వజ్రాయుధాన్ని వదలొద్దు

7 Apr, 2019 12:48 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నాను, ఓటరు గుర్తింపు కార్డు కూడా ఉంది. ఈసారి కూడా జాబితాలో పేరుంటుందిలే అని ఉదాసీనంగా ఉన్నారా.. అయితే ఒక్కసారి మేల్కొండి.. తక్షణం ఓటు ఉందో లేదో సరిచూసుకోండి.. చివరి నిముషంలో ఓటు కనిపించకపోతే విలువైన అవకాశాన్ని చేజార్చుకున్న వారు అవుతారు. ఒక్క సంక్షిప్త సందేశం, ఫోన్‌ కాల్‌ ద్వారా ఓటరు జాబితాలో పేరుందో లేదో తెలుసుకోవచ్చు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజలు తమ ఓటు పరిస్థితి  తెలుసుకోవటానికి ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా యాప్‌లు, టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. వాటి గురించి తెలుసుకుందాం.. 

టోల్‌ఫ్రీ నంబరు 1950: ఎన్నికల సంఘం 1950 కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈ నంబరుకు సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్‌) పంపించటం లేదా ఫోన్‌ కాల్‌ చేయటం ద్వారా ఓటరు జాబితాలో పేరుందో? లేదో తెలుసుకోవచ్చు. 
సంక్షిప్త సందేశం ఎలా పంపాలంటే: ఆంగ్లంలో ఈసీఐ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను టైప్‌ చేసి 1950 నంబరుకు పంపించాలి. వెంటనే జాబితాలో పేరుందా? లేదా అనేది ఓటరు ఫోన్‌ నంబరకు సందేశం వస్తుంది. ఏ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు ఉందో తెలుసుకునేందుకు ఆంగ్లంలో ఈసీఐపీఎస్‌ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేసి 1950కు సంక్షిప్త సందేశం పంపిస్తే సమాధానం వస్తుంది.
ఫోన్‌కాల్‌ ద్వారా: 1950 నంబరుకు ఫోన్‌ చేసి, ఓటరు తన వివరాలు చెబితే జాబితాలో పేరుందా? లేదా చెబుతారు.

వెబ్‌సైట్లలో ఎలా సరిచూసుకోవాలి?
1. www. ceoandhra. nic. in వెబ్‌సైట్‌లోకి వెళ్లిపై భాగంలో ఉన్న ‘సెర్చ్‌ యువర్‌ నేమ్‌’ దగ్గరకు వెళ్లండి. అందులో అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెళితే నేరుగా నేషనల్‌ ఓటరు సర్వీసు పోర్టల్‌కు తీసుకెళ్తుంది. అక్కడ వివరాలు నమోదు చేస్తే ఓటరు జాబితాలో పేరుందో లేదో తెలుస్తుంది.
2. www. nvsp. in వెబ్‌సైట్‌లోకి వెళితే పేజీకి ఓ పక్కన ‘సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఇన్‌ ఎలక్టోరల్‌ రోల్‌’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి, మీ పేరు, ఊరు వివరాలు నమోదు చేస్తే వివరాలు వస్తాయి.యాప్‌ ద్వారా..గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ‘ఓటర్‌ హెల్ప్‌లైన్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అనంతరం యాప్‌లో పేరు, నియోజకవర్గ వివరాలు టైప్‌చేయగానే ఓటు పరిస్థితి తెలుస్తుంది.

ఓటు నమోదుతోపాటు తప్పులు సరిదిద్దుకోవడం ఓటు బదిలీ లాంటివి కూడా ఇంటివద్దనే చేసుకునేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు కూడా చేయవచ్చు. ఈ ఎన్నికల్లో ఈవీఎంతోపాటు వీవీప్యాట్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఎలా వినియోగించుకోవాలో కూడా యాప్‌ద్వారా తెలుసుకోవచ్చు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన దగ్గర నుంచి ఓటు వేసి తిరిగి వచ్చే వరకు ఎలా వ్యవహరించాలన్న దానికి సంబంధించిన లఘుచిత్రాలు యాప్‌లో అందుబాటులో ఉంచారు.

ఎన్నికల కమిషన్‌ ఎప్పటికప్పుడు చేసే ప్రకటనలు, ప్రజలకు అందించే సందేశాలు కూడా యాప్‌ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీచేసే ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలతోపాటు అన్ని అంశాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.. వాటి షెడ్యూల్స్‌ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది.

దీంతోపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలను కూడా ఈ యాప్‌ద్వారా తెలుసుకునేందుకు వీలుంది. మీసేవా కేంద్రాల్లో ఓటు ఉందో లేదో చెక్‌ చేసుకోవచ్చు. 

మీ ఓటు పోయిందా.. అయితే టెండర్‌ ఓటు వేయండి
కొన్ని సమయాల్లో ఓటరు ఓటు వేయడానికి వచ్చే సరికి ఓటును ఇంకెవరో వేసి వెళ్లడం చూస్తాం. అలాంటి సందర్భంలో సదరు ఓటరు వివరాలను ప్రీసైడింగ్‌ అధికారి పరిశీలిస్తారు. అతడు వాస్తవంగా ఓటు వేయలేదని నిర్ధారణకు వస్తే అతనికి ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దీన్నే టెండర్‌ ఓటు అంటారు.

ఇందుకోసం ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో 20 చొప్పున బ్యాలెట్‌ పేపర్లు అందుబాటులో ఉంటాయి. ఈ బ్యాలెట్‌ను తీసుకుని ఓటర్‌ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఓటు వేసి ఆ పత్రాలను కవర్‌లో పెట్టి ప్రీసైడింగ్‌ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. పత్రం వెనుక ఇంకుతో టెండర్‌ బ్యాలెట్‌ అని అధికారులు రాస్తారు. 

చాలెంజ్‌ ఓటు.. 
ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటర్‌ తన గుర్తింపును చాలెంజ్‌ చేసి రుజువు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్‌ అభ్యంతరం చెబితే ఓటర్‌ను.. ఏజెంట్‌ను ప్రీసైడింగ్‌ అధికారి వద్దకు పంపుతారు.

అభ్యంతరం చెప్పిన ఏజెంట్‌ నుంచి రూ. 2 చాలెంజ్‌ ఫీజుగా తీసుకుంటారు. అప్పుడు ఓటర్‌ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్‌ఓను పిలిచి అతడు స్థానిక ఓటరా కాదా అనే విషయం.. పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు.

అతడు స్థానిక ఓటరై, జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే వయన్సు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రీసైడింగ్‌ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్‌ను, ఓటరును పోలీసులకు అప్పగించవచ్చు. 

మరిన్ని వార్తలు