-

నాలుగు జిల్లాల్లో కోడ్‌ సడలింపు

4 May, 2019 03:26 IST|Sakshi

తూర్పు గోదావరి, విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సహాయక చర్యలకు వీలుగా నిర్ణయం 

ఆ నాలుగు జిల్లాల్లో స్ట్రాంగ్‌ రూమ్‌లన్నీ భద్రం 

రీ–పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు 

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది    

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఎన్నికల నిబంధనలను సడలిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖను పరిశీలించాక తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంజిల్లాల్లో ఎన్నికల నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘ కార్యదర్శి కేపీ సింగ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. తుపాను సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ నాలుగు జిల్లాల్లో ఎన్నికల నిబంధనలను సడలించినట్లు ద్వివేది తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వర్షాలు అధికంగా కురిసిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో స్ట్రాంగ్‌ రూమ్‌లు భద్రంగా ఉన్నాయని, వర్షాలకు తడవకుండా వాటిని ప్లాసిŠట్‌క్‌ షీట్లతో కవర్‌ చేసినట్లు చెప్పారు. 

రీ–పోలింగ్‌కు సిద్ధం
రాష్ట్రంలో మే 6న నిర్వహించనున్న రీ–పోలింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ద్వివేది సమీక్ష నిర్వహించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఆయా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రీ–పోలింగ్‌ ప్రక్రియను అత్యంత ప్రశాంతంగా నిర్వహించాలని మాక్‌ పోలింగ్, ఇతర పోలింగ్‌ ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో టెంట్లు, ఇతర మౌలిక వసతులైన తాగునీరు తదితర ఏర్పాట్లను పూర్తిచేశామని, బందోబస్తుకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నట్టు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎన్నికల అధికారులు, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌లు సీఈవోకు వివరించారు. రీ–పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల పరిధిలో వెబ్‌–కాస్టింగ్‌¬తో పాటు మాన్యువల్‌ వీడియోగ్రాఫింగ్‌ కూడా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. రీ–పోలింగ్‌ జరిగే ఐదు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఐదుగురు ప్రత్యేక పరిశీలకులను నియమించామని, ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బెల్‌ ఇంజినీర్లను అందుబాటులో ఉంచనున్నట్లు ద్వివేది తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుంచి అదనపు ఎన్నికల అధికారులు సుజాతశర్మ, వివేక్‌ యాదవ్‌¬తో పాటు ఇతర అధికారులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. అంతకుముందు సర్వీసు ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘ ఐటీ సంచాలకులు వీఎన్‌ శుక్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 60,250 మంది సర్వీసు ఓటర్లున్నారని, శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 13,000 మంది ఉన్నట్లు తెలిపారు. మే 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా సర్వీసు ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియను తొలుత చేపడతామని, ఈ విషయంలో ఇప్పటికే సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులకు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు వివరాలు పంపినట్లు వివరించారు. 

కడప జేసీపై చర్యలకు సిఫార్సు
లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను విడుదల చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటికీ వైఎస్సార్‌ కడప జిల్లాలో రెండు థియేటర్లలో సినిమా ప్రదర్శించడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ థియేటర్ల లైసెన్సులు రద్దు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చినట్టు ద్వివేది తెలిపారు. సినిమా ప్రదర్శనను అడ్డుకోలేకపోయిన జేసీ కోటేశ్వరరావుపై చర్యలకు సీఈసీకి నివేదిక ఇచ్చినట్టు వివరించారు. 

మరిన్ని వార్తలు