ఎన్నికల వేళ.. ఎవరూ పట్టించుకోరని..!

14 Mar, 2019 12:34 IST|Sakshi
తహసీల్దారు ఏర్పాటు చేసిన బోర్డు

చిత్తూరులో రూ.కోట్ల విలువైన భూమి కబ్జా

టీడీపీ నాయకుడి అండతో ప్రభుత్వ స్థలం ఆక్రమణ

మౌనం వహిస్తున్న రెవెన్యూ అధికారులు

సాక్షి, చిత్తూరు అర్బన్‌: అసలే ఎన్నికల సీజన్‌. అధికారులంతా ఎన్నికల పనిలో బిజీ బిజీగా ఉన్నారు. విలువైన స్థలం. గుట్టుచప్పుడు కాకుండా చెరబడితే రూ.కోట్లు సంపాదించేయొచ్చనుకున్నాడు చిత్తూరుకు చెందిన ఓ టీడీపీ కార్యకర్త. ఇదే విషయాన్ని జిల్లా టీడీపీలోని ఓ నాయకుడి చెవినపడేశాడు. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో సదరు టీడీపీ కార్యకర్త గంటల వ్యవధిలో ప్రభుత్వ స్థలంలో తహసీల్దారు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి కబ్జా చేసేస్తున్నాడు. 


చిత్తూరు నగరంలోని గంగాసాగరం ఆనుకుని అనుప్పల్లె రెవెన్యూ గ్రామంలో 64 సెంట్ల భూమి ఉంది. చాలా కాలంగా దీన్ని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి బెంగళూరుకు చెందిన ఓ టీడీపీ కార్యకర్త విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతనికి జిల్లా టీడీపీలోని ఓ నాయకుడి అండ ఉండడంతో పలుమార్లు ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులు అడ్డుకుంటూ వస్తుండడంతో మధ్యలోనే పనులు ఆపేస్తూ వస్తున్నాడు. మార్కెట్‌లో దీని విలువ రూ.కోట్లలో ఉంటుంది. ఈ స్థలాన్ని పాఠశాలకు ఇవ్వాలని, సొంత ఇళ్లు లేని ఎస్సీ, బీసీలకు ఇవ్వాలనే ప్రతిపాదనలు రావడంతో అధికారులు దీన్ని రక్షించడానికి ఏడాది క్రితం చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ స్థలంలోకి ఎవరైనా రావాలనుకున్నా.. ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ బోర్డు కూడా ఏర్పాటు చేయించారు. అయితే ఉన్నఫలంగా ఈ బోర్డును తొలగించిన వ్యక్తి జేసీబీ సాయంతో స్థలాన్ని చదును చేసి, కబ్జా చేసేశాడు. 


అధికారులు బిజీ..
ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో అధికారులంతా బిజీగా ఉంటారని.. త్వరగా పని కానిచ్చేయమని జిల్లా టీడీపీలోని ఓ నాయకుడి ఆదేశాలతో రంగంలోకి దిగిన టీడీపీ కార్యకర్త స్థలాన్ని తన ఆధీనంలోకి తీసేసుకున్నాడు. పైగా దీన్ని తహసీల్దారు, ఆర్డీఓలు తన స్థలంగా తేల్చారంటూ గ్రామస్తులకు చెబుతున్నాడు. ఇన్నాళ్లు ప్రభుత్వ భూమిగా ఉన్నది.. ఉన్నట్టుండి ప్రైవేటు వ్యక్తికి ఎలా మారిపోతుందని గ్రామస్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి అధికా రులు, టీడీపీ వారికి అనుకూలంగా ప్రభుత్వ స్థలాన్ని దోచిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. 

జేసీ ఆగ్రహం..
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయం జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులపై ఆయన ఫైర్‌ అయ్యారు. భూమిని ఆక్రమించుకున్న వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని చిత్తూరు తహసీల్దారును ఆదేశించారు. మళ్లీ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అప్పటికప్పుడు తడుముకున్న రెవెన్యూ అధికారులు గంగాసాగరంలో హెచ్చరిక బోర్డునైతే ఏర్పాటు చేశారుగానీ.. ఆక్రమించేందుకు యత్నించిన టీడీపీ కార్యకర్తపై కేసు పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు