని వినియోగించుకోలేదు.

డీలర్ల వద్ద నమోదుకు అవకాశం..
వాస్తవానికి డీలర్ల వద్ద 16వ తేదీ నుంచి ఈకేవైసీ నమోదు చేయించుకునే వీలుండదు. వారు రేషన్‌ సరుకులు ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే ఇస్తారు. 16వ తేదీన ఈపాస్‌ యంత్రాన్ని అధికారులు క్లోజ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈకేవైసీ ముఖ్యమని «భావించిన అధికారులు రేషన్‌ డీలర్ల వద్ద ఈపాస్‌ యంత్రాల్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పటికైనా లబ్ధిదారులు సద్వినియోగించుకోవాలనీ.. లేకుంటే సెప్టెంబరు నెలలో సరఫరా చేసే రేషన్‌ నిలుపుదల చేసే అవకాశం ఉందనీ అధికారులు చెబుతున్నారు. 

నాలుగైదు రోజులు పని చేస్తాయి..
రేషన్‌డీలర్లు ఈపాస్‌ యంత్రాల్లో ఈకేవైసీ నమోదుకు వీలుగా అవకాశం కల్పిం చాం. దానిని లబ్ధిదారులు సద్వినియోగించుకోవాలి. ఈ అవకాశం నాలుగైదు రోజులు మాత్రమే ఉంటుంది. లబ్ధిదారులు వెంటనే స్పందించాలి. 
 – ఎ.పాపారావు, డీఎస్వో, విజయనగరం 

మరిన్ని వార్తలు