కరెంటోళ్ల ‘కోడ్‌’ ఉల్లంఘన

20 Mar, 2019 05:06 IST|Sakshi
1 ఈ నెల 17న ఏలూరు 3 పరిధిలో ఇచ్చిన కరెంటు బిల్లు, 2 బిల్లు వెనుక భాగంలో ముద్రించిన చంద్రబాబు ఫొటో

విద్యుత్‌ బిల్లులపై చంద్రబాబు ఫొటోను ముద్రించిన వైనం

సాక్షి, అమరావతి: తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్ధంగా నెలవారీ విద్యుత్‌ బిల్లులపై సీఎం చంద్రబాబు ఫొటోను ముద్రించారు. రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం దేనిపైనా ముఖ్యమంత్రి ఫోటోను ప్రచురించకూడదు. కానీ ఈ నెల 17వ తేదీన ఏలూరు 3 పరిధిలో ఇచ్చిన విద్యుత్‌ బిల్లులు వెనుక వైపు జగజ్జీవన్‌ జ్యోతి పథకం ప్రచురించారు.

ఇందులో ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మను ముద్రించారు. దీనిపై ఈపీడీసీఎల్‌ సీఎండీ రాజబాపయ్యను వివరణను కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. అయితే, క్షేత్రస్థాయి అధికారులు మాత్రం గతంలోనే ముద్రించి సిద్ధం చేసిన బిల్లు పేపర్లపై చంద్రబాబు బొమ్మ ఉందని చెప్పామని, ఆయన పట్టించుకోలేదని చెబుతున్నారు. వాస్తవానికి రాజబాపయ్యను రాత్రికి రాత్రే ఈపీడీసీఎల్‌ సీఎండీగా నియమించారు. దీనివెనుక రాజకీయ కారణాలున్నాయని, తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకే నోటిఫికేషన్‌ ఇవ్వాలనే నిబంధనలు సైతం పక్కనపెట్టి నియామకం చేశారనే చర్చ విద్యుత్‌వర్గాల్లో జరుగుతోంది. 

మరిన్ని వార్తలు