పసిమొగ్గలపై పైశాచికం

4 Jan, 2015 01:11 IST|Sakshi

 అమలాపురం టౌన్ : నలుగురు బాలికలపై పైశాచికంగా ప్రవర్తించిన వృద్ధ కామాంధుడి ఉదంతంతో అమలాపురం వాసులు నివ్వెరపోయారు. ఆరునెలలుగా చిన్నారులపై అకృత్యం చేస్తూ కామవాంఛ తీర్చుకుంటున్న ఆ వృద్ధ మృగాడిపై బాధిత తల్లిదండ్రులతోపాటు, స్థానికులు ఆగ్రహంతో దాడిచేశారు. దేహశుద్ధి చేశారు.  దీంతో భయపడిన వృద్ధుడు పరారయ్యాడు. అమలాపురం నారాయణపేటకు చెందిన సూర్యనారాయణ(60) గతంలో ఉపాధి కోసం కువైట్ వెళ్లి కాస్త ఆస్తి కూడబెట్టాడు. ప్రస్తుతం టైలరింగ్ చేసుకుంటూ ఒంటరిగా నారాయణపేటలో ఉంటున్నాడు. ఇతనిని స్థానికులు కొయటా టైలర్, లేదా కొయటా సూర్యనారాయణ అని పిలుస్తారు. ఆ పేటలోని నలుగురు బాలికలు ఇతని వద్దకు తాతా అంటూ వచ్చేవారు. వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మాయమాటలతో లోబరుచకున్నాడు. వారిపై ఆరునెలలుగా లైంగిక దాడిచేశాడు. విషయం బయటకు చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు.
 
 చివరికి బాలికలు మధ్యాహ్నం పూటలు బడికి రాకపోవడాన్ని గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు శనివారం ఓ బాలిక అస్వస్థతతో ఉండడంతో ఆరా తీయగా  విషయం బయటపడింది. ఈ విషయంపై తల్లిదండ్రులు, పోలీసులు ఆరా తీస్తున్నప్పుడు ఆ చిన్నారులు ‘కొయటా తాత రమ్మంటే వెళ్లాం’ అంటూ అమాయకంగా చెప్పడం అందరినీ కలచివేసింది.  సూర్యనారాయణ కుటుంబ నేపథ్యం... అతని స్వభావం మొదటి నుంచి సరిగా ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు.  అతనికి శాడిస్టు లక్షణాలు ఉన్నాయని, అతని తీరు నచ్చక భార్య, పిల్లలు విడిచి వెళ్లి వేరే ఉంటున్నారని విచారణలో తేలింది.   బాలికల కుటుంబ పరిస్థితులను కూడా వృద్ధకామాంధుడు తనకు అనువుగా మలుచుకున్నాడని తెలుస్తోంది. బాలికల తల్లిదండ్రులు పేదలు కావడం... రోజూ ఉదయాన్నే పనులకు వెళ్లిపోయి రాత్రికి గానీ ఇంటికి రాకపోవడాన్ని గమనించిన కామాంధుడు బాలికలు ఒంటిగా ఉండేటప్పుడు, బడికి వెళ్లి వచ్చే విరామ సమయాల్లో, మధ్యాహ్న పూటలు తనవద్దకు వచ్చేలా చేసుకున్నాడు.  
 
 పెద్దల రాజీ యత్నాలు
 బాధితులు పేదలు కావడంతో రాజీ పేరుతో  కొంత నగదు పరిహారం ఇచ్చి గొడవను చల్లార్చేందుకు కామాంధుడు తరఫున కొందరు పెద్దలు యత్నించారు. రాజకీయ పైరవీలతో కేసు లేకుండా ఒత్తిడి చేయిం చారు. చిన్నారుల తల్లిదండ్రులనూ ఎందుకొచ్చిన కేసులు.. కోర్టుల చుట్టూ తిరగాలి. పిల్లల భవిష్యత్తు పోతుంది.. డబ్బులిస్తాం.. అటూ బెదిరించే యత్నంచేశారు. చివరకు ఐద్వా, పౌర హక్కుల సంఘం ప్రతినిధులు విషయం తెలుసుకుని జోక్యం చేసుకోవడంతో రాజకీయ, రాజీ యత్నాలకు బ్రేకు పడింది. ఈ ఘటనపై అమలాపురం మండల విద్యాశాఖాధికారి ఆర్.వి.ఎస్.రామచంద్రరావు పాఠశాల ఉపాధ్యాయులు, బాలికల తల్లిదండ్రులను శనివారం విచారించారు. విషయాన్ని డీఈఓ నరసింహరావు దృష్టికి తీసుకువెళ్లారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎంఈఓ పోలీసులను కోరారు. వైద్యపరీక్షల నిమిత్తం నలుగురు బాధిత బాలికలను అమలాపురం ఏరియా ఆస్పత్రికి వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు.
 

>
మరిన్ని వార్తలు