అయ్యా.. మీరైనా కనికరించండి

20 Jul, 2018 07:52 IST|Sakshi
మంత్రి అమరనాథరెడ్డి వద్ద కంటతడి పెడుతున్న ఎస్టీవీనగర్‌కు చెందిన వృద్ధురాలు అంబిక

రోడ్డు ప్రమాదంలో నా భర్తకు రెండు కాళ్లూ పోయాయి

పింఛను ఇవ్వకుంటూ నాలుగేళ్లుగా తిప్పుకుంటున్నారు

నగరదర్శినిలో మంత్రి అమరనాథరెడ్డికి ఓ వృద్ధురాలి ఆవేదన

తిరుపతి తుడా: ‘‘అయ్యా మీరైనా కనికరించండి.. రోడ్డు ప్రమాదంలో నా భర్తకు రెండు కాళ్లూ పోయా యి.. నడవలేని స్థితిలోనూ నాలుగేళ్లుగా కాళ్లరిగేలా అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను.. ఇప్పటి వరకు పింఛను ఇవ్వలేదు.. నాకు వేరే దిక్కులేదు.. ఆధారమూలేదు.. తిరిగే ఓపిక లేదు.. ఇప్పటికైనా పింఛను ఇప్పించండి’’ అంటూ ఎస్టీవీ నగర్‌కు చెందిన అంబిక అనే వృద్ధురాలు మంత్రి అమర్‌నాథరెడ్డి ముందు కన్నీరుపెట్టుకున్నారు. తిరుపతిలో గురువారం నగరదర్శిని కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 30వ వార్డు నెహ్రూనగర్‌లో పర్యటించారు. పలువురు రేషన్‌కార్డు, పింఛను, పక్కాగృహం కోసం ఆయనకు విన్నవించారు. ఈ సందర్భంలో వృద్ధురాలు అంబిక తన గోడు వెళ్లబోసుకుని భోరున విలపించడంతో అక్కడున్న వారంతా చలించిపోయారు. అదేవిధంగా ఎన్‌టీఆర్‌ గృహనిర్మాణ పథకం ద్వారా ఇల్లు వచ్చిందని, రూ.40 వేలు కట్టమంటున్నారని వాపోయింది.

కట్టే పరిస్థితిలో లేమని, ఏదైనా ఆర్థికం అందిస్తే రుణం తీర్చుకుంటామంటూ వేడుకుంది. మంత్రి స్పందిస్తూ, అన్నీ పరిశీలించి పింఛను వచ్చేలా చూడండని అక్కడున్న వారికి సూచించారు. ఎమ్మెల్యే అల్లుడు సంజయ్‌ ఆమె వివరాలను తెలుసుకుని, ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా అడుగడుగునా మంత్రికి వినతులు వచ్చాయి. అనంతరం మంత్రి స్థానిక మున్సిపల్‌ పాఠశాలలో పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వచ్చినట్టు చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేదా అని తెలుసుకునేందుకు నగరదర్శిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్‌ నరసింహయాదవ్, ఎమ్మెల్సీ పోతుల సునీత, దొరబాబు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, డీసీసీబీ చైర్మన్‌ ఆమాస రాజశేఖర్‌రెడ్డి, శాప్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌వర్మ, గంగమ్మగుడి ఆలయ చైర్మన్‌ ఆర్సీ మునికృష్ణ, నీలం బాలాజి, డీఈఈ రవీంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు