అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌

11 Mar, 2019 03:10 IST|Sakshi

సీఎం, మంత్రులు ఫొటోలు, ప్రభుత్వ ప్రకటనల హోర్డింగ్స్‌ తొలగించాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లలో పథకాల వివరాలనూ తీసేయాలి

కొత్త పథకాలు, కార్యక్రమాలు చేపట్టరాదు

అధికారిక వాహనాలు, అతిథిగృహాలు, హెలికాప్టర్లు వినియోగించరాదు

అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు, ప్రభుత్వరంగ సంస్థలు, అథారిటీలకూ కోడ్‌ వర్తింపు

సాక్షి, అమరావతి: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. సీఎం, మంత్రుల ఫొటోలు, ప్రభుత్వ ప్రకటనలతో కూడిన హోర్డింగ్స్‌ తొలగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లలో పథకాల వివరాలతోపాటు ఆ వెబ్‌సైట్లలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలను తొలగించాలని నిర్దేశించింది. ప్రభుత్వ సొమ్ముతో ప్రచార ప్రకటనల జారీపై నిషేధం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన భవనాలపై ఎటువంటి రాజకీయ పోస్టర్లు అంటించరాదంది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గట్టిగా అమలు చేయాలని, ఈ విషయంలో అలసత్వం, నిర్లక్ష్యంగా, పక్షపాతంతో వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఎన్నికల నియమావళిని సీఎం, మంత్రులు, అధికారులు ఎవ్వరు ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదో వివరాలిలా ఉన్నాయి..

కొత్త పథకాలు, కార్యక్రమాలు చేపట్టరాదు..
ప్రభుత్వాలు ఎటువంటి కొత్త పథకాలను, కార్యక్రమాలను చేపట్టరాదు. ఇప్పటికే ప్రకటించిన పథకాలకు ఇప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేయరాదు. వర్క్‌ ఆర్డర్‌ఇచ్చినా పనులు ప్రారంభించకపోతే ఇప్పుడు ఆ పనులను చేపట్టరాదు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఆ పనులు చేపట్టరాదు. బడ్జెట్‌లో పేర్కొన్నప్పటికీ లేదా బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నప్పటికీ వాటిని ప్రారంభించకపోతే.. అటువంటి వాటిని ఇప్పుడు ప్రారంభించడానికి, అమలు చేయడానికి వీలులేదు. కొత్త ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపికను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు చేయరాదు. ఉపాధి హామీ కింద రిజిష్టర్‌ అయిన కూలీలకు పనులను మాత్రం కొనసాగించవచ్చు. వ్యక్తులకుగానీ, సంస్థలకు గానీ ఎటువంటి భూ కేటాయింపులు చేయరాదు. కేంద్ర గ్రామీణ పథకాలతోపాటు రాష్ట్ర పథకాలకు చెందిన ప్రాజెక్టులకు నిధుల విడుదల విషయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ఆర్‌బీఐ పర్యవేక్షణ చేయనుంది.

సీఎం, మంత్రులు అధికారిక సమీక్షలు జరపరాదు..
ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించరాదు. ఎటువంటి అధికారిక సమీక్షలు నిర్వహించరాదు. సీఎం, మంత్రుల జిల్లాల పర్యటనలో అధికారులు హాజరు కాకూడదు. అలాగే సీఎం, మంత్రులు అధికారిక వాహనాలను, అతిథిగృహాలను, హెలికాప్టర్లను వినియోగించరాదు. అధికారంలో ఉన్న పార్టీ పబ్లిక్‌ ప్రాంతాలను, హెలిపాడ్‌లను వినియోగిస్తే ఇతర పార్టీలకూ వాటిని వినియోగించుకునేందుకు అనుమతివ్వాలి. ముఖ్యమంత్రి, మంత్రులు విచక్షణాధికారిక నిధి నుంచి ఎటువంటి నిధులను మంజూరు చేయరాదు. రహదారుల నిర్మాణం చేపట్టడంగానీ, ఏదైనా ప్రాజెక్టు చేపడతామనిగానీ మంత్రులెవ్వరూ హామీలు ఇవ్వరాదు. ఎటువంటి కొత్త పనులను చేపట్టరాదు. టెండర్లను ఖరారు చేయరాదు. ఎటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను అధికారపార్టీ నిర్వహించరాదు. సంక్షేమ పథకాలకు కొత్తగా నిధులను విడుదల చేయరాదు. ఈ పథకాలపై మంత్రులు సమీక్షలు నిర్వహించరాదు. ఎంపీ, రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల నుంచి ఎటువంటి పనులను మంజూరు చేయరాదు. ఇలా చేయడానికి ముందు ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అమలు చేయాల్సిన కార్యక్రమాలకు ఈసీ అనుమతి తీసుకుని అమలు చేయవచ్చు.

బదిలీలపై పూర్తిగా నిషేధం..
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఉద్యోగులు, అధికారుల బదిలీపై పూర్తిగా నిషేధం ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్‌ అధికారి,  అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, ఇతర రెవెన్యూ అధికారుల బదిలీలపై నిషేధం కొనసాగుతుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలీసు అధికారులైన ఐజీ, డీఐజీ, సీనియర్‌ సూపరింటెండెంట్స్‌ ఆఫ్‌ పోలీసు, సూపరింటెండెంట్స్‌ ఆఫ్‌ పోలీసు, సబ్‌ డివిజనల్‌ పోలీసు ఆఫీసర్లైన డిప్యూటీ సూపరింటెండెంట్స్, ఇతర పోలీసు అధికారుల బదిలీపై నిషేధం ఉంటుంది. అలాగే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఇతర అధికారులు, ఉద్యోగుల బదిలీపై నిషేధం కొనసాగుతుంది. ప్రభుత్వ అపాయింట్‌మెంట్స్, పదోన్నతులు ఇవ్వరాదు. ప్రభుత్వరంగ సంస్థల్లోనూ వీటిపై నిషేధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థలు, మార్కెటింగ్, సహకార అటానమస్‌ జిల్లా కౌన్సిలింగ్‌ వాహనాల వినియోగంపై నిషేధం ఉంటుంది.

ప్రార్థనా ప్రదేశాల్లో ప్రచారం నిర్వహించరాదు..
దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు తదితర ప్రార్థనా ప్రదేశాల్లో ఎటువంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదు. ప్రసంగాలు కూడా చేయరాదు. ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన స్థలాల్లో వారి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారానికి సంబంధించి బ్యానర్లను, పోస్టర్లను వేయరాదు. ఒక పార్టీ సమావేశం జరిగే చోట నుంచి ఇంకొక పార్టీకి చెందిన ర్యాలీలు, నినాదాలను అనుమతించరు. ఒక పార్టీకి చెందిన పోస్టర్‌ను మరొక పార్టీ తొలగించరాదు. ఎన్నికల ప్రచార సమావేశాలకు స్థానిక సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. రాత్రి పది గంటల తరువాత ఎటువంటి ప్రచార సభలకు అనుమతించరు. కులం, మతం, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలను చేయరాదు.ఈ ఎన్నికల్లో సోషల్‌ మీడియా, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రచారాల వ్యయాన్ని కూడా ఎన్నికల వ్యయంలోకి పరిగణనలోకి తీసుకుంటారు.

ఎన్నికల కోడ్‌ కఠినంగా అమలు: ద్వివేది
రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు చేస్తామని, ఇందులో రాజీ లేదని, ఈ మేరకు కలెక్టర్లు, ఎస్‌పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించిన అనంతరం ఆయన సచివాలయంలో ఆదివారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం పసుపు–కుంకుమ కింద పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌లు ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని, అలాగే రుణమాఫీకి ఇప్పుడు జీవో జారీ చేయడాన్ని కూడా సంఘం దృష్టికి తీసుకువెళ్తామని, వారు ఎలా చెబితే అలా చేస్తామని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలతోపాటు అధికారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందన్నారు. అందరూ నియమావళిని పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుపై నివేదిక కోరగా.. పంపించానని, సంఘం ఏం చెబితే ఆ విధంగా చేస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌ నగదు బదిలీతోపాటు నగదు తరలింపుపై నిఘా కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఆదాయపు పన్ను శాఖ, వాణిజ్య పన్నులు, పోలీసులతోపాటు నోడల్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. 

మరిన్ని వార్తలు