సమయం లేదు మిత్రమా

11 Mar, 2019 13:30 IST|Sakshi

మోగిన ఎన్నికల నగారా  

వేడెక్కిన రాజకీయం  

పార్టీల్లో మొదలైన సందడి

ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ26న పరిశీలన, 28న ఉపసంహరణ ఏప్రిల్‌ 11న పోలింగ్‌జిల్లాలో పార్లమెంట్‌ స్థానాలు : 3ఎస్సీ రిజర్వుడు పార్లమెంట్‌ స్థానం : అమలాపురంఅసెంబ్లీ నియోజకవర్గాలు : 19 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు : అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ఎస్టీ రిజర్వుడు రంపచోడవరం

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది.  పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులంతా అప్రమత్తమయ్యారు.  ఎన్నికల సంఘం ప్రకటనతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న అంశంతో మొదలై అనేక విషయాలపై రాజకీయ వర్గాల్లో సమాలోచనలు, చర్చోపచర్చలు మొదలయ్యాయి. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే గడువు ఉంది. నామినేషన్లకు వారం రోజుల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో బరిలో దిగుదామనే  కుతూహలంతో ఉన్న నేతలకు టెన్షన్‌ ప్రారంభమయింది. 

సాక్షి ప్రతినిధి, కాకినాడ : టిక్కెట్‌ ఖరారు కావాలి... నామినేషన్లకు సిద్ధమవ్వాలి...ఇది వారికొక సవాలే. ఈ విషయంలో మిగతా పార్టీలతో పోల్చితే వైఎస్సార్‌సీపీ పరిస్థితి కొంత అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా టీడీపీ విషయంలో ఇంకా స్పష్టత లేదు. మూడు పార్లమెంట్‌ స్థానాల్లోనూ సిట్టింగ్‌లు పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి క్లిష్టతరంగా మారిందనే చెప్పవచ్చు. మాకొద్దీ ఎంపీ సీటు అని సిట్టింగ్‌లు మొహం చాటేయడంతో సరైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతోంది. ఎమ్మెల్యే టిక్కెట్ల విషయంలో కూడా అదే గందరగోళం నెలకొంది. అభ్యర్థి ఎవరవుతారో చెప్పలేని స్థితిలో ఉంది. ఇక, వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి, టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఎవరికి టిక్కెట్‌ ఇవ్వాలన్న విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ స్థానాలపై మిగతా నేతలు కన్నేయడంతో అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైంది. పిరాయింపు నేతలకిస్తే అసమ్మతి ఎక్కువై, అసంతృప్తులు తిరుగుబాటు చేస్తారేమోనని ఒకవైపు భయపడుతోంది. అసమ్మతులకిస్తే పిరా యింపు నేతల మాటేమిటో అర్థంకాని స్థితి. ఈ పరిస్థితుల్లో సీట్ల ఖరారుపై ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో టీడీపీ అధిష్టానం ఉంది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేయడంతో ఆశావహులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

వైఎస్సార్‌ సీపీలో స్పష్టత...
వైఎస్సార్‌సీపీ మాత్రం సీట్ల విషయంలో ఓ స్పష్టతతో ఉంది. దీనికి తోడు ‘రావాలి జగన్‌– కావాలి జగన్‌’, అంతకుముందు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలు ప్రజల్లోనే ఉన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉన్న నేతలకు అండగా దాదాపు ప్రతి నియోజకవర్గంలో భారీ ఎత్తున చేరికలు జరుగుతుండటంతో వైఎస్సార్సీపీలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. ఎవరితోనూ పొత్తుల్లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలకు మరింత కలిసిసొచ్చినట్టయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌ రావడం తమకు సానుకూలంగా మారిందనే అభిప్రాయంతో వైఎస్సార్‌సీపీ నేతలంతా ఉన్నారు. ఇక, జనసేన విషయానికొస్తే ఏ ఒక్క నియోజకవర్గంలోనూ స్పష్టత లేదు. అభ్యర్థులెవరో తెలియని పరిస్థితి నెలకొంది. సినీ అభిమానమే తమకు పనికొస్తుందనే అభిప్రాయంతో ఆ పార్టీ ఆశావహులున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఎక్కువ స్థానాల్లో  వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉన్నట్టు స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు