‘స్థానిక’ షెడ్యూల్‌ నేడే

7 Mar, 2020 04:55 IST|Sakshi

ప్రధాన పార్టీలతో సంప్రదింపులు పూర్తి: ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌

భిన్నాభిప్రాయాలు సహజమే.. ఏకాభిప్రాయం కోసం భేటీ కాదు

ఎన్నికల ప్రక్రియను సరళీకృతం చేసే నిర్మాణాత్మక సూచనలను పరిశీలిస్తాం

కొత్తగా ఓటర్లను చేర్చుకోవడం ఇప్పుడు సాధ్యం కాదు

ఎన్నికలకు ఇబ్బంది లేకుండా పదో తరగతి పరీక్షలు వాయిదా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమని వెల్లడి

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్రంలో ముఖ్యమైన రాజకీయ పార్టీలన్నింటితో తుది సంప్రదింపులు పూర్తయ్యాయని, శనివారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో వివిధ రాజకీయ పక్షాలతో సమావేశం అనంతరం కమిషన్‌ కార్యదర్శి రామసుందర్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ సత్యరమేష్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తాయని, ఇది అందరిలోనూ ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఉద్దేశించిన సమావేశం కాదన్నారు. ఎన్నికల ప్రక్రియను సరళీకృతం చేసే నిర్మాణాత్మక సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు.

అంతకుముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లతో కలసి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నతాధికారులు గిరిజా శంకర్, జి.విజయ కుమార్, ఎన్నికల కమిషనర్‌ కార్యాలయ కార్యదర్శి ఎస్‌.రామసుందర రెడ్డి, జాయింట్‌ కార్యదర్శి ఏవీ సత్యరమేష్, విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. 
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ 

ఎన్నికల కమిషనర్‌ ఏమన్నారంటే..
– పరీక్షలు జరుగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఇబ్బందని కొన్ని పార్టీలు సమావేశంలో ప్రస్తావించాయి. ఈ నెల చివరి వారంలో మొదలయ్యే పదో పరీక్షలను వాయిదా వేసి ఏప్రిల్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం ఉందని కమిషన్‌ భావించేందుకు ఇది కూడా కారణం.
– సభలు, సమావేశాల నిర్వహణకు కలెక్టర్‌ ద్వారా అనుమతులిస్తాం.
– గతంలో జారీ అయిన కుల ధృవీకరణ పత్రాలను ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల నిమిత్తం మీసేవ కేంద్రాలకు అందే దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాం. 
– కరోనా వైరస్‌ వల్ల మన దగ్గర పెద్దగా ఇబ్బంది లేదనేది నా అభిప్రాయం. 
–– ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేవన్నీ శిక్షార్హమైనవేనని గతంలోనూ నిబంధనలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక చట్టంతో ప్రయోజనం ఉంటుంది. అనర్హత వేటు తప్పు నిర్ధారణ అయిన తర్వాతే ఉంటుంది. 
–– వలంటీర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని కొన్ని పార్టీలు సూచించాయి. సిబ్బంది తగ్గితే ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన గ్రామ సచివాలయ సిబ్బందిని వినియోగించుకుంటాం. అంగన్‌వాడీ కార్యకర్తలను ఇంకు మార్పిడి లాంటి పనులు అప్పగిస్తాం. ప్రభుత్వేతర సిబ్బందిని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. 
––హేతుబద్ధంగానే ఎన్నికల షెడ్యూల్‌. అన్నీ దృష్టిలో పెట్టుకొనే నోటిఫికేషన్‌ ఇస్తాం.
––కొత్తగా ఓటర్లను చేర్చుకోవడం ఇప్పుడు సాధ్యం కాదు. 
–– ఈవీఎంలపై రాజకీయ పార్టీలు అపనమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. బ్యాలెట్‌ పేపరుతో ఎన్నికలు నిర్వహిస్తున్నాం. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఈవీఎంలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. 
–– ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాకే ప్రవర్తనా నియమావళి అమలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పరిధిలోకి వస్తుంది. కోడ్‌ అమలు వచ్చిన నాటి నుంచి  ఫిర్యాదులపై పరిశీలిస్తాం. 

‘2018 లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రతిపక్ష టీడీపీ ఎన్నికలు అంటే భయపడుతోంది. కరోనా వైరస్‌ ఉందంటూ పారిపోతోంది. ఎన్నికలు జరగకుండా కుట్రలు చేస్తోంది’
––జోగి రమేష్, వైసీపీ ఎమ్మెల్యే.

 ‘పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి’
–––పాతూరి నాగభూషణం..బీజేపీ

‘మద్యం, ధన ప్రభావం లేకుండా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలన్న సీఎం వాఖ్యలను స్వాగతిస్తున్నాం. మా పార్టీ ఇదే వైఖరితో ఉంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి’
––వెంకటేశ్వరరావు, సీపీఎం నేత

‘స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని కోరాం’
– జల్లి విల్సన్, మాజీ ఎమ్మెల్సీ , సీపీఐ

‘ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదు. కరోనా వైరస్‌ ప్రభావం ఉందని చెప్పాం. రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ 
––వర్ల రామయ్య, టీడీపీ.  

గవర్నర్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భేటీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ కుమార్‌ శుక్రవారం గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్‌కు నివేదించారు. ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.  
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌   

మరిన్ని వార్తలు