వైఎస్ఆర్ సీపీకి ఈసీ గుర్తింపు

26 May, 2014 21:18 IST|Sakshi
వైఎస్ఆర్ సీపీకి ఈసీ గుర్తింపు

* శాశ్వత గుర్తుగా సీలింగ్ ఫ్యాన్
* ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగింపు
* ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిన్నటి వరకు నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో చూపిన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆ పార్టీ గుర్తుగా ఉన్న సీలింగ్ ఫ్యాన్‌ను ఇక శాశ్వత ప్రాతిపదికన కేవలం ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకే కేటాయించడం జరుగుతుంది.

ఇటీవల జరిగిన స్వార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఓట్లను, ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్, కేటాయింపు) ఉత్తర్వు 1968 కింది నిర్దేశించిన విధి విధానాలన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిందని, అందువల్ల ఆ పార్టీని గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఈ మేరకు ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ శర్మ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పంపారు. అంతేకాక ఈ ఉత్తర్వులకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వెలువడతుందన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి సీలింగ్ ఫ్యాన్ గుర్తును తొలగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు