కరుణ లేని కరోనా!

9 May, 2020 12:19 IST|Sakshi
చెన్నమ్మ మృతదేహాన్ని తోపుడుబండిపై తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు

అనంతపురం హాస్పిటల్‌: కరోనాకు కరుణలేదేమో.. అవును.. నిజమేనేమో. కలికాలంలో కరోనా కాలమొచ్చింది. కంటికి కనిపించని జీవి.. ఎందరో ప్రాణాలను బలిగొంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ.. అందరినీ అవస్థలపాలు చేస్తోంది. నిట్టనిలువునా ప్రాణాలను తీస్తోంది. రోగమని వెళ్తే వైద్యులుండరు.. ఆపదని అరిచినా ఆస్పత్రులు తెరవరు. నలతగా ఉందన్నా..గుండెపట్టేసిందన్నా ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు కనీసం ఆటోలూ లేవు. 108 వాహనాలు రావడంలేదు.

ప్రాణాలు గాలిలో దీపమవుతున్నాయి. నగరంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన చెన్నమ్మ (70) శుక్రవారం రాత్రి ఉన్నపళంగా కుప్పకూలింది. కుటుంబీకులు ఆత్రంగా ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఎలాంటి వాహనాలు తిరగడంలేదు. ఆ సమయంలో ఆటోలు, ఇతర వాహనాలు అందుబాటులో లేక.. తోపుడు బండిపైన వృద్ధురాలిని హుటాహుటిన బస్టాండు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చూస్తుండగానే ప్రాణం పోయిందని కుటుంబీకులు బోరున విలపించారు. మృతదేహాన్ని అదే తోపుడు బండిపై ఇంటికి     తీసుకెళ్లడం హృదయ విదారకం.

మరిన్ని వార్తలు