ఎన్నికల కసరత్తు షురూ

25 Jan, 2014 04:00 IST|Sakshi

 రానున్న సార్వత్రిక ఎన్నికలకు     ఎలక్షన్ కమిషన్ కసరత్తు వేగవంతం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీల ప్రక్రియ, పోలింగ్‌బూత్‌ల ఖరారు, ఓటర్ల జాబితాలకు తుదిరూపునిచ్చే కార్యక్రమాల్లో యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉండే అధికారుల బదిలీ ప్రక్రియ మొదలైంది. జిల్లాకు చెందిన, జిల్లాలో మూడేళ్ల కాలం పూర్తి చేసుకుని ఎన్నికల విధులతో సంబంధమున్న ఆరుగురు అధికారులు, 51 మంది తహశీల్దార్లు, 54 మంది ఎంపీడీవోలకు స్థానచలనం కలుగనుంది. ఫిబ్రవరి 10లోపే బదిలీలు పూర్తయ్యేలా గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఎస్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.
 - న్యూస్‌లైన్, కలెక్టరేట్
 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. మే 31 నాటికి జిల్లాలో మూడేళ్ల సర్వీస్ పూర్తయ్యే అధికారులను బదిలీ చేయనున్నారు. మెడికల్ లీవ్‌లో ఉన్నవారిని, మే లోపు పదవీ విరమణ చేసే వారిని ఎన్నికల విధుల నుంచి మినహాయించారు. ఈ మార్గదర్శకాల ప్రకారం రెవెన్యూ శాఖలో అధికారుల బదిలీల జాబితా ఇప్పటికే సిద్ధమైంది.
 
 స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, తహశీల్దార్ స్థాయి అధికారులు, ఎంపీడీవోల బదిలీకి రెండు వేర్వేరు జాబితాలను రూపొందించారు. వీరందరిని ఫిబ్రవరి 5లోపే బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చేనెల 10 నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సులను స్థానభ్రంశమైన అధికారులతోనే నిర్వహించాలని యోచిస్తున్నారు. కలెక్టర్ ద్వారా ఇప్పటికే స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోల జాబితాను సీసీఎల్‌ఏకు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటివారంలోనే ఎన్నికల సన్నాహాలను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
 
 మిగిలేది కొందరే...
 బదిలీ జాబితాలో ఆరుగురు అధికారులుండగా, ఇందులో జిల్లాకు చెందినవారు ఐదుగురు... వరదకాలువ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఐలయ్య, రామగుండం స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ డేవిడ్, జెడ్పీ సీఈవో చక్రధర్, డ్వామా పీడీ మనోహర్, పెద్దపెల్లి ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారిలో మంథని ఆర్డీవో అయేషాఖానమ్ ఉన్నారు. దీంతో వీరికి బదిలీ అనివార్యంగా మారింది.
 
 జిల్లాలో 57 మంది తహశీల్దార్లు ఉండగా, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు కావడంతో అందులో 51 మందిని బదిలీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న రెవెన్యూ అధికారులనే బదిలీ చేయగా, ఈసారి ఎంపీడీవోలను కూడా బదిలీల జాబితాలో చేర్చారు. జిల్లాలో పనిచేస్తున్న 57 మంది ఎంపీడీవోల్లో 54 మంది ఇదే జిల్లాకు చెందినవారు కావడంతో వారందరికీ స్థానచలనం కలుగనుంది.
 
 ఇతర జిల్లాలకు చెందినవారు కావడంతో నలుగురు తహశీల్దార్లు జిల్లాలో ఉండే అవకాశముంది. అందులో మానకొండూర్, హుజూరాబాద్, కోనరావుపేట, ఎలిగేడ్ తహశీల్దార్లున్నారు. ఆరు నెలల్లోపు పదవీ విరమణ పొందనున్న సొంత జిల్లాకు చెందిన వారిలో పెద్దపల్లి, కోహెడ తహశీల్లార్లకు బదిలీ నుంచి మినహాయింపు లభించింది.
 
 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
 సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అధికారిక ఏర్పాట్లన్నింటికీ సన్నద్ధమవుతోంది. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 3,393 పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పించేందుకు తహశీల్దార్లు, ఎస్సైలు, బూత్‌లెవల్ అధికారులు పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ బూత్‌లను గుర్తించి ఎన్నికల అధికారులకు నివేదిక అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 31న ఆర్డీవోలు, తహశీల్దార్లు, అన్ని పోలింగ్ స్టేషన్లలో తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు.
 

మరిన్ని వార్తలు