పారదర్శకంగా కౌంటింగ్‌ ప్రక్రియ

17 May, 2019 13:25 IST|Sakshi
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌

 కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌

విజయనగరం గంటస్తంభం: సాధారణ ఎన్నికల కౌంటింగ్‌ పక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం. హరి జవహర్‌లాల్‌ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ ప్రక్రియ తీవ్రతను గుర్తించి అందుకు అనుగుణంగా బాధ్యతగా లెక్కింపు చేపట్టాలన్నారు. ఈనెల 23న జరగనున్న కౌంటింగ్‌కు సంబంధించి ఏఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో గురువారం స్థానిక కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలను ఆకళింపు చేసుకోవాలన్నారు. పోలింగ్‌ పక్రియ కంటే కౌంటింగ్‌ పక్రియ భిన్నంగా ఉంటుందన్నారు. కౌంటింగ్‌ పక్రియను ఎన్నికల కమిషన్‌ కూడా పరిశీలిస్తుందని చెప్పారు.

ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉండే దుస్తులు వేసుకోకుండా ఉండాలని.. కౌంటింగ్‌ ఏజెంట్లు ఎంత పరిచయస్తులైనా వారితో అధిక సమయం సంభాషించకూడదని సూచించారు. దీనివల్ల రాజకీయ పక్షాల నాయకులకు అనుమానాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఎటువంటి సమస్యలెదురైనా రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గుర్తింపు కార్డులు లేని పక్షంలో ఎట్టిపరిస్థితుల్లో లోపలకు అనుమతించరని, మూడు అంచెల్లో పోలీస్‌ తనిఖీలు ఉంటాయన్నారు. అలాగే ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించరన్నారు.  కార్యక్రమంలో డీఆర్వో జె. వెంకటరావు, స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు