జిల్లాలో మొదలైన ఎన్నికల కోలాహలం

11 Mar, 2019 08:29 IST|Sakshi

అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి

ఈసీ ఆదేశాలతో రంగంలోకి  అధికారులు

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు 

సాక్షి, చిత్తూరు, కలెక్టరేట్‌: జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది. సుమారు 31 లక్షల ఓటర్లు 14 మంది శాసనసభ్యులు, 3 ఎంపీలను ఎన్నుకునే ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. లోక్‌సభ, శాసన సభలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 18న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 25 కాగా, 26న నామినేషన్లను పరిశీలిస్తారు. ఇదే నెల 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఏప్రిల్‌11న పోలింగ్‌ జరుగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.
 

తక్షణమే నిబంధనలు అమల్లోకి..
తక్షణమే ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదివారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ భవనాలపై ఉన్న బ్యానర్లు కటౌట్లు, ఫ్లెక్సీలు 24 గంటల్లో తొలగించాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో 48 గంటల్లోగా తీసేయాలన్నారు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అధికార వాహనాలను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పథకాలపై ప్రభుత్వ ప్రకటనలను వెంటనే ఆపేయకుంటే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్, మొబైల్‌ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 


తొలివేటు..
ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై వేటు వేసేందుకు కలెక్టర్‌ ప్రద్యుమ్న వెనకాడడం లేదు. ఇందులో భాగంగా కుప్పం ఈడీటీ జీహెచ్‌ ఆనంద్‌ బాబును సస్పెండ్‌ చేశారు. అధికారులు ఉద్యోగులు మోడల్‌ కోడ్‌ను అనుసరించకపోతే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటానని ముందే హెచ్చరించారు. 

కఠినంగా వ్యవహరిస్తాం
ఎన్నికల నిర్వహణలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తాం. 22వేల మంది సిబ్బందితో ఎన్నికలకు రెడీ అయ్యాం. ఇంకా 200 ఈవీఎంలు రావాల్సి ఉంది. రాత్రి పది గంటల తరువాత ప్రచారం నిషిద్ధం. ఉదయం 6 గంటల తరువాతే ప్రచారానికి అనుమతి. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రచారం చేసుకోకూడదు. ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎన్నికలు నిర్వహించాలన్నదే నా ధ్యేయం. 
    –జిల్లా ఎన్నికల ప్రధానాధికారి పీఎస్‌ ప్రద్యుమ్న


38 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం
జిల్లాలో 38 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోనే 23  నెలకొల్పాం. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు వ్యక్తిగతంగా ఉంచుకోరాదు. అంతకంటే ఎక్కువ నగదు దొరికితే కేసు నమోదు చేస్తాం. సరైన డాక్యుమెంట్లు చూపే వరకు నగదు వెనక్కి ఇవ్వం.
    – విక్రాంత్‌ పాటిల్, ఎస్పీ

>
మరిన్ని వార్తలు