ఈసీ పరిశీలనలో జనసేన పార్టీ

9 Aug, 2014 02:20 IST|Sakshi
ఈసీ పరిశీలనలో జనసేన పార్టీ

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అనంతరం గత కొంతకాలంగా రాజకీయమౌనం పాటించిన సినీనటుడు పవన్ కల్యాణ్ ఇక తన రాజకీయ పార్టీని విస్తృతం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన గతంలో ప్రకటించిన జనసేన పార్టీని రాజకీయ పార్టీగా నమోదు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు సమర్పించగా, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల మేరకు దరఖాస్తును పరిశీలించిన ఎన్నికల సంఘం ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తిచేసే పనిలో పడింది. లోక్‌సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 11 న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో పవన్ కల్యాణ్ తొలిసారి ‘జనసేన’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
 
  ఇటీవలి కాలంలో ఆయన జనసేనను రాజకీయ పార్టీగా నమోదు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. అందులో పార్టీ అధ్యక్షుడు, చైర్మన్‌గా కె. పవన్ కల్యాణ్ ఉంటారని పేర్కొన్నారు. పార్టీ జనరల్ సెక్రెటరీగా పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన బి.రాజు రవితేజ్, కోశాధికారిగా ఎం. రాఘవయ్య పేర్లతో నమోదు చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని లివింగ్ స్పేసెస్ వ్యాలీ వ్యూ, కండొమోనియం, ప్లాట్ నంబర్ 91, రెండో అంతస్తు పార్టీ కార్యాలయంగా పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా నమోదు చేయాలని పవన్ కల్యాణ్ సమర్పించిన దరఖాస్తుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈ నెల 23 లోగా తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటన జారీ చేసింది.

మరిన్ని వార్తలు